7
1 నా కుమారా, నా మాటల ప్రకారం ప్రవర్తించు. నా ఆజ్ఞలను నీ దగ్గర పదిలంగా ఉంచుకో.
2 నా ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తే బ్రతుకుతావు. నీ కంటిపాపలాగా నా ఉపదేశాన్ని కాపాడుకో.
3 నీ వ్రేళ్ళకు వాటిని కట్టుకో. నీ హృదయ పలక మీద వాటిని రాసి పెట్టుకో.
4 “సోదరీ” అని జ్ఞానాన్ని సంబోధించు. తెలివితో “నీవు నా బంధువు” అని చెప్పు.
5 వ్యభిచారిణి దగ్గరికి పోకుండా, ముఖస్తుతి చేసే పరాయి స్త్రీ దగ్గర చేరకుండా అవి నిన్ను కాపాడుతాయి.
6 నా ఇంటి కిటికీలోనుంచి చూశాను. నా గవాక్షంలోనుంచి తొంగి చూశాను.
7 జ్ఞానం లేని యువకులలో ఒకడు నాకు కనిపించాడు. ఇతడు తెలివితక్కువవాడు.
8 అతగాడు వేశ్య ఉన్న సందు దగ్గరే వీధిలో తిరుగాడుతున్నాడు. దాని ఇంటి దగ్గర పచారు చేస్తున్నాడు.
9 అది సంధ్యా సమయం. సాయంకాలం గతిస్తూ ఉంది. చీకటి పడుతూ ఉంది. రాత్రి అవుతూ ఉంది.
10 అప్పుడు ఒక స్త్రీ వేశ్యలాగా అలంకరించుకొని కపట బుద్ధితో అతడి దగ్గరికి వచ్చింది.
11 ఆమె వదరుబోతు, బరితెగింది. ఆమె కాళ్ళు ఇంట్లో నిలవవు.
12 వీధుల్లో, బజారులో మూలమూలనా ఆమె పొంచుకొని ఉంటుంది.
13 ఆమె ఆ యువకుణ్ణి పట్టుకొంది. ముద్దు పెట్టుకొంది. సిగ్గూ, బిడియమూ లేని ముఖంతో అతడితో అంది:
14 “నేను శాంతి బలులు అర్పించవలసివుంది. ఈ వేళే నేను మొక్కుబళ్ళు తీర్చాను.
15 కనుక నీకు ఎదురు వస్తున్నాను నేను. నీకోసం వెదికాను. నువ్వు కనిపించావు.
16 మంచంపై రత్నకంబళ్ళు పరచాను. ఈజిప్ట్ నుంచి తెప్పించిన చిత్రవిచిత్రమైన దుప్పట్లు కప్పాను.
17 పడకమీద బోళం, కుంకం పువ్వు, దాల్చినచెక్క చల్లాను.
18 తెల్లవారేదాకా వలపుదీర అనుభవిద్దాం. రా! అనురాగంతో తృప్తిగా ఆనందిద్దాం.
19 మా ఆయన ఇంట్లో లేడు. దూర ప్రయాణం మీద వెళ్ళాడు.
20 అతడు డబ్బుసంచి పట్టుకువెళ్ళాడు. పౌర్ణమిదాకా అతడు తిరిగి రాడు.”
21 ఆమె ఇలా చెపుతూ చెపుతూ అతణ్ణి ఒప్పించింది. పొగడ్తలతో అతణ్ణి ఈడ్చుకుపోయింది.
22 గభాలున అతడు ఆమె వెంట వెళ్ళాడు. పశువు వధశాలకు పోయినట్లు, పరాయివాడి చేతిలో సంకెళ్ళపాలైనట్లు, 23 తనకు ప్రాణహాని వచ్చిందని తెలుసుకోకుండా ఉరిలోకి పక్షి ఉరికినట్లు అతడి గుండెలోకి బాణం దూసుకుపోయేవరకు అతడు వెళ్ళాడు.
24 నా కుమారులారా, నా మాటలు చెవిని బెట్టండి. నేను చెప్పేది సావధానంగా వినండి.
25 వ్యభిచారిణి మార్గం నీ హృదయాన్ని ఆకర్షించనియ్యకు. ఆమె నడిచే త్రోవల్లో అడుగు పెట్టకు.
26 ఆమె అనేకులను గాయపరచి పడద్రోసింది. ఆమె చంపినవాళ్ళు ఎందరో ఉన్నారు!
27 ఆమె ఇల్లు పాతాళానికి త్రోవ! అది మృత్యుశాలలకు దారి తీస్తుంది!