8
1 ✽ జ్ఞానం కేకలు పెట్టడం లేదా? వివేకం స్వరమెత్తి పలకడం లేదా? 2 దారి ప్రక్కన, ఎత్తుగా ఉన్న స్థలంలో, బాటలు కలిసే కూడలిలో జ్ఞానం నిలిచి ఉన్నది.3 నగర ద్వారం దగ్గర, ప్రవేశంలోనే, తలుపు దగ్గరే నిలిచి, అది ఎలుగెత్తి ఇలా చాటుతూ ఉంది:
4 ✽“మనుషులారా! నేను చెప్పేది మీకే. నేను పిలిచేది మానవకోటినంతటినీ.
5 తెలివితక్కువవారలారా! వివేకమంటే ఏమిటో తెలుసుకోండి. మందమతులారా! బుద్ధిని గుర్తించండి.
6 నేను చెప్పే విషయాలు శ్రేష్ఠమైనవి – వినండి. నేను పెదవులు కదిలించానంటే యథార్థమైన విషయాలు పలుకుతాను.
7 నా నోరు సత్యమే చెపుతుంది. దుర్మార్గాలు నా పెదవులకు గిట్టవు.
8 నా నోటి మాటలన్నిట్లో న్యాయం ఉట్టిపడుతుంది. వాటిలో వక్రమైనది లేనే లేదు. కుటిలం అందులో లేనే లేదు.
9 అవన్నీ వివేకికి యథార్థం! తెలివి లభించినవానికి అవి లోపం లేనివి.
10 నా ఉపదేశం కోరుకోండి గాని, వెండి కాదు. మేలిమి బంగారం కంటే తెలివిని ఎక్కువగా ఆశించండి!
11 జ్ఞానం రత్నాలకంటే మంచిది. విలువైనదేదీ దానికి సాటి రాదు.
12 ✽నేను జ్ఞానాన్ని. వివేకంతో నివాసమున్నాను. తెలివి, ఆలోచన నాకు పరిచితమే.
13 ✽ యెహోవా అంటే భయభక్తులతో ఉండడం దుర్మార్గాన్ని ఏవగించుకోవడమే. గర్వం, అహంకారం, చెడు ప్రవర్తన, కుటిల మాటలు నాకు అసహ్యం.
14 ఆలోచన, జ్ఞాన సమృద్ధి నావి. వివేకం నాకు ఉంది. బల ప్రభావాలు కూడా ఉన్నాయి.
15 ✽నా మూలంగా రాజులు పరిపాలిస్తారు, అధికారులు న్యాయమైన చట్టాలు నియమిస్తారు.
16 నా మూలంగా నాయకులు ఏలుతారు, లోకంలో న్యాయవంతులైన అధిపతులంతా ప్రభుత్వం చేస్తారు.
17 నన్ను ప్రేమించేవారిని నేనూ ప్రేమిస్తాను. నన్ను జాగ్రత్తగా వెదికేవారికి నేను దొరుకుతాను✽.
18 ఐశ్వర్యం, గౌరవం, ఎడతెగని సంపద, నిర్దోషత్వం నా దగ్గర ఉన్నాయి.
19 నా వల్ల కలిగే ఫలం బంగారంకంటే – మేలిమి బంగారంకంటే – మంచిది. నాణ్యమైన వెండికంటే నా వల్ల కలిగే అభివృద్ధి గొప్పది.
20 ధర్మపథం, న్యాయసమ్మతమైన బాటలో నేను నడుస్తాను.
21 నన్ను ప్రేమించేవారు కలిమికి వారసులు అవుతారు. వారి ధనాగారాన్ని నేను నింపుతాను.
22 ✽యెహోవా తన పురాతన క్రియలకు ముందే, తాను సృజించడం ఆరంభించినప్పుడు నేను ఆయన స్వాధీనంలో ఉన్నాను.
23 ✽అనాది కాలంలోనే, మొదటి నుంచీ, భూమి ఉనికిలోకి రాకముందే నన్ను ఆయన నియమించాడు.
24 జలాగాధం లేనప్పుడు, జలభరితమైన నీటి ఊటలు లేనప్పుడు నేను రూపొందాను.
25 పర్వతాలకు నిలకడ లేనప్పుడు, కొండలు ఉనికిలోకి రానప్పుడు నేను రూపొందాను.
26 ఆయన ఇంకా భూమినీ, మైదానాలనూ చేసేముందే, భూతలం మీద అసలు మన్ను అనేదాన్ని ఆయన చేసేముందే నేను రూపొందాను.
27 ✽ఆయన ఆకాశాలను నెలకొలిపినప్పుడు, జలాగాధానికి పరిధిని ఏర్పరచినప్పుడు నేనున్నాను.
28 పైన ఆకాశాన్ని ఆయన సుస్థిరం చేసినప్పుడు, జలధారలను ఆయన నిర్ణయం చేసినప్పుడు, 29 నీరు దాని పొలిమేరలు దాటకుండేలా ఆయన సముద్రానికి సరిహద్దులేర్పరచినప్పుడు, భూమికి పునాదులు నియమించినప్పుడు, 30 నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నేను ఆయనకు ప్రధాన శిల్పిని. ఎప్పుడూ ఆయన నామూలంగా ఎంతో ఆనందించాడు. ఆయన సముఖంలో నాకు ఎప్పటికీ సంతోషం.
31 ఆయన సృజించిన లోకాన్ని, భూమిని బట్టి ఆనందించాను. మానవకోటిని బట్టి ఎంతో సంతోషించాను.
32 ✽నా కుమారులారా, నా మాట వినండి. నా విధానాల ప్రకారం ప్రవర్తించేవారు ధన్యులు✽!
33 నా ఉపదేశం త్రోసిపుచ్చకండి. దాన్ని అవలంబించి జ్ఞానులు కండి.
34 ✽నేను చెప్పేది చెవిని బెట్టేవారు ధన్యులు. నా గడపదగ్గర కనిపెట్టుకొని ఉండి, నా గుమ్మందగ్గర ఎదురుచూచేవారు ధన్యులు.
35 ✝నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు. యెహోవా అనుగ్రహాన్ని అతడు చూరగొంటాడు.
36 నన్ను తప్పించుకొని తిరిగేవాడు హానికి గురి అవుతాడు.✽ నన్ను ద్వేషించేవాళ్ళు మరణాన్ని ప్రేమించినవారై ఉన్నట్టే.”