147
1 ✽యెహోవాను స్తుతించండి!మన దేవుణ్ణి సంకీర్తనం చేయడం మంచిది✽.
అది మనోహరం✽. దేవ సంస్తుతి ఎంతైనా తగినది.
2 యెహోవాయే జెరుసలంను కట్టించేవాడు✽.
చెదరిపోయిన ఇస్రాయేల్‌ప్రజలను
సమకూర్చేవాడు✽ ఆయనే.
3 ✽ గుండెలు బ్రద్దలైపోయిన వారిని ఆయన
బాగు చేస్తాడు.
వారి గాయాలకు చికిత్స చేస్తాడు.
4 ✽నక్షత్రాల లెక్క ఆయనకు తెలుసు.
ప్రతి నక్షత్రానికి ఆయన పేరు పెట్టేవాడు.
5 మన ప్రభువు గొప్పవాడు✽.
ఆయనది అత్యంత బలం.
ఆయన జ్ఞానం✽ అనంతమైనది.
6 దీనావస్థ✽లో ఉన్నవారిని యెహోవా ఆదరిస్తాడు.
దుర్మార్గులను నేలమట్టం చేస్తాడు.
7 కృతజ్ఞత✽ కలిగి యెహోవాకు సంకీర్తనం చెయ్యండి.
తంతివాద్యంతో దేవునికి స్తుతిగీతాలు పాడండి.
8 ✽ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పివేస్తాడు.
భూమికి వర్షం ఇస్తాడు.
కొండల మీద గడ్డి మొలిపిస్తాడు.
9 పశువులకు, కావుకావుమనే కాకి పిల్లలకు
ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు.
10 ✽ గుర్రాల బలమంటే ఆయనకు సంతోషం ఉండదు.
మనిషి కాల్బలం అంటే ఆయనకు ఆనందం
ఉండదు.
11 యెహోవాపట్ల భయభక్తులు ఉన్నవారంటే,
ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూచేవారంటే
ఆయనకు ఆనందం.
12 ✽ జెరుసలమా! యెహోవాను స్తుతించు!
సీయోను! నీ దేవుణ్ణి కీర్తించు!
13 ఆయన నీ గుమ్మాల గడియలను
బలమైనవిగా చేశాడు.
నీ మధ్య నీ ప్రజలను ఆయన దీవించాడు.
14 నీ పొలిమేరల్లో శాంతి సంస్థాపన చేసేవాడు
ఆయనే.
మంచి గోధుమ పంటతో నీకు తృప్తి
కలిగించేవాడు ఆయనే.
15 ✽ ఆయనే భూతలంమీద ఆజ్ఞ జారీ చేశాడు.
ఆయన వాక్కు చాలా వేగంగా పరుగెత్తిపోతుంది.
16 ✽గొర్రెబొచ్చులాంటి తెల్లటి మంచు ఆయనే
కురిపిస్తాడు.
బూడిదలాంటి మంచు కణాలు ఆయనే చల్లుతాడు.
17 వడగండ్లు ఆయనే తునకలుగా విసరివేస్తాడు.
ఆయన పుట్టించే చలికి ఎవరు తట్టుకోగలరు?
18 ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు
అవన్నీ కరిగిపోతాయి.
ఆయన గాలి వీచేలా చేస్తే నీళ్ళు పారుతాయి.
19 ✽ తన వాక్కును ఆయన యాకోబుకు తెలియజేశాడు.
తన ఆదేశాలు, న్యాయ నిర్ణయాలు ఇస్రాయేల్‌కు
తెలిపాడు.
20 ✽ మరి ఏ ఇతర ప్రజకు ఆయన ఈ విధంగా
జరిగించలేదు.
ఆయన న్యాయ నిర్ణయాలు వాళ్ళు తెలుసుకోలేదు.
యెహోవాను స్తుతించండి!