2
1 ✽నా కుమారా, నా మాటలు స్వీకరిస్తే, నా ఆజ్ఞలు నీ దగ్గర దాచిపెట్టుకొంటే, 2 జ్ఞానవాక్కులు చెవిని బెడితే, హృదయపూర్వకంగా వివేకం అభ్యాసం చేస్తే, 3 తెలివితేటలకోసం ప్రార్థన చేస్తే, వివేకం కావాలని కంఠమెత్తి అడిగితే, 4 వెండిని వెదికినట్లు దానిని వెదికితే, గుప్త ధనం కోసం గాలించినట్లు దానికోసం గాలిస్తే, 5 ✽అప్పుడు నీవు యెహోవామీది భయభక్తులు అంటే ఏమిటో తెలుసుకొంటావు. దేవుణ్ణి గురించిన పరిజ్ఞానం నీకు లభిస్తుంది.6 ✽యెహోవాయే జ్ఞానదాత. తెలివి, వివేకం ఆయన నోట వెలువడతాయి.
7 ✝ఆయన నిజాయితీపరులకు అభివృద్ధి దయ చేస్తాడు. నిర్దోషంగా నడుచుకొనేవారికి ఆయన డాలులాంటివాడు.
8 ఆయన న్యాయవంతుల త్రోవలను భద్రం చేస్తాడు. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాపాడుతాడు.
9 అప్పుడు నీతి, న్యాయం, నిజాయితీ, ప్రతి మంచి మార్గమూ నీకు తెలిసిపోతాయి.
10 ✝జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. నీకు తెలివితేటలు మనోజ్ఞం అనిపిస్తాయి.
11 ✽అప్పుడు బుద్ధిబలం నీకు రక్షగా ఉంటుంది. వివేకం నీకు కాపుదలగా ఉంటుంది.
12 అది దుర్మార్గుల బారి నుంచి నిన్ను కాపాడుతుంది. వక్ర బుద్ధితో మాట్లాడేవాళ్ళ చేతినుంచి నిన్ను తప్పిస్తుంది.
13 ✝అలాంటివాళ్ళు చక్కని త్రోవలను విడిచి చీకటి బాటల్లోనే నడుస్తారు.
14 ✝వాళ్ళకు కీడు చేయడంలో ఎంతో సంతోషం. వట్టి మూర్ఖుల ప్రవర్తన చూచి, ఆనందిస్తారు వాళ్ళు.
15 ✝వాళ్ళు వక్రమార్గాలలో నడుస్తారు. వాళ్ళు కపటంగా ప్రవర్తిస్తారు.
16 ✽జ్ఞానం నిన్ను వ్యభిచారిణినుంచి కాపాడుతుంది. ఇచ్ఛకం మాటలు చెప్పే వేశ్యనుంచి తప్పిస్తుంది.
17 అలాంటి స్త్రీ యువదశలో భర్తను విడిచిపెట్టి, తన దేవుని ఒడంబడికను మరచిపొయ్యేది.
18 ✝ఆమె కొంప చావుకు దారితీస్తుంది. ఆమె నడిచే త్రోవలు చనిపోయినవాళ్ళ దగ్గరికి పోతాయి.
19 ✽అలాంటి స్త్రీ దగ్గర చేరేవారెవరూ మళ్ళీ రారు. వారు జీవ మార్గం చేరరు.
20 ✝నీవు నా మాట వింటే, మంచివారు నడిచే త్రోవల్లో నడుచుకొంటావు. న్యాయవంతుల ప్రవర్తన అనుసరిస్తావు.
21 నిజాయితీపరులు దేశంలో కాపురం ఉంటారు. నిర్దోషులు దానిలో ఉండిపోతారు.
22 కాని, దుర్మార్గులు దేశంలో లేకుండా నిర్మూలమవుతారు. నమ్మక ద్రోహులను ఇక్కడనుంచి లాగిపారవేయడం జరుగుతుంది.