146
1 యెహోవాను స్తుతించండి!
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
2 నేను బ్రతికి ఉన్నంతకాలం యెహోవాను స్తుతిస్తాను.
నాకు ఉనికి ఉన్నంతవరకూ నా దేవునికి
స్తుతిగీతాలు పాడుతాను.
3 రాజులమీద, మానవ మాత్రుల మీద నమ్మకం
పెట్టకండి. వాళ్ళవల్ల రక్షణ కలగదు.
4 వారు ప్రాణం విడుస్తారు.
వారు మట్టిలో కలిసిపోతారు. ఆ రోజే వాళ్ళ ఆలోచనలు అంతరించిపోతాయి.
5 యాకోబు యొక్క దేవుడుఎవరికి అండగా ఉన్నాడో,
ఎవరి ఆశాభావం తన దేవుడైన యెహోవా మీద
లగ్నమై ఉన్నదో వారు ధన్యజీవులు.
6 ఆయన భూమినీ, ఆకాశాలనూ, సముద్రాన్నీ,
అందులో ఉన్నదాన్నంతటినీ సృజించాడు.
ఆయన ఆడిన మాట ఎన్నడూ తప్పడు.
7 దౌర్జన్యానికి గురి అయిన వారికి
ఆయన న్యాయం చేకూరుస్తాడు.
ఆకలి గొన్నవారికి ఆహారం అనుగ్రహిస్తాడు.
బంధకాలలో ఉన్న వాళ్ళకు యెహోవా
విడుదల ప్రసాదిస్తాడు.
8 యెహోవా గుడ్డివాళ్ళ కన్నులు తెరుస్తాడు.
అణగారిపోయినవాళ్ళను పైకెత్తుతాడు.
యెహోవా న్యాయవంతులను ప్రేమిస్తున్నాడు.
9 విదేశీయులను యెహోవా కాపాడుతాడు.
తండ్రి లేనివారినీ విధవరాండ్రనూ ఆదరిస్తాడు.
చెడ్డవాళ్ళ మార్గం వక్రం అయ్యేలా చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.
సీయోను! నీ దేవుడు తరతరాలకు
రాజ్యమేలుతాడు.
యెహోవాను స్తుతించండి!