10
1 సొలొమోను సామెతలు. కుమారుడికి జ్ఞానం ఉంటే, తండ్రికి సంతోషం. తెలివితక్కువ కుమారుడు తల్లికి శోకం.
2 అక్రమంగా సంపాదించిన ధనంవల్ల లాభమేమీ ఉండదు. నిర్దోషత్వం చావునుంచి తప్పిస్తుంది.
3 యెహోవా సన్మార్గులను ఆకలితో విడిచిపెట్టడు. దుర్మార్గులకు ఆశాభంగం కలిగిస్తాడు.
4 బద్ధకంగా పని చేసే వారికి దరిద్రం వస్తుంది. శ్రద్ధగా పని చేస్తే ఐశ్వర్యం చేకూరుతుంది.
5 వేసవి కాలంలో సేకరించుకొనే కుమారుడు బుద్ధిమంతుడు. పంట కాలంలో నిద్రపోయే కొడుకు సిగ్గు తెచ్చిపెట్టేవాడు.
6 సన్మార్గుల తలపై ఆశీస్సులు! దుర్మార్గుల నోట్లో దౌర్జన్యం దాగి ఉంటుంది.
7 సన్మార్గుల విషయమైన జ్ఞాపకం ధన్యం. దుర్మార్గుల పేరు అసహ్యమై నాశనం అవుతుంది.
8 హృదయంలో జ్ఞానం ఉన్నవారు ఆజ్ఞలు పాటిస్తారు. వదరుబోతులైన మూర్ఖులను కూల్చడం జరుగుతుంది.
9 నిజాయితీతో ప్రవర్తించే వారికి క్షేమం! వక్రబుద్ధితో ప్రవర్తించేవాడి గుట్టు బయటపడుతుంది.
10 యుక్తితో కన్ను గీటేవారు కడగండ్లు తెచ్చిపెట్టేవారు. వదరుబోతులైన మూర్ఖులు పతనమవుతారు.
11 సన్మార్గుల నోరు జీవజలం ఊట. దుర్మార్గుల నోట్లో దౌర్జన్యం దాగి ఉంటుంది.
12 ద్వేషం కలహం రేపుతుంది. ప్రేమ దోషాలన్నిటినీ కప్పివేస్తుంది.
13 వివేకం ఉన్నవారి పెదవులపై జ్ఞానం దొరుకుతుంది. బుద్ధిలేనివారి వీపుకు తగినది బెత్తమే!
14 జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూర్ఖులు మాట్లాడితే నాశనం దగ్గర పడుతుంది.
15 ధనికుల ఆస్తి వారికి కోటలాంటిది. పేదవారి దరిద్రం వారికి నాశనకారణం.
16 సన్మార్గుల జీతం వారికి జీవం కలిగిస్తుంది. దుర్మార్గుల రాబడి వారికి శిక్ష తెచ్చిపెట్టేస్తుంది.
17  ఉపదేశం వినేవారు జీవ మార్గంలో ఉన్నారు. దిద్దుబాటు నిర్లక్ష్యం చేసేవారు దారి తప్పుతారు.
18 లోలోపల ద్వేషం ఉంచుకొనేవారు అబద్ధికులు. అపనిందలు ప్రచారం చేసేవారు మూర్ఖులు.
19 మాటలు మరీ ఎక్కువయితే, దోషం తప్పదు. పెదవులను అదుపులో ఉంచుకొన్నవాడే జ్ఞాని.
20 సన్మార్గుల మాటలు నాణ్యమైన వెండిలాంటివి. దుర్మార్గుల మనసు పనికిమాలినది.
21 సన్మార్గుల పెదవులు అనేకులను పోషిస్తాయి. బుద్ధి లేకపోవడంచేత మూర్ఖులు చనిపోతారు.
22 ఐశ్వర్యాన్ని కలిగించేది యెహోవా దీవెన. ఆయన దానికేమీ దుఃఖం చేర్చడు.
23 మూర్ఖులకు తన చెడ్డ ప్రవర్తనలో సంతోషం కలుగుతుంది. వివేకులకు జ్ఞానంలో సంతోషం కలుగుతుంది.
24 దుర్మార్గులు భయపడినదే వారి మీదికి వస్తుంది. సన్మార్గులు కోరుకొన్నదే వారికి లభిస్తుంది.
25 సుడిగాలి పోయిన తరువాత దుర్మార్గులు ఉండరు. కాని, సన్మార్గులు శాశ్వతమైన పునాదిమీద నిలిచి ఉంటారు.
26 పండ్లకు పులుపు, కండ్లకు పొగ ఎలా ఉంటాయో, సోమరిపోతును పనికి పంపేవారికి అతడు అలాగే ఉంటాడు.
27 యెహోవాపట్ల భయభక్తులు ఆయుష్షుకు వృద్ధి. దుర్మార్గులకు ఆయువు క్షీణం.
28 సన్మార్గులకు సంతోషకరమైన ఆశాభావం ఉంది. దుర్మార్గుల ఆశలు లయమైపోతాయి.
29 నిజాయితీపరులకు యెహోవా మార్గం బలమైనకోట. కాని, చెడుగు చేసేవాళ్ళకు అది నాశనకరం.
30 సన్మార్గులకు కంపనం ఎన్నడూ జరగదు. దుర్మార్గులకు దేశంలో తావు లేదు.
31 సన్మార్గుల నోట జ్ఞానధారలు ఒలుకుతాయి. కుటిల మాటలు పలికే నాలుకను పీకివేయడం జరుగుతుంది.
32 సన్మార్గుల పెదవులు అనుకూల విషయాలు చెపుతాయి. దుర్మార్గుల నోట మొండి మాటలు వెలువడుతాయి.