4
1 ✝నా కుమారులారా, తండ్రి ఉపదేశం వినండి. ఆలకించి, వివేకం అంటే ఏమిటో తెలుసుకోండి.2 నేను మీకు సద్బోధ చేస్తాను. నా ఉపదేశం త్రోసిపుచ్చకండి.
3 ✽మునుపు నేను కూడా నా తండ్రితో ఉన్న కొడుకును. మా అమ్మకు నేనొక్కణ్ణే కొడుకును, సుకుమారుణ్ణి.
4 ✝అప్పుడు నా తండ్రి నాకు ఇలా నేర్పాడు: “నా మాటలను నీ హృదయం గట్టిగా చేపట్టాలి. నా ఆజ్ఞలను పాటిస్తే నీవు బ్రతుకుతావు.
5 ✝“నా నోటి మాటలను మరచిపోకు. వాటి నుంచి తొలగిపోకు. జ్ఞానం, వివేకం సంపాదించుకో.
6 ✽“జ్ఞానాన్ని విడిచిపెట్టకు. అప్పుడు అది నిన్ను సంరక్షిస్తుంది. దాన్ని ప్రేమిస్తే అది నీకు కాపుదల!
7 ✽“జ్ఞానం ప్రధానం. జ్ఞానాన్ని సంపాదించుకో. ఎంత ఇవ్వవలసివచ్చినా వివేకాన్ని సంపాదించుకో.
8 “నీవు జ్ఞానాన్ని గౌరవిస్తే అది నిన్ను గొప్ప చేస్తుంది. జ్ఞానాన్ని కావిలించుకో. అది నిన్ను ఘనపరస్తుంది.
9 ✽“పై నీ తలపై అందమైన దండ ఉంచుతుంది. దివ్య కిరీటం నీకిస్తుంది.”
10 ✽నా కుమారా, విను! నీవు నా మాటలు స్వీకరిస్తే నీవు చిరంజీవి అవుతావు.
11 ✝నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను. తిన్నని త్రోవలో నీకు మార్గదర్శిగా ఉన్నాను.
12 నీవు నడిచేటప్పుడు నీ కాళ్ళు చిక్కు పడవు. నీవు పరిగెత్తేటప్పుడు నీ అడుగులు తడబడవు.
13 ✝ఉపదేశాన్ని జారవిడవకు. దాన్ని గట్టిగా పట్టుకో. దాన్ని పదిలంగా ఉంచుకో. అది నీకు జీవమే.
14 ✝దుర్మార్గుల దారిన అడుగు పెట్టకు. చెడ్డవాళ్ళ మార్గంలో నడవకు.
15 అందులోకి వెళ్ళకు. తప్పించుకు తిరుగు. దాని నుంచి వైదొలగి సాగిపో.
16 ✽ఏదో చెడుగు చేయకపోతే, వాళ్ళకు నిద్ర పట్టదు. ఎవణ్ణయినా కూలద్రోయకపోతే, వాళ్ళకు నిద్ర దూరం అవుతుంది.
17 చెడుగు చేసి సంపాదించిన ఆహారం తింటారు వాళ్ళు. దౌర్జన్యంవల్ల దొరికిన ద్రాక్షరసం త్రాగుతారు.
18 ✝ఉదయంలో కాంతి రేఖ పగటివరకు అంతకంతకు వృద్ధి అవుతుంది. న్యాయవంతుల మార్గం అలాగే ఉంటుంది.
19 ✝దుర్మార్గుల మార్గం కటిక చీకటిలాంటిది. ఏది తట్టుకొని పడతారో వాళ్ళకే తెలియదు.
20 ✝నా కుమారా, నా మాటలు సావధానంగా విను. నేను చెప్పేది చెవిని బెట్టు.
21 నీ చూపునుంచి వాటిని తొలగిపోనియ్యకు. నీ హృదయంలో వాటిని పదిలం చేసుకో.
22 అవి లభించిన వారికి జీవమే. వారికి అవి శరీరారోగ్యం.
23 ✽అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని ఎంతో భద్రంగా కాపాడుకో! ఎందుకంటే జీవిత విధానాలకు అదే మూలాధారం.
24 ✝కుటిల మాటలు నీ నోట ఉండనియ్యకు. నీ పెదవులకు మోసకరమైన పదాలు దూరం చేసుకో.
25 ✽నీ కంటి చూపు సూటిగా ముందుకే సారించు. నీ దృక్పథం తిన్నగా ఉండేలా చెయ్యి.
26 ✝నీవు నడిచే దారిని చదునుగా చెయ్యి. అప్పుడే నీ మార్గాలన్నీ సుస్థిరంగా ఉంటాయి.
27 ✽ కుడికి గాని, ఎడమకు గాని తొలగిపోకు. దుర్మార్గం నుంచి నీ పాదాలను మరల్చుకో.