9
1 ✽జ్ఞానం తన భవనం నిర్మించుకొన్నది. దానికి ఏడు స్తంభాలు చెక్కింది. 2 ✝మాంసం సిద్ధం చేసింది. ద్రాక్ష పానీయాన్ని కలిపింది. బల్లమీద అంతా వడ్డించింది కూడా.3 ✝తన చెలికత్తెలను పంపింది. తాను పట్టణంలో ఎత్తయిన స్థలంమీద నిలబడి, 4 ✽“తెలివితక్కువవారెవరైనా సరే, ఇక్కడికి రండి” అని పిలుస్తూ ఉంది. బుద్ధిలేనివాళ్ళతో జ్ఞానం ఇలా పలుకుతూ ఉంది:
5 “రండి, నేను సిద్ధం చేసిన ఆహారం పుచ్చుకోండి! నేను కలిపిన ద్రాక్షారస పానీయాన్ని త్రాగండి!
6 మీ తెలివితక్కువతనాన్ని విడిచి జీవించండి. తెలివైన బాటలో నడవండి.
7 ✝పరిహాసకులను మందలించేవాడి మీదికే నింద వస్తుంది. దుర్మార్గులను గద్దించేవాడు దూషణకు గురి అవుతాడు.
8 ✽పరిహాసకుణ్ణి గద్దించకు. గద్దిస్తే, వాడు నిన్ను ద్వేషిస్తాడు. జ్ఞానిని గద్దిస్తే, అతడు నిన్ను ప్రేమిస్తాడు.
9 ✝జ్ఞానికి బుద్ధి చెపితే, అతడి జ్ఞానం అధికం అవుతుంది. న్యాయవంతులకు ఉపదేశం చేస్తే, వారికి జ్ఞానాభివృద్ధి కలుగుతుంది.
10 యెహోవా మీది భయభక్తులు✽ జ్ఞానానికి ఆరంభం. వివేకం అంటే పవిత్రుడైన✽ దేవుణ్ణి తెలుసుకోవడమే.
11 ✽నా మూలంగా నీవు బ్రతికే దినాలు అధికం అవుతాయి. నీ జీవిత కాలాన్ని పొడిగించడం జరుగుతుంది.
12 నీవు జ్ఞానివైతే నీ జ్ఞానం వల్ల నీకే లాభం. నీవు పరిహాసకుడివైతే✽ నీవే ఆ ఫలితం✽ అనుభవించాలి.”
13 మందబుద్ధి అనే స్త్రీ వదరుబోతు,✽ వెర్రిది. దానికేమీ తెలియదు.
14 ఆమె తన ఇంటి వాకిట్లో కూర్చుంటుంది. లేదా, పట్టణంలో ఎత్తయిన స్థలంలో కుర్చీ మీద కూచుంటుంది.
15 దారిన పొయ్యేవారిని చూచి, తమ త్రోవను తాము తిన్నగా నడిచివెళ్ళే వారిని చూచి, ఇలా పిలుస్తుంది:
16 “తెలివి తక్కువవాళ్ళెవరైనా సరే ఇక్కడికి రండి.” బుద్ధిలేని వాళ్ళతో, 17 ✽ “దొంగిలించిన నీళ్ళు తియ్యన, దొంగచాటుగా తిన్న తిండి రుచి” అంటుంది.
18 ✽ కాని, వినేవారికి తెలియదు – చచ్చినవాళ్ళే అక్కడ ఉన్నారు. ఆమె అతిథులందరూ మృత్యులోకంలో ఉన్నారు.