16
1  హృదయంలోని ఉద్దేశాలు మనిషికి చెందినవే. నాలుకనుంచి వెలువడే జవాబు యెహోవా నుంచి వస్తుంది. 2 మనిషి ప్రవర్తన అంతా అతడి దృష్టికి శుద్ధంగా కనిపిస్తుంది. యెహోవా మనసులను పరిశీలిస్తాడు.
3 యెహోవాకు నీ కార్యకలాపాలన్నీ అప్పగించివెయ్యి. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలం అవుతాయి.
4 యెహోవా ప్రతిదాన్నీ ఏదో ఉద్దేశంతో సృజించాడు. దుర్మార్గులను నాశనం జరిగే రోజుకోసం నియమిస్తాడు.
5  అహంభావులందరినీ యెహోవా అసహ్యించుకొంటాడు. అలాంటివాళ్ళకు దండన ఏ మాత్రమూ తప్పదు.
6 కరుణా సత్యమూ ఏకమై, అపరాధాన్ని కప్పివేస్తాయి. యెహోవాపట్ల భయభక్తులవల్ల మనిషి దుర్మార్గం నుంచి వైదొలగుతాడు.
7  మనిషి ప్రవర్తన యెహోవాకు ప్రీతిపాత్రమైతే అతడి శత్రువులు కూడా అతడితో సఖ్యపడేలా ఆయన చేస్తాడు.
8  అన్యాయంగా సంపాదించినది ఎంత ఉన్నా, దానికంటే న్యాయ ప్రవర్తనతో కూడిన కొంచెమే మేలు.
9 మనిషి తన విధానాలను మనసులో ఆలోచించు కుంటాడు. యెహోవా అతడి మార్గాన్ని రూపొందిస్తాడు.
10 రాజు పెదవుల నుంచి దైవిక తీర్మానం వెలువడుతుంది. అతడి నోటి మాట తీర్పు చెప్పేటప్పుడు న్యాయం తప్పకూడదు.
11 న్యాయసమ్మతమైన త్రాసు, తూనికరాళ్ళు యెహోవా చేసిన ఏర్పాట్లు, సంచిలో ఉన్న తూనిక గుండ్లన్నీ ఆయన రూపొందించినవే.
12 రాజులు చెడుగు చేయడం చెడ్డ అసహ్యం. న్యాయం మూలంగా సింహాసనం సుస్థిరం అవుతుంది.
13 నిజాయితీతో మాట్లాడే పెదవులు రాజులకు ప్రీతిపాత్రమైనవి. యథార్థంగా పలికేవారు ప్రేమపాత్రులు.
14 రాజు ఆగ్రహం మరణదూత లాంటిది. జ్ఞాని ఆ కోపాగ్నిని శాంతపరుస్తాడు.
15 రాజు ముఖకాంతిలో జీవం ఉంది. రాజు దయ వసంతకాల వర్షం లాంటిది.
16 బంగారాన్ని సంపాదించే కంటే జ్ఞానాన్ని సంపాదించడం ఎంతో మంచిది. తెలివిని ఆర్జించుకోవడం వెండి సంపాదనకంటే ఎంతో శ్రేష్ఠం.
17 నిజాయితీపరులకు చెడుగును తొలగి నడవడం రాజమార్గంలాంటిది. తన దారిని కనిపెట్టి నడిచేవాడు తన ప్రాణం దక్కించుకుంటాడు.
18 గర్వం ముందుంటే, దాని వెనకాలే నాశనం నడుస్తుంది. అహంభావం వెంట పతనం వస్తుంది.
19 గర్విష్ఠులతో కొల్లగొట్టిన ధనం పంచుకోవడం కంటే దీనావస్థలో ఉన్నవారితో వినయశీలిగా ఉండిపోవడం మేలు.
20 ఉపదేశం సావధానంగా వినేవారికి మేలు ప్రాప్తిస్తుంది. యెహోవాను నమ్ముకొనేవారు ధన్యులు.
21 హృదయంలో జ్ఞానం ఉన్నవారు వివేకి అని పేరు పొందుతారు. మధుర వాక్కులు విద్యాభివృద్ధికి దోహదం.
22  తెలివి ఉన్న వారికి వారి తెలివి జీవం యొక్క ఊటలాంటిది. మూఢుల క్రమశిక్షణ మూఢత్వమే.
23 జ్ఞాని హృదయం అతడి నోటికి బోధిస్తుంది, పెదవులకు విద్యాబుద్ధులు వృద్ధిచేస్తుంది.
24 కమ్మని మాటలు తేనె తెట్టెలాంటివి. అవి ప్రాణానికి మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యకరం.
25 మనిషి దృష్టికి సరైనదిగా కనబడే మార్గం ఉంది. కాని, దాని గమ్యం మరణమే.
26 పాటుపడేవారి ఆకలి వారి పక్షాన పని చేస్తుంది. నోరు తినమంటుంది.
27 వట్టిపోకిరీ దురాలోచన చేస్తాడు. అతడి పెదవులమీద కారు చిచ్చు.
28 మూర్ఖులు కలహం రేపుతారు. చాడీ చెప్పేవారు సన్నిహిత స్నేహితులను విడదీస్తారు.
29 దౌర్జన్యపరుడు పొరుగువాణ్ణి ఆకర్షించి, అతణ్ణి పెడ దారి పట్టిస్తాడు.
30 పెదవులు బిగబట్టి, కండ్లు మూస్తూ తెరుస్తూ ఉండేవారు యుక్తులు చేస్తున్నారు, చెడుగు జరిగిస్తారు.
31 నెరసిన వెండ్రుకలు తలకు అందమైన కిరీటంలాంటివి. అవి న్యాయ పథంలో నడిచేవారికి కలుగుతాయి.
32 త్వరగా కోపగించుకోనివాడు బలాఢ్యుడికంటే శ్రేష్ఠుడు. పట్టణాన్ని వశం చేసుకొనేవాడికంటే, మనసును అదుపులో ఉంచుకొనేవాడు శ్రేష్ఠుడు.
33 ఒడిలో చీట్లు వేస్తారు. వాటిమూలంగా కలిగే నిర్ణయం యెహోవా వశం.