11
1  దొంగ త్రాసు యెహోవాకు అసహ్యకరం. సరైన తూకం ఆయనకిష్టం.
2 గర్వం వెంటే అవమానం వస్తుంది. వినయం గలవారి దగ్గర జ్ఞానం ఉంటుంది.
3 నిజాయితీపరుల న్యాయబుద్ధి వారికి మార్గదర్శి. ద్రోహులు వాళ్ళ కపటంవల్లే నాశనం అవుతారు.
4 దేవుని ఆగ్రహ దినాన ధనం దేనికీ పనికి రాదు. నిర్దోషత్వం మరణం నుంచి తప్పిస్తుంది.
5 నిర్దోషుల న్యాయవర్తన వారి మార్గం సరి చేస్తుంది. దుర్మార్గులు తమ దుర్మార్గంవల్లే కూలుతారు.
6 నిజాయితీపరుల నిర్దోషత్వం వారికి విడుదల కలిగిస్తుంది. ద్రోహులు తమ పేరాశలో చిక్కుపడిపోతారు.
7  దుర్మార్గులు చస్తే, వారి ఆశాభావం అంతరించిపోతుంది. బలవంతుల ఆశ అడుగంటిపోతుంది.
8 సన్మార్గులు కష్టాలనుంచి విడుదల అవుతారు. వారి స్థానాన్ని దుర్మార్గులు ఆక్రమించుకొంటారు.
9 భక్తిలేని వారు తమ నోటి మాటతో పొరుగువారిని నాశనం చేస్తారు. న్యాయవంతులు తెలివివల్ల తప్పించు కుంటారు.
10 సన్మార్గులు బాగుంటే పట్టణానికి సంతోషం. దుర్మార్గులు నాశనమైపోతే ఆనందధ్వనులు చెలరేగుతాయి.
11 నిజాయితీపరుల ఆశీస్సులవల్ల పట్టణం ఉన్నత స్థితికి వస్తుంది. దుర్మార్గుల నోరు దాన్ని కూలగొట్టివేస్తుంది.
12 తన పొరుగువారిని లెక్కచెయ్యనివారు తెలివి తక్కువవారు. వివేకవంతులు మౌనం వహిస్తారు.
13 చాడికోరులు తిరుగుతూ రహస్యాలు బట్టబయలు చేస్తారు. విశ్వసనీయులు రహస్యాలు దాచిపెట్టేవారు.
14 దారి చూపేవారు లేకపోతే ప్రజలు పతనం చెందుతారు. సలహాలు చెప్పేవారు చాలామంది ఉంటే, ప్రజలు సురక్షితంగా ఉంటారు.
15 పరాయివారికి జామీను ఉండేవారు తప్పక కష్టం అనుభవిస్తారు. జామీను ఉండడానికి ఒప్పుకోనివాడు భద్రంగా ఉంటాడు.
16 మృదు హృదయం గల స్త్రీకి గౌరవం కలుగుతుంది. దౌర్జన్యపరులు సంపద చేజిక్కించుకుంటారు.
17 దయాపరులు మంచి చేయడం వల్ల తమకు ప్రయోజనం కలుగుతుంది. క్రూరులు కీడు చేయడం వల్ల తమకు హాని కలుగుతుంది.
18 దుర్మార్గుల సంపాదన మోసకరం. న్యాయమనే విత్తనం వేసేవారికి అసలైన బహుమతి దొరుకుతుంది.
19 నిజమైన న్యాయవర్తనం జీవదాయకం. పొద్దస్తమానం చెడుగు చేసేవారు తమ చావునే తెచ్చుకుంటారు.
20 వక్రబుద్ధి గల వాళ్ళంటే యెహోవాకు అసహ్యం. ప్రవర్తనలో నిర్దోషులు ఆయనకు ప్రీతిపాత్రులు.
21 దుర్మార్గులకు శిక్ష రావడం ఖాయం. సన్మార్గులు విముక్తులవుతారు.
22 అందం ఉండి, వివేకం లోపించిన స్త్రీ – పందికి ఉన్న బంగారు ముక్కుపుడక లాంటిది.
23 సన్మార్గులు మంచినే కోరుతారు. దుర్మార్గుల ఆశ దురభిమాన పూరితం.
24  ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందినవారు ఉన్నారు. ఇవ్వవలసినదానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైనవారూ ఉన్నారు.
25 ఔదార్యం గలవారు వర్ధిల్లుతారు. నీళ్ళు పోసేవారికి ఎవరైనా నీళ్ళు పోస్తారు.
26 ధాన్యం అమ్మకుండా బిగబట్టేవాణ్ణి ప్రజలు దూషిస్తారు. ధాన్యం అమ్మేవాడి శిరస్సుపై ఆశీస్సులు కురుస్తాయి.
27 మేలు చేయడానికి ప్రయత్నించేవారు దయను కోరుకొనేవారు. కీడు తల పెట్టేవారికి కీడే ముడుతుంది.
28 సంపదను నమ్ముకొనేవారు పడిపోతారు. న్యాయవంతులు చిగురుటాకులాగా ఉండి వర్ధిల్లుతారు.
29 తన ఇంటివారిని బాధలపాలు చేసేవాడి వారసత్వం గాలి మాత్రమే. అవివేకి జ్ఞానికి సేవకుడు అవుతాడు.
30 న్యాయవంతుల ఫలం జీవవృక్షం. జ్ఞానమున్నవాడు ఇతరులను రక్షిస్తాడు.
31 న్యాయవంతులకు ఇహలోకంలో ప్రతిఫలం కలిగితే, దుర్మార్గులకూ పాపులకూ ప్రతిఫలం రావడం మరీ ఖాయం గదా!