12
1 క్రమశిక్షణ అంటే ఇష్టమున్న వ్యక్తి జ్ఞానమంటే ఇష్టమున్న వ్యక్తి అన్నమాట. దిద్దుబాటును ఏవగించుకొనేవాడు మూర్ఖుడు.
2 మంచివారిని యెహోవా దయ చూస్తాడు. యుక్తిపరులకు శిక్ష విధిస్తాడు.
3 దుర్మార్గం మూలంగా ఎవరూ స్థిరపడరు. న్యాయవంతుల వేరును పెళ్ళగించడం జరగదు.
4 మంచి ఇల్లాలు తన భర్తకు కిరీటం. భర్తకు సిగ్గు కలిగించే భార్య అతడి ఎముకల్లో కుళ్ళు.
5 సన్మార్గుల తలంపులు న్యాయసమ్మతమైనవి. దుర్మార్గుల సలహాలు పచ్చి మోసం.
6 దుర్మార్గుల మాటలు రక్తపాతం కోసం పొంచి ఉంటాయి. యథార్థపరుల నోరు రక్షణ చేకూరుస్తుంది.
7 దుర్మార్గులు పాడైపోతారు. వాళ్ళు లోకంలో లేకుండా పోతారు. సన్మార్గుల ఇల్లు నిలిచి ఉంటుంది.
8 మనిషి తన సుబుద్ధి కారణంగా పొగడ్తలు పొందుతాడు. వక్ర బుద్ధి గలవారు తిరస్కారానికి గురి అవుతారు.
9 తినడానికి లేకపోయినా, గొప్పలు చెప్పుకొనే వాడికంటే తమ దగ్గర సేవకుడున్న అల్పుడు మంచి స్థితిలో ఉన్నారు.
10 తమ పశువులపట్ల సన్మార్గులు భూత దయ చూపుతారు. దుర్మార్గులు చూపే జాలి కూడా క్రూరత్వమే.
11 భూమి దున్నుకొనేవారికి భోజనం సమృద్ధి. వ్యర్థమైనవాటిని వెంటాడేవారు తెలివితక్కువవారు.
12 దుర్మార్గులు చెడ్డవాళ్ళ దోపిడీసొమ్ము ఆశిస్తారు. సన్మార్గుల వేరు వర్ధిల్లుతుంది.
13 చెడ్డవాడు తన పెదవుల దోషంలో చిక్కుబడుతాడు. న్యాయవంతుడు ఆపదనుంచి తప్పించుకుంటాడు.
14 తన నోటి మాటల ఫలం మూలంగా మంచితనంతో మనిషి తృప్తిపడుతాడు. మనిషి చేసుకొన్నది అతడి మీదికి వస్తుంది.
15 మూర్ఖుల మార్గం తమకు బాగా ఉన్నట్టే అనిపిస్తుంది. జ్ఞానులు ఇతరుల సలహాలు వింటారు.
16 మూర్ఖులకు విసుగు కలిగితే, అప్పుడే తెలిసిపోతుంది. వివేకవంతులు అవమానాన్ని వెల్లడి కానివ్వరు.
17 యథార్థవాది సరైనదే పలుకుతాడు. అబద్ధ సాక్షి వంచన మాటలు చెపుతాడు.
18 ఆలోచించకుండా కొందరు మాట్లాడితే, కత్తితో పొడిచినట్టే ఉంటుంది. జ్ఞాని మాటలు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
19 యథార్థం పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అబద్ధాల నాలుకకు ఉనికి క్షణికం.
20 కీడు తలపెట్టేవారి హృదయంలో మోసం ఉంటుంది. శాంతిని చేకూర్చడానికి సలహా ఇచ్చే వారికి సంతోషం కలుగుతుంది.
21 సన్మార్గులకు ఏ హానీ రాదు. దుర్మార్గులకు నిలువెల్లా కష్టాలే.
22 అబద్ధాల పెదవులంటే యెహోవాకు చెడ్డ అసహ్యం. యథార్థవంతులంటే ఆయనకెంతో ఇష్టం.
23 వివేకి తన జ్ఞానాన్ని దాచిపెట్టుకొంటాడు. తెలివితక్కువ వారు తమ హృదయంలోని మూర్ఖత్వాన్ని వెల్లడి చేసుకుంటారు.
24 శ్రద్ధగా పని చేసే చెయ్యి ప్రభుత్వం చేస్తుంది. సోమరి బలవంతంమీద ఊడిగం చేయవలసివస్తుంది.
25 విచారంచేత హృదయం క్రుంగిపోతుంది. మంచి మాట ఒకటి హృదయానికి సంతోషం కలిగిస్తుంది.
26 సన్మార్గులు తమ పొరుగువారికి మార్గదర్శులు. దుర్మార్గుల ప్రవర్తన మూలంగా వారు దారి తప్పిపోతారు.
27 సోమరి వేటాడవచ్చు కాని, ఏమి చిక్కదు. చురుకుదనం గొప్ప ఆస్తిలాంటిది.
28  న్యాయమార్గంలో జీవం ఉంది. ఆ త్రోవలో మరణం అంటూ ఉండదు.