3
1 ✽నా కుమారా, నా ఉపదేశం మరచిపోకు. నా ఆజ్ఞలను నీ హృదయంలో పదిలం చేసుకో.2 ✽నా ఆజ్ఞలు నీ ఆయుష్షుకు అనేక సంవత్సరాలనూ, శాంతినీ చేకూరుస్తాయి.
3 ✽ కరుణ, సత్యం నిన్ను విడవకుండా చూచుకో. వాటిని కంఠాభరణాలుగా వేసుకో. నీ హృదయ ఫలకంమీద వాటిని రాసిపెట్టుకో.
4 ✝అప్పుడు దేవుడూ, మనుషులూ నిన్ను దయ చూస్తారు. నీకున్న మంచి వివేకాన్ని మెచ్చుకుంటారు.
5 ✽హృదయపూర్వకంగా యెహోవాను నమ్ముకో. నీ స్వంత తెలివితేటలను ఆనుకోవద్దు.
6 నీ విధానాలన్నిటిలో ఆయనవైపు చూస్తూ ఉండు. అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్ననివిగా చేస్తాడు.
7 నీకు నీవే✽ జ్ఞానివనుకోవద్దు. యెహోవాపట్ల భయభక్తులు✽ అలవరచుకో. దుర్మార్గాన్ని విసర్జించు.
8 ✝✽నీవిలా చేయడం నీ శరీరారోగ్యానికి మంచిది, నీ ఎముకలకు పుష్టి కూడా.
9 ✽ నీ పంటలన్నిటిలో ప్రథమ ఫలం, నీకు కలిగేదానిలో ఒక భాగం సమర్పించి యెహోవాను గౌరవించు.
10 అలా చేస్తే, నీ గిడ్డంగులు ధాన్యంతో నిండి ఉంటాయి. నీ గానుగలలోనుంచి క్రొత్త ద్రాక్షరసం పొర్లి పారుతుంది.
11 ✽ నా కుమారా, యెహోవా ఇచ్చే శిక్షను తృణీకరించకు. ఆయన మందలింపుకు విసుగబోకు.
12 తండ్రి తన ప్రియమైన కొడుకును శిక్షిస్తాడు. అలాగే తాను ప్రేమించే వ్యక్తులను యెహోవా శిక్షిస్తాడు.
13 ✽ జ్ఞానం సంపాదించిన మనిషి, వివేకం గడిచిన మనిషి ధన్యజీవి✽.
14 వెండివల్ల కలిగే లాభంకంటే జ్ఞానం వల్ల కలిగే లాభం ఎక్కువ. మేలిమి బంగారంకంటే జ్ఞానం కలిగించే ప్రయోజనం అధికం.
15 జ్ఞానం రత్నాలకంటే విలువైనది. నీవు కావాలనుకొనే వస్తువులేవీ దీనికి సాటి రావు.
16 దాని కుడిచేతిలో దీర్ఘాయుష్షు ఉంది. ఎడమ చేతిలో గౌరవమూ, సంపదా ఉన్నాయి.
17 దాని పోకడలు హాయిని చేకూరుస్తాయి. దాని విధానాలన్నీ శాంతిమయం.
18 దానిని చేజిక్కించుకొన్న వారికి అది జీవవృక్షం✽. దానిని సంపాదించిన వారందరూ ధన్యజీవులు.
19 ✝జ్ఞానంతో యెహోవా భూతలాన్ని నెలకొల్పాడు. వివేకంతో ఆయన ఆకాశాలను సుస్థిరం చేశాడు.
20 ఆయన తెలివివల్ల జలాగాధాలు బ్రద్దలు అయ్యాయి, మేఘాలు మంచు బిందువులను కురిపిస్తాయి.
21 ✽నా కుమారా, లోతైన జ్ఞానం, వివేకం, ఈ రెంటిని పదిలంగా కాపాడుకో. వీటిని నీ దృక్పథం నుంచి తొలగిపోనివ్వకు.
22 అవి నీకు జీవంగా ఉంటాయి. అవి నీకు కంఠాభరణాలుగా ఉంటాయి.
23 అప్పుడు నీ దారిన నీవు సురక్షితంగా నడుస్తావు. నీ కాలు ఎప్పుడూ జారదు.
24 నీవు పడుకొంటే, భయం ఉండదు. పడుకొన్నప్పుడు హాయిగా నిద్రపోతావు.
25 హఠాత్తుగా భయ కారణం కలిగితే, నీవేమీ బెదిరిపోకు. దుర్మార్గుల మీదికి నాశనం ముంచుకు వస్తే భయపడకు.
26 యెహోవా నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఉచ్చులో చిక్కుకోకుండా ఆయన కాపాడుతాడు.
27 ✽✝మేలు చేసే అవకాశం నీ చేతిలో ఉంటే, యోగ్యులైన వారికి మేలు చేయడానికి వెనుకాడవద్దు.
28 ✝నీ పొరుగువాడు అడిగినది నీ దగ్గరుంటే, “పోయిరా, రేపు ఇస్తా లే!” అనకు.
29 ✝నీ పొరుగువాడు నీ దగ్గర నిశ్చితంగా ఉంటే అతడికి కీడు తలపెట్టకు.
30 నీకేమీ హాని చేయని వ్యక్తితో నిష్కారణంగా పోట్లాడకు.
31 ✝దౌర్జన్యపరుణ్ణి చూచి అసూయపడకు. అతడి విధానాలలో దేనినీ అనుసరించకు.
32 వక్ర బుద్ధి గలవారంటే యెహోవాకు చెడ్డ అసహ్యం✽! నిజాయితీపరులకు ఆయన సన్నిహితుడు.
33 ✽✽దుర్మార్గుల ఇంటిమీదికి యెహోవా శాపం వస్తుంది. సన్మార్గుల నివాసాన్ని ఆయన దీవిస్తాడు.
34 ✽వేళాకోళం చేసేవాళ్ళను ఆయన వేళాకోళం చేస్తాడు. వినయం గలవారికి కృప చూపుతాడు.
35 జ్ఞానులు ఘనతకు వారసులవుతారు. మూర్ఖులు అవమానం పెంచుకుంటారు.