6
1 నా కుమారా, నీ పొరుగువాడికి నీవు జామీనుగా ఉండే పక్షంలో, లేదా, పరాయివాడికి శపథం చేసే పక్షంలో, 2 ఆ విధంగా నీ నోట వచ్చిన మాటలే నిన్ను చిక్కుబెట్టి ఉంటే, నీ నోటి పలుకులే నిన్ను పట్టుకొని ఉంటే, 3 నేను చెప్పేది చెయ్యి. నా కుమారా, నీ పొరుగువాడి చేతిలో చిక్కిపోయినందున నిన్ను తగ్గించుకొని వెళ్ళి, విడుదలకోసం అతణ్ణి ప్రాధేయపడి అడుగు! ఈ విధంగా తప్పించుకో!
4 నీ కండ్లకు నిద్ర గాని, నీ కంటి రెప్పలకు కునికిపాటు గాని రాకుండా చూచుకో.
5 వేటగాడి బారినుంచి లేడి తప్పించుకొన్నట్లు, బోయవాడి చేతిలోనుంచి పక్షి తప్పించుకొన్నట్లు నీవూ తప్పించుకోవాలి!
6 సోమరీ! చీమ దగ్గరికి వెళ్ళి దాని విధానాలను చూచి తెలివి తెచ్చుకో!
7 వాటికి సేనాపతి ఎవడూ ఉండడు. నాయకుడు ఉండడు. అధ్యక్షుడూ లేడు.
8 అయినా, వేసవి కాలంలో ఆహారం సేకరించుకుంటుంది చీమ. పంట కాలంలో ధాన్యం పోగు చేసుకుంటుంది.
9 సోమరీ! ఎంత సేపు పడుకొని ఉంటావు? నిద్రనుంచి నీవు ఎప్పుడు మేల్కొంటావు?
10 “ఇంకా కాసేపు కునుకుతా. ఇంకా కొంచెం నిద్ర కావాలి. కాసేపు చేతులు ముడుచుకొని పడుకుంటాను” అంటావా?
11 అందుకే దోపిడీ దొంగలాగా దరిద్రం నీమీద వచ్చిపడుతుంది. ఖడ్గం ధరించిన భటుడులాగా లేమి నీమీదికి ఎగబడుతుంది.
12 కుటిలంగా మాట్లాడుతూ, తిరుగుతూ ఉండేవాడు నిష్ ప్రయోజకుడు, దుర్మార్గుడు.
13 కన్ను గీటుతూ జారుకుంటూ చేసైగ చేస్తూ ఉంటాడు.
14 వాడి హృదయంలో పెంకి, మొండి. వాడు దురాలోచనలు చేస్తాడు. జగడాలు రేపుతాడు.
15 అందుచేత వాడిమీద విపత్తు అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. ఉన్నట్లుండి వాడు కూలిపోతాడు. వాడి పాటుకు తిరుగు లేదు.
16 యెహోవాకు ఈ ఆరూ అసహ్యం. ఆ మాటకొస్తే, ఆయన ఏవగించుకొనేవి ఈ ఏడు:
17 గర్వంతో కూడిన చూపు, అబద్ధాలాడే నాలుక, నిర్దోషుల రక్తం ఒలికించే చేతులు, 18 దురాలోచనలు చేసే హృదయం, వేగంగా పరిగెత్తి కీడు చేసే పాదాలు, 19 అబద్ధాలు గుప్పించే కపట సాక్షి, సోదరుల మధ్య జగడాలు రేపేవాడు.
20 నా కుమారా, నీ తండ్రి ఆజ్ఞలను పాటించు. నీ తల్లి ఉపదేశించిన వాటిని త్రోసిపుచ్చకు.
21 వాటిని ఎప్పటికీ నీ హృదయంలో పదిలం చేసుకో. వాటిని నీ మెడకు కట్టుకో!
22 నీవు దారిన వెళ్ళేటప్పుడు అవి మార్గదర్శిలాగా ఉంటాయి. నిద్రపోయేటప్పుడు అవి నీకు కాపల కాస్తాయి. మేల్కొని ఉన్నప్పుడు అవి నీతో మాట్లాడుతాయి.
23 దేవుని ఆజ్ఞ దీపంలాంటిది. ఉపదేశం వెలుగులాంటిది. క్రమశిక్షణకోసం దిద్దుబాట్లు జీవానికి మార్గం.
24 చెడ్డ స్త్రీదగ్గరికి వెళ్ళకుండా, వ్యభిచారిణి చెప్పే పొగడ్తలకు లొంగిపోకుండా అవి నిన్ను కాపాడుతాయి.
25 నీ హృదయంలో అలాంటి స్త్రీ అందాన్ని ఆశించకు, ఆమె కంటిరెప్పలు ఆర్పుతూ ఉంటే నీవు ఆమె వశమైపోబోకు.
26 పడుపు స్త్రీ పొందువల్ల రొట్టె ముక్క మాత్రం మిగులుతుంది. వ్యభిచారిణి నీ విలువైన ప్రాణాన్ని వేటాడుతుంది.
27 నిప్పు కణికెలు ఒడిలో పోసుకొంటే బట్టలు కాలిపోవా?
28 నిప్పుమీద నడిస్తే, కాళ్ళు కాలకుండా ఉంటాయా?
29 అలాగే మరొకడి భార్యతో పోయేవాడికి హాని తప్పదు. పొరుగువాడి భార్యను ముట్టినవాడు శిక్ష తప్పించుకోలేడు.
30 ఆకలిగొన్నవాడు ఆకలి తీర్చుకొనేందుకు దొంగతనం చేసినా, అలాంటి దొంగను ఎవరూ నీచంగా ఎంచరు.
31 అయినా, ఆ దొంగ దొరికితే, దొంగిలించిన దానికి ఏడంతలు చెల్లించాలి, తన ఇంట్లో ఉన్న ఆస్తి అంతా ఇచ్చివేయవలసివచ్చినా అలా చెల్లించాలి.
32  వ్యభిచారం చేసేవాడికి బుద్ధి లేదు. అలా చేసేవాడు తనను నాశనం చేసుకొంటున్నాడు.
33 వాడు గాయానికి, అవమానానికి గురి అవుతాడు. వాడిమీదికి వచ్చిన నింద మాసిపోదు.
34 భర్త రోషంతో మండిపడుతాడు. ప్రతీకారం చేసేటప్పుడు అతడు ఏమీ కరుణ చూపడు.
35 నీవిచ్చే ప్రతిఫలం అతడికేమీ లక్ష్యం ఉండదు. ఎన్ని కానుకలు ఇచ్చినా అతడికి తృప్తి ఉండదు.