17
1 ✝జగడంతో నిండిన ఇంట్లో సంతృప్తిగా తినడంకంటే ప్రశాంతితో వట్టి రొట్టెముక్క తినడం మేలు.2 ✝సిగ్గు కలిగేలా ప్రవర్తించే కొడుకుమీద తెలివైన సేవకుడు అధికారం చేస్తాడు, సోదరులతో పాటు పిత్రార్జితం పంచుకుంటాడు.
3 ✽ వెండికోసం మూస ఉంది. బంగారం కోసం కొలిమి ఉంది. హృదయాలను పరీక్షించేది యెహోవాయే.
4 చెడ్డవారు చెడ్డ మాటలు వింటాడు. అబద్ధికుడు వినాశకరమైన మాటలు పాటిస్తాడు.
5 బీదవారిని హేళన చేసేవారు వారి సృష్టికర్త✽ను నిందిస్తున్నారన్నమాట. విపత్తును చూచి, సంతోషించే వారికి శిక్ష తప్పదు✽.
6 ముసలివారికి మనుమలు, మనుమరాండ్రు కిరీటంలాంటివారు. తమ పూర్వీకులు పిల్లలకు శోభ.
7 డాంబికంగా మాట్లాడడం మూర్ఖులకు కూడదు. అబద్ధాలాడే పెదవులు అధికారి✽కి మరీ అయోగ్యం.
8 లంచం✽ ఇచ్చేవాడు అది తాయెత్తులాగా పని చేస్తుందనుకుంటాడు. ఎటు తిరిగినా, తనకు అభివృద్ధే అనిపిస్తుంది.
9 అతిక్రమాన్ని కప్పివేసేవారు✽ ప్రేమ✽ను వృద్ధి చేస్తారు. వెనకటి విషయాలను మళ్ళీ చెప్పేవారు స్నేహితులను విడదీస్తారు✽.
10 ✝మూర్ఖుడు నూరు దెబ్బలకు గురి కావడం వల్ల నేర్చుకొనే దానికంటే, బుద్ధిమంతుడు ఒక్క మందలింపు మాటవల్ల నేర్చుకొనేది ఎక్కువ.
11 దుర్మార్గులు తిరుగుబాటు చేయాలనే చూస్తారు. అందుచేత వారిమీదికి నిర్దయుడైన దూత వస్తాడు.
12 ✽పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటినైనా తారసిల్లవచ్చు గాని, మూర్ఖంగా ప్రవర్తించే మూఢుణ్ణి కలుసుకోవడం కష్టతరం!
13 ✽ మేలు చేసినవారికి కీడు చేసేవారి ఇంటినుంచి కీడు ఎన్నడూ తొలగిపోదు.
14 ✽ కలహ ప్రారంభం ఆనకట్టలో పగులులాంటిది. జగడం మొదలు కాకముందే దాన్ని విసర్జించు.
15 ✽దుర్మార్గులను నిర్దోషులనీ, నిర్దోషులను దుర్మార్గులనీ తీర్పు చెప్పడం రెండూ యెహోవాకు అసహ్యం.
16 ✽జ్ఞానాన్ని కొనుక్కొనేందుకు మూర్ఖుడి చేతిలో డబ్బెందుకు ఉండాలి? అతడికి తెలివి లేదు గదా!
17 ✝స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తాడు. అలాంటివాడు ఆపదలో సోదరుడుగా ఉంటాడు.
18 ✝పొరుగువాడికి జామీను ఉండి, అతడి పక్షాన హామీగా నిలబడేవాడు తెలివితక్కువవాడు.
19 ✽అతిక్రమపరులకు కలహాలంటే ఇష్టం. తలుపులు ఎత్తు చేసేవాడు✽ నాశనం కోరి తెచ్చుకుంటాడు.
20 వక్రబుద్ధి గలవారికి మేలు కలగదు. కుటిలంగా మాట్లాడేవారు కీడులో పడతారు.
21 మూర్ఖుణ్ణి కన్న తండ్రికి శోకం, మూఢుడి తండ్రికి సంతోషం ఉండదు.
22 ✝హృదయంలో ఆనందం ఉంటే అది ఆరోగ్యకరం. మనసు విరిగితే, ఎముకలు ఎండిపోతాయి.
23 ✽న్యాయాన్ని చెడగొట్టేందుకు దుర్మార్గుడు రహస్యంగా లంచం పుచ్చుకుంటాడు.
24 వివేకి కళ్ళెదుటే జ్ఞానం ఉంటుంది. మూర్ఖుడి చూపులు భూమి కొనల✽వైపే ఉంటాయి.
25 కొడుకు మూర్ఖుడైతే తండ్రికి శోకం. వాణ్ణి కన్న తల్లికి దుఃఖం.
26 నిర్దోషులను దండించడం, అధికారులను వారి యథార్థ ప్రవర్తనకు శిక్షించడం మంచిది కాదు.
27 ✝మాటల్లో పొదుపు పాటించేవారు తెలివైనవారు. శాంతిస్వభావులు వివేకం గలవారు.
28 మూర్ఖుడైనా, మౌనంగా ఉంటే, జ్ఞాని అనిపించుకోవచ్చు. అతడు పెదవులు మూసుకొంటే, అతణ్ణి వివేకి అంటారు.