5
1 నా కుమారా, నా జ్ఞానవాక్కులు విను. నా తెలివి గల ఉపదేశం చెవిని బెట్టు. 2 అప్పుడు నీవు బుద్ధిమంతుడివి అవుతావు. నీ పెదవులు తెలివిగా మాట్లాడుతాయి.
3 వ్యభిచారిణి పెదవులు తేనె ఒలికిస్తాయి. దాని నోట నూనెకంటే ఎక్కువ మెత్తని మాటలు వెలువడుతాయి.
4 తీరా, విషాముష్ఠి పండంత చేదు ఆమెమూలంగా వస్తుంది. ఆమె కత్తిలాంటిది. రెండు వైపులా పదును!
5 ఆమె పాదాలు మృత్యువుకు పోతాయి. ఆమె అడుగులు పాతాళానికి దారి తీస్తాయి.
6 జీవ మార్గాన్ని గురించి వ్యభిచారిణి ఆలోచించదు. దాని కాళ్ళు అటూ ఇటూ తిరుగాడుతాయి. అవి ఎటు పోయేదీ దానికే తెలియదు.
7 నా కుమారులారా, నేను చెప్పేది వినండి. నా నోటి మాటలు జవదాటకండి.
8 వ్యభిచారిణి దగ్గర నుంచి దూరంగా నీ జీవిత మార్గం ఏర్పరచుకో. ఆమె కొంప వాకిలి దగ్గరికి కూడా వెళ్ళకు.
9 ఒకవేళ వెళ్ళావు అంటే, నీ గౌరవం పరుల పాలవుతుంది. నీ జీవితకాలం క్రూరులు వశం అవుతుంది.
10 పరాయివాళ్ళు నీ ఆస్తిపాస్తులను కడుపార తినివేస్తారు. నీ కష్టార్జితం ఇతరుల పంచ చేరుతుంది.
11 నీ శరీరం, నీ మాంసం హరించుకుపోయినప్పుడు నీ చరమ దశలో ఇలా అఘోరిస్తావు:
12 “అయ్యో! ఉపదేశాన్ని ఎందుకిలా త్రోసిపుచ్చాను? నా హృదయం దిద్దుబాటును ఎందుకిలా ఏవగించుకున్నట్టు?
13 “నా గురువుల మాటలు వినిపించుకొన్నాను కాను. నా ఉపదేశకులు చెప్పేది పెడచెవిని బెట్టాను.
14 “సంఘంలో, సమాజం మధ్య నేను దాదాపుగా అన్ని కీడుల పాలయ్యాను.”
15 నీ సొంత తొట్టిలోని నీళ్ళు త్రాగు. నీ బావిలో ఊరే జలం పానం చెయ్యి.
16 నీ నీటి ఊటలు బయట చెదురుమదురుగా పారవచ్చా? వీధుల్లో అవి కాలువలై పారవచ్చా?
17 ఇతరులు నీతోపాటు వాటిని అనుభవించకూడదు. అవి నీ వినియోగానికే ఉండాలి.
18 నీ జలాశయం మీద ఆశీస్సులు ఉంటాయి గాక! యువదశలో వివాహమాడిన నీ భార్యతో సంతోషించు.
19 ఆమె నీకు సుందరమైన లేడివంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ము ఎప్పటికీ నీకు తృప్తి కలిగిస్తుంది గాక! ఆమె ప్రేమలో ఎల్లప్పుడూ పరవశిస్తావు గాక!
20 నా కుమారా, నీవు ఎందుకు వ్యభిచారిణి వశం అవుతావు? పరాయి ఆడదాని రొమ్ము ఎందుకు కౌగలించుకుంటావు?
21 మనిషి పోకడలు యెహోవాకు తేటతెల్లమే. మనిషి ప్రవర్తన అంతా ఆయన తూచినట్లు అంచనా వేస్తాడు.
22  దుర్మార్గుడు తన అపరాధాల వలలో తానే చిక్కుకుంటాడు. అతడి పాపపాశాలు అతణ్ణే బంధిస్తాయి.
23 క్రమశిక్షణ లేకపోవడం చేత అతడు నశిస్తాడు. బరితెగి మూర్ఖుడై దారి తప్పిపోతాడు.