సామెతలు
1
1 ✽ఇవి దావీదు కుమారుడూ, ఇస్రాయేల్ రాజూ అయిన సొలొమోను సామెతలు. 2 ✽జ్ఞానమూ, ఉపదేశమూ ఏమిటో తెలుసుకోవడానికీ, పరిజ్ఞాన ప్రబోధాలు అర్థం చేసుకోవడానికి ఈ సామెతలు ఉపయోగమైనవి.3 నీతి, న్యాయం, నిజాయితీ ఆచరణలో పెట్టడానికి వివేకం నేర్పుతాయి ఈ సామెతలు.
4 ఇవి తెలివితక్కువ✽ వారికి బుద్ధి కలిగిస్తాయి, యువకులకు✽ తెలివితేటలు, వివేచనాశక్తి చేకూరుస్తాయి.
5 ఇవి విన్న జ్ఞానికి జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. వివేకి వింటే ఆలోచన అతడికి కలుగుతుంది.
6 వీటి మూలంగా సామెతలు, సాదృశ్యాలు, జ్ఞానులు చెప్పే వాక్కులు, వారి పొడుపు కథలు ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు.
7 యెహోవాయందు భయభక్తులు✽ తెలివికి ఆరంభం. మూర్ఖులు✽ జ్ఞానాన్ని, తర్బీతును నిరాకరిస్తారు.
8 ✽నా కుమారా! నీ తండ్రి ఉపదేశం విను. నీ తల్లి నేర్పే వాటిని త్రోసిపుచ్చకు.
9 ✝అవి నీ తలపై అందమైన పూదండలాగా ఉంటాయి. అవి నీకు కంఠహారాలుగా ఉంటాయి.
10 ✽నా కుమారా! పాపులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు.
11 వాళ్ళు నీతో ఇలా చెప్పవచ్చు: “మాతో వచ్చెయ్యి! ఎవరినో చంపడానికి దారిలో పొంచి ఉందాం. అమాయకుణ్ణి ఎవరినైనా పట్టుకుందాం. దారి కాచి ఉందాం, రా.
12 “మృత్యువులాగా ఆ మనుషులను ప్రాణాలతో మింగేద్దాం. నాశనకరమైన గుండం మనుషులను దిగమింగినట్లు వాళ్ళను పూర్తిగా మింగేద్దాం, రా.
13 “రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి. మన ఇండ్లను దోపిడీతో నింపుకుందాం.
14 “నీవు మాతో పొత్తు కలువు. మనం డబ్బు సంచి ఉమ్మడిగా పెట్టుకుందాం.”
15 కుమారా, వాళ్ళు అలా అంటే వాళ్ళతో వెళ్ళకు. వాళ్ళ దారిన అడుగు పెట్టకుండా నీ పాదం వెనక్కు తీసుకో.
16 ✝కీడు చేసేందుకు వాళ్ళ పాదాలు పరిగెత్తుతాయి. రక్తపాతం చేసేందుకు వాళ్ళు త్వరపడతారు.
17 ✽పక్షులన్నీ చూస్తూ ఉంటే, వల ఒడ్డడం వృథా ప్రయాస.
18 ✽వాళ్ళు పొంచి ఉండడం వాళ్ళ నాశనానికే! వాళ్ళు మాటులో దాక్కొని ఉంటే, వాళ్ళనే పట్టడం జరుగుతుంది!
19 ✝అక్రమ లాభం సంపాదించేవాళ్ళకు పట్టే గతి అదే. అలాంటి లాభం దొరికినవాడి ప్రాణం అదే తీస్తుంది.
20 ✽జ్ఞానం వీధిలో కేకలు వేస్తూ ఉంది. సంత వీధుల్లో జ్ఞానం బిగ్గరగా మాట్లాడుతుంది.
21 చాలా సందడి ఉన్న చోట్ల కూడా చాటుతుంది. పట్టణంలో నగర ముఖద్వారాల దగ్గర జ్ఞానం తన వాక్కులు ఇలా పలుకుతుంది:
22 ✽“తెలివి తక్కువవారలారా! ఎంతకాలమని తెలివితక్కువ స్థితిలో ఉండడం మీకిష్టం? పరిహాసకుల్లారా! మీరెన్నాళ్ళు వేళాకోళం చేయడం ఇష్టపడుతూ ఉంటారు? మూర్ఖులారా! మీరెన్నాళ్ళు జ్ఞానాన్ని ఏవగించుకొంటారు?
23 ✽“నా హెచ్చరిక విని నావైపు తిరగండి. వినండి, నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను. నా ఉపదేశం మీకు వినిపిస్తాను.
24 ✽ “కాని, నేను పిలిచినప్పుడు, మీరు నన్ను తిరస్కరించారు. నేను చెయ్యి చాపినప్పుడు, ఎవరూ లెక్క చేశారు కారు.
25 “నేను చెప్పే సలహా అంతా మీరు నిర్లక్ష్యం చేశారు. నా మందలింపును పాటించడం మీకు ఇష్టం లేదు.
26 ✽✝“అందుచేత మీకు ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడు నేను నవ్వుతాను. మీరు భయపడ్డప్పుడు నేను వేళాకోళం చేస్తాను.
27 “తుఫాను లాగా భయం మిమ్ములను ఆవరించినప్పుడు, సుడిగాలిలో మిమ్ములను ప్రమాదం చుట్టి వచ్చినప్పుడు, మీకు కడగండ్లు, దుఃఖం కలిగినప్పుడు, నేను మిమ్ములను చూచి ఎగతాళి చేస్తాను.
28 ✽“ఆ సమయంలో వాళ్ళు నాకు మొరపెట్టుకుంటారు. గాని, నేను ఏమీ జవాబివ్వను. నన్ను శ్రద్ధగా వెదుకుతారు గాని, నేను వాళ్ళకు దొరకను.
29 ✽“జ్ఞానం అంటేనే వాళ్ళకు ఏవగింపు. యెహోవామీది భయభక్తులంటే వాళ్ళకు ఇష్టం లేకపోయింది.
30 “వాళ్ళు నా సలహా అంగీకరించలేదు. నేను మందలిస్తే, మరీ తృణీకరించారు.
31 ✝“కాబట్టి వాళ్ళు తమ ప్రవర్తనకు తగిన ఫలితం అనుభవిస్తారు. తీరా తమ విధానాలు తమకు వెగటు కలిగిస్తాయి.
32 ✽“తెలివితక్కువవాళ్ళు జ్ఞానంనుంచి వైదొలగి పోవడం వల్ల మృతిపాలవుతారు. మూర్ఖులు లేని క్షేమాన్ని ఊహించుకొని దానివల్ల నాశనమవుతారు.
33 ✝“నా మాట వినేవారు సురక్షితంగా ఉండిపోతారు. వారు కీడు వస్తుందేమో అనే భయం లేకుండా ప్రశాంతంగా ఉంటారు.”