14
1 జ్ఞానం ఉన్న స్త్రీ గృహసీమను నిర్మిస్తుంది. మూర్ఖురాలు చేజేతుల గృహాన్ని పడగొట్టివేస్తుంది.
2 నిజాయితీగా నడుచుకొనేవారు యెహోవాపట్ల భయభక్తులు గలవారు. కుటిల వర్తనులకు యెహోవా అంటే తిరస్కారం.
3 మూర్ఖుల నోట గర్వమనే బెత్తం ఉంది. జ్ఞానుల పెదవులు తమకు కాపుదల.
4 ఎద్దులు లేకపోతే ధాన్యం కొట్టు ఖాళీగా ఉంటుంది. ఎద్దులు బలంగా ఉంటే పంటలో అభివృద్ధి.
5 నమ్మకమైన సాక్షి అబద్ధం చెప్పడు. అబద్ధ సాక్షి నోరు తెరిస్తే అబద్ధమే.
6 పరిహాసకులు జ్ఞానాన్ని వెదికినా ఏమీ లభించదు. తెలివితేటలు ఉన్నవారికి జ్ఞానం సులభంగా ప్రాప్తిస్తుంది.
7 మూర్ఖుడి ఎదుటనుంచి వెళ్ళిపో. అతడి దగ్గర జ్ఞాన వాక్కులు దొరకవు గదా.
8 వివేకుల జ్ఞానం అంటే తమ పోకడలను గమనించుకోవడమే. తెలివితక్కువవారి మూర్ఖత్వం వాళ్ళ మోసంలోనే బయట పడిపోతుంది.
9 మూఢులు అపరాధం గురించి పరిహాసంగా మాట్లాడుతారు. యథార్థపరుల మధ్య దయ ఉంది.
10 హృదయ శోకం ఎలాంటిదో దానికి తెలుసు. దాని సంతోషం కూడా పరాయివాడు పంచుకోలేడు.
11 దుర్మార్గుడి ఇల్లు నాశనమైపోతుంది. నిజాయితీపరుడి డేరా క్షేమంగా ఉంటుంది.
12  మనిషి దృష్టికి సరైనదిగా కనబడే మార్గం ఉంది. కాని, తుదకు అది మరణానికి దారితీస్తుంది.
13 పైకి నవ్వుతూ ఉన్నా, లోలోపల శోకం ఉండవచ్చు. సంతోషం తుదకు శోకంగా మారిపోవచ్చు.
14 హృదయంలో భక్తి విడిచినవారు తమ మార్గాల ఫలంతో నిండిపోతారు. మంచి మనిషికి ఆత్మ తృప్తి కలుగుతుంది.
15 తెలివితక్కువ వారు ప్రతిదీ నమ్ముతారు. వివేకి తాను వేసే ప్రతి అడుగును ఆలోచించి మరీ వేస్తాడు.
16  జ్ఞానులు భయపడి కీడునుంచి వైదొలగుతారు. మూర్ఖులు అహంకారంతో అజాగ్రత్తగా మసులుకుంటారు.
17 త్వరగా కోపగించుకొనేవారు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. దురాలోచన చేసేవాడు ద్వేషానికి గురి అవుతాడు.
18 తెలివితక్కువ వాళ్ళకు కలగబోయేది మూర్ఖత్వమే. జ్ఞానం వివేకులను ఆవరించి ఉంటుంది.
19 చెడ్డవాళ్ళు మంచివాళ్ళ ఎదుట వంగుతారు. దుర్మార్గులు సన్మార్గుల ఇంటి వాకిట తల ఒగ్గుతారు.
20  దరిద్రులంటే వారి పొరుగువారే అసహ్యించుకుంటారు. ధనవంతులకు స్నేహితులు అనేకులు.
21 సాటి మానవుణ్ణి తిరస్కరించేవారు పాపులు. బీదలపట్ల దయ చూపేవారు ధన్యజీవులు.
22 కీడు తలపెట్టేవాళ్ళు తప్పిపోకుండా ఉంటారా? మేలును ఉద్దేశించినవారికి అనుగ్రహం, సత్యం ప్రాప్తిస్తాయి.
23  అన్ని రకాల కృషిలో లాభం ఉంది. ఊరికే మాట్లాడడం దరిద్రానికి కారణం.
24 ఐశ్వర్యం జ్ఞానులకు కిరీటంలాంటిది. తెలివితక్కువ వారి మూర్ఖత్వం మూర్ఖత్వమే.
25 నిజం చెప్పే సాక్షి మనుషుల ప్రాణాలను రక్షిస్తాడు. అబద్ధ సాక్షి వట్టి మోసగాడు.
26 యెహోవామీది భయభక్తుల వల్ల చాలా ధైర్యం కలుగుతుంది. అలాంటివారి పిల్లలకు ఆశ్రయం ఉంది.
27 యెహోవామీది భయభక్తులు జీవాన్ని కలిగించే ఊటలాంటివి. మనుషులు దానిమూలంగా మరణ బంధకాలు తప్పించుకొంటారు.
28 జనాభా వృద్ధి రాజుకు మహిమ. జన క్షయం రాజుకు నాశనం.
29 త్వరగా కోపగించుకోనివారికి చాలా తెలివితేటలు ఉన్నాయి. ముక్కోపి మూర్ఖతను ప్రదర్శించేవాడు.
30 ప్రశాంత హృదయం శరీరానికి జీవం కలిగిస్తుంది. అసూయ ఎముకల్లో కుళ్ళులాంటిది.
31  దరిద్రులను అణగద్రొక్కేవారు వారి సృష్టికర్తకే నింద తెస్తున్నారు. అక్కరలో ఉన్నవారికి దయ చూపేవారు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు.
32 తమ చెడుగులో దుర్మార్గులు నాశనం అవుతారు. మరణ సమయంలో కూడా సన్మార్గులకు ఆశ్రయం ఉంది.
33 వివేకి హృదయంలో జ్ఞానం నివాసముంటుంది. మూర్ఖులకు లోపలిదంతా బయటపడుతుంది.
34 న్యాయం జనాన్ని గొప్ప చేస్తుంది. అపరాధం ప్రజలకు అవమాన కారణం.
35 సేవకుడు బుద్ధిమంతుడైతే, రాజుకు ప్రీతిపాత్రుడు అవుతాడు. సిగ్గుమాలినవాడు రాజు కోపానికి గురి అవుతాడు.