148
1 యెహోవాను స్తుతించండి!
పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి!
ఉన్నత స్థలాలలో ఉన్నవారలారా,
ఆయనను స్తుతించండి!
2 యెహోవా దేవదూతలారా,
మీరంతా ఆయనను స్తుతించండి.
యెహోవా సైన్యాల్లారా,
మీరంతా ఆయనను స్తుతించండి!
3 సూర్యమండలమా, చంద్రగోళమా,
ఆయనను స్తుతించండి!
కాంతిమయ సమస్త నక్షత్రాల్లారా,
ఆయనను స్తుతించండి!
4 అంతరిక్ష సీమలారా, ఆయనను స్తుతించండి!
ఆకాశంపై ఉన్న జలాల్లారా,
ఆయనను స్తుతించండి!
5 యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు
ఇవన్నీ ఉనికిలోకి వచ్చాయి.
ఇవి యెహోవా పేరును స్తుతిస్తాయి గాక!
6 ఆయన వాటిని ఎప్పటికీ ఉండేలా నిర్మించాడు.
వాటిని గురించి శాసనం విధించాడు.
ప్రతిదీ దానికి లోబడక తప్పదు.
7 భూమిమీద ఉన్న సృష్టమా,
యెహోవాను స్తుతించండి!
సముద్రంలోని బ్రహ్మాండమైన ప్రాణులారా,
జలాగాధమా, ఆయనను స్తుతించండి!
8 మెరుపులూ, వడగండ్లూ, చల్లని మంచూ,
ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానూ,
9 పర్వతాలూ, సమస్తమైన కొండలూ,
ఫలభరితమైన చెట్లూ,
సమస్త దేవదారు వృక్షాలూ,
10 మృగాలూ, సమస్తమైన పశువులూ,
నేలమీద పాకే ప్రాణులూ,
రెక్కలతో పైకి ఎగిరే పక్షులూ
యెహోవాను స్తుతించాలి.
11 భూరాజులారా, అన్ని దేశాల ప్రజలారా,
ఈ లోకంలోని నాయకులారా,
సమస్త న్యాయాధిపతులారా,
12 యువకులారా, కన్యలారా, వృద్ధులారా, పిల్లలారా,
యెహోవాను స్తుతించండి.
13 వారు యెహోవా పేరును స్తుతిస్తారు గాక!
ఆయన పేరు మాత్రమే ఉన్నతమైన పేరు.
ఆయన వైభవం భూమికంటే, ఆకాశంకంటే
కూడా ఉన్నతం.
14 ఆయన తన ప్రజల కొమ్ము ఎత్తించాడు,
తన భక్తులందరికీ స్తుతికారణం కలిగించాడు.
వారు ఆయన దగ్గర చేరిన ప్రజ,
ఇస్రాయేల్‌ప్రజ.
యెహోవాను స్తుతించండి!