13
1 తండ్రి క్రమశిక్షణకు తెలివిగల కొడుకు లోబడుతాడు. హేళన చేసేవాడు దిద్దుబాట్లు పాటించడు.
2 తన నోటి మాటల ఫలం మూలంగా మనిషి మేలు అనుభవిస్తాడు. నమ్మక ద్రోహుల ఆశయం దౌర్జన్యమే.
3 నోరును కాపాడుకొనేవారు ప్రాణం దక్కించుకుంటారు. నోరు భార్లగా తెరిచేవారికి నాశనం తప్పదు.
4 సోమరిపోతుకు ఆశ ఎక్కువే గాని, ఏమీ లభించదు. కష్టించి పని చేసేవారి అంతరంగంలో తుష్టీ, పుష్టీ.
5 సన్మార్గులకు అబద్ధాలంటే అసహ్యం. దుర్మార్గులు నింద, అవమానం కలిగిస్తారు.
6 నిజాయితీపరులకు న్యాయవర్తనమే కాపుదల. దుర్మార్గం పాపిని పడద్రోస్తుంది.
7 ఏమీ లేకపోయినా ధనం ఉన్నట్టు నటించేవాడొకడు, చాలా ధనం ఉన్నా లేనట్టు నటించేవాడు మరొకడూ!
8 ఓ మనిషి ధనం అతనికి విడుదల వెల. దరిద్రుడు బెదరింపు మాటలు వినిపించుకోడు.
9 సన్మార్గుల కాంతి తేజరిల్లుతుంది. దుర్మార్గుల దీపం ఆరిపోతుంది.
10 గర్వంచేత కలిగేది కలహమే. సలహాలు పాటించేవారికి జ్ఞానం ఉంటుంది.
11 మోసం చేసి సంపాయించినది తగ్గిపోతూ ఉంటుంది. శ్రమించి సమకూర్చుకొన్నది పెరుగుతుంది.
12 ఆశ నెరవేర్పు ఆలస్యమైతే హృదయం కృశిస్తుంది. తీరిన కోరిక జీవవృక్షం.
13 హిత వాక్కును తిరస్కరించేవారు బాధల పాలవుతారు. ఆజ్ఞ అంటే భయభక్తులున్న వ్యక్తికి బహుమతి దొరుకుతుంది.
14  జ్ఞానుల ఉపదేశం జీవాన్ని కలిగించే ఊట. మనుషులు దానిమూలంగా మరణ బంధకాలు తప్పించుకుంటారు.
15 మంచి తెలివి వల్ల దయ లభిస్తుంది. నమ్మక ద్రోహుల మార్గం కఠినమైనది.
16 ప్రతి వివేకి తెలివిగా ప్రవర్తిస్తాడు. తెలివితక్కువవాడు తన మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటాడు.
17 దూత దుర్మార్గుడైతే కడగండ్ల పాలవుతాడు. నమ్మకమైన రాయబారి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు.
18 క్రమశిక్షణను నిర్లక్ష్యం చేసే వాళ్ళకు దరిద్రం, అవమానం కలుగుతాయి. మందలింపును శిరసావహించే వారికి గౌరవం.
19 కోరిక నెరవేరితే ప్రాణానికి మధురం. చెడుగు మానడం అంటే మూర్ఖులకు ఏవగింపు.
20 జ్ఞానులతో తిరిగేవారు జ్ఞానులు అవుతారు. మూర్ఖులతో స్నేహం చేసేవారు చెడిపోతారు.
21 కీడు పాపులను వెంటాడుతుంది. మేలు న్యాయవంతులకు వచ్చే బహుమానం.
22 సజ్జనుడు తన మనుమలకు ఆస్తి విడిచిపెట్టిపోతాడు. పాపాత్ములు కూడబెట్టిన ధనం న్యాయవంతుల వశం అవుతుంది.
23 బీదలు దున్నే బీడు భూమి సమృద్ధిగా పండవచ్చు. అన్యాయంవల్ల అది తుడిచిపెట్టుకుపోతుంది.
24 బెత్తం ప్రయోగించనివాడు తన కొడుకును ద్వేషిస్తున్నాడన్న మాట. కొడుకును ప్రేమించేవాడు వాణ్ణి శ్రద్ధగా క్రమశిక్షణలో పెంచుతాడు.
25 సన్మార్గులకు ఆకలి తీర్చుకొనేందుకు చాలినంత ఉంటుంది. దుర్మార్గుల కడుపుకు దరిద్రమే మిగిలేది.