దావీదు రాసిన స్తుతి కీర్తన
145
1 ✽✽ నా దేవా, నా రాజా, నిన్ను ఘనపరుస్తాను.నిరంతరమూ నీ పేరును కీర్తిస్తాను.
2 ✽ప్రతి రోజూ నిన్ను కీర్తిస్తాను.
నిరంతరమూ నీ పేరును స్తుతిస్తాను.
3 ✽యెహోవా గొప్పవాడు.
ఆయన ఎంతో స్తుతిపాత్రుడు.
ఆయన గొప్పతనం గ్రహింపుకు మించేది.
4 ✝ఒక తరం మనుషులు మరో తరానికి
నీ క్రియలను కొనియాడుతారు.
నీ బలవత్తరమైన చర్యలు వెల్లడి చేస్తారు.
5 ✝నీ ఘనమైన గౌరవపూర్ణ వైభవాన్నీ,
అద్భుతమైన నీ క్రియలనూ నేను ధ్యానిస్తాను.
6 ✝భయభక్తులు కలిగించే నీ క్రియల ప్రభావాన్ని
గురించి మనుషులు చెప్పుకొంటారు.
నేను నీ గొప్పతనాన్ని గురించి వివరిస్తాను.
7 నీ మహా మంచితనాన్ని✽ గురించిన కీర్తి
వారు చాటిస్తారు.
నీ న్యాయాన్ని✽ గానం చేస్తారు.
8 ✝యెహోవా దయాపరుడు, వాత్సల్యపూర్ణుడు,
త్వరగా కోపపడనివాడు, అత్యంత కృప
చూపేవాడు.
9 ✽ ఆయన అందరికీ మంచి చేస్తాడు.
ఆయన వాత్సల్యం ఆయన సృష్టి
అంతటిమీద ఉంది.
10 యెహోవా! నీవు చేసినదానంతటి మూలంగా
నీకు స్తుతులు కలుగుతాయి.
నీ భక్తులు నిన్ను సన్నుతిస్తారు.
11 ✽మనుషులకు నీ బలమైన క్రియలనూ,
నీ రాజ్య ఘనతనూ తెలియజేయాలని
12 వారు నీ రాజ్య ఘనమైన వైభవ విషయం చెపుతారు. నీ బలాన్ని గురించి మాట్లాడుతారు.
13 నీ రాజ్యం ఎప్పటికీ ఉంటుంది.
నీ రాజ్యపరిపాలన తరతరాలకూ ఉంటుంది.
14 ✽ పడిపోయేవారందరికీ యెహోవా సహాయం చేస్తాడు.
అణగారిపోయిన వారందరినీ పైకెత్తుతాడు.
15 ✝అన్ని ప్రాణుల కండ్లు నీవైపు ఆశతో చూస్తున్నాయి.
సరైన వేళకు నీవు వాటికి ఆహారం
అనుగ్రహిస్తావు.
16 నీవు గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి కోరిక తీరుస్తావు.
17 ✽యెహోవా తన విధానాలన్నిటిలో న్యాయవంతుడు,
ఆయన క్రియలన్నిటిలో కృప చూపుతాడు.
18 ✽తనకు ప్రార్థన చేసేవారందరికీ
యథార్థంగా ప్రార్థించేవారికి
యెహోవా దగ్గరగా✽ ఉన్నాడు.
19 తనంటే భయభక్తులున్న వారి కోరిక ప్రకారం
ఆయన చేస్తాడు✽.
సహాయంకోసం వారు పెట్టే మొర విని
వారిని రక్షిస్తాడు✽.
20 తనను ప్రేమించే వారందరినీ ఆయన కాపాడుతాడు✽.
దుర్మార్గులందరినీ ఆయన నాశనం✽ చేస్తాడు.
21 ✽నా నోరు యెహోవా స్తుతి పలుకుతుంది.
శరీరం ఉన్నవారంతా ఆయన పవిత్రమైన
పేరును శాశ్వతంగా కీర్తిస్తారు గాక!