15
1 ✽మృధువైన జవాబు అవతలివాడి కోపాగ్నిని చల్లారుస్తుంది. నొప్పించే మాట కోపాగ్ని రేపుతుంది.2 జ్ఞానం మనోహరమని జ్ఞానుల మాటలవల్ల తెలుస్తుంది. మూర్ఖుల నోరు తెలివితక్కువతనాన్ని కుమ్మరిస్తుంది.
3 ✝యెహోవా కండ్లు ప్రతి చోటా ప్రసరిస్తాయి. మంచివారినీ, చెడ్డవారినీ ఆయన కండ్లు బాగా చూస్తూ ఉంటాయి.
4 ✝ఆరోగ్యాన్ని చేకూర్చే మాటలు జీవవృక్షం. కుటిలమైన మాటలు మనసును కుంగదీస్తాయి.
5 ✽మూర్ఖుడు తండ్రి చేసే క్రమశిక్షణను ధిక్కరిస్తాడు. దిద్దుబాటుకు లోబడేవాడు బుద్ధిమంతుడు.
6 ✽సన్మార్గుల ఇల్లు గొప్ప ధననిధిలాంటిది. దుర్మార్గుల రాబడిలో చిక్కులున్నాయి.
7 జ్ఞానుల నాలుక జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తుంది. మూర్ఖుల హృదయం అలాంటిదేమీ కాదు.
8 దుర్మార్గుల✽ బలులు యెహోవాకు అసహ్యం, నిజాయితీపరుల ప్రార్థన✽ అంటే ఆయనకు ఎంతో ఇష్టం.
9 దుర్మార్గుల ప్రవర్తన✽ యెహోవా చీదరించుకుంటాడు, సన్మార్గులను✽ ఆయన ప్రేమిస్తాడు.
10 ✽దారి తప్పినవాడికి కఠినమైన క్రమశిక్షణ కావాలి. దిద్దుబాటును అసహ్యించుకొనేవాడు చస్తాడు.
11 ✝మృత్యులోకం, నాశనకరమైన అగాధం యెహోవా ఎదుట తెరచుకొని ఉన్నాయి. అలాంటప్పుడు మనుషుల హృదయాలు ఆయనకు తేటతెల్లమే.
12 పరిహాసకుడు తనను మందలించేవాణ్ణి ప్రేమించడు. అతడు జ్ఞానుల దగ్గరికి వెళ్ళడు.
13 ఆనందమయమైన మనసువల్ల ముఖం ప్రకాశిస్తుంది. మనోవేదన ఆత్మను కుంగదీస్తుంది.
14 తెలివైన వారి మనసు జ్ఞానాన్వేషణ చేస్తుంది. మూర్ఖులు పలికేది మూఢత్వమే.
15 దుర్దశలో ఉన్నవారి రోజులన్నీ కష్టతరం. మానసిక ఉల్లాసం ఎడతెగని విందు✽.
16 ✽ ధనవృద్ధి ఉండి, కలవరంలో మునిగిపోయిన వారి స్థితికంటే, కొంచెమే ఉండి, యెహోవా పట్ల భయభక్తులున్న వారి స్థితి మంచిది.
17 ద్వేషంతో వడ్డించిన మంచి మాంసం కంటే ప్రేమ✽తో పెట్టిన పట్టెడు శాకాహారం శ్రేష్ఠం.
18 ముక్కోపి కలహాలు రేపుతాడు. ఓర్పుగలవాడు వివాదాన్ని శాంతపరుస్తాడు.
19 ✽సోమరిపోతుల దారి ముళ్ళకంచెలాంటిది. నిజాయితీపరుల త్రోవ రాజమార్గం.
20 జ్ఞానం ఉన్న కుమారుడు తండ్రికి సంతోషం చేకూరుస్తాడు. మూర్ఖుడు తల్లిని తిరస్కరిస్తాడు.
21 బుద్ధిలేని వారికి మూర్ఖత్వం సంతోషాన్ని కలిగిస్తుంది. వివేకవంతుల ప్రవర్తన చక్కనిది.
22 ఆలోచన లేకుండా రూపొందించిన ప్రణాళికలు భగ్నమైపోతాయి. చాలామంది సలహాదారులు ఉంటే, అవి సఫలమవుతాయి.
23 మనిషి సరైన జవాబు చెపితే అతడికి సంతోషం. సమయోచితమైన మాట✽ ఎంత మంచిది!
24 ✽క్రింద ఉన్న మృత్యులోకంనుంచి తప్పించుకొనేలా వివేకవంతులు పైకి పోయే జీవ మార్గంలో నడుస్తారు.
25 గర్విష్ఠుల ఇండ్లను యెహోవా పీకివేస్తాడు✽. విధవరాలి పొలిమేరలను ఆయన సుస్థిరం చేస్తాడు.
26 చెడ్డ తలంపులు యెహోవాకు అసహ్యం✽. దయగల మాటలు ఆయన దృష్టికి శుద్ధం✽.
27 అక్రమ లాభం✽ సంపాదించేవాడు తన ఇంటిల్లిపాదికీ కడగండ్లు కలిగిస్తాడు. లంచాలంటే✽ అసహ్యించుకొనేవాడు జీవిస్తాడు.
28 సన్మార్గుల హృదయం ఎలా జవాబివ్వాలా అని ఆలోచిస్తుంది. దుర్మార్గుల నోరు చెడు మాటలు కుమ్మరిస్తుంది.
29 దుర్మార్గులకు యెహోవా దూరంగా✽ ఉంటాడు. సన్మార్గుల ప్రార్థన ఆయన వింటాడు✽.
30 ✝కన్నుల్లో కాంతి చూచి, హృదయం సంతోషిస్తుంది. శుభవార్త ఎముకలకు పుష్టి.
31 ✝జీవప్రదమైన మందలింపులు చెవిని బెట్టేవాడు జ్ఞానుల సహవాసంలో ఉండిపోతాడు.
32 క్రమశిక్షణను నిర్లక్ష్యం చేసేవారు తమను తృణీకరించుకొంటున్నారన్న మాట✽. మందలింపును చెవినిబెట్టేవారు బుద్ధిమంతులవుతారు.
33 యెహోవామీది భయభక్తులు✽ జ్ఞానాన్ని ఉపదేశిస్తాయి. వినయం✽ గౌరవానికి దారి.