దావీదు కీర్తన
144
1 యెహోవాకు స్తుతి! ఆయన నాకు ఆధారశిల.
ఆయన నా చేతులకు యుద్ధం నేర్పాడు,
నా వ్రేళ్ళకు పోరాటం నేర్పాడు.
2 ఆయన నాకు కృపానిధి. ఆయన నాకు కోట.
ఆయనే నా బలమైన దుర్గం, నా రక్షకుడు.
నాకు డాలు, నాకు ఆశ్రయం ఆయనే!
ఆయన నా ప్రజలను నాకు లోపరచేవాడు.
3  యెహోవా, నీవు మనిషిని లక్ష్యం చేయడానికి
వాడెంతటివాడు?
మానవ సంతానాన్ని గురించి ఆలోచించడానికి
వాడేపాటివాడు?
4 మనిషి వట్టి ఊపిరిలాంటివాడు.
వాడి రోజులన్నీ దాటిపోయే నీడలాగా ఉన్నాయి.
5 యెహోవా! నీ ఆకాశాలను చీల్చి కిందికి దిగిరా!
పర్వతాలు పొగలు వెళ్ళగ్రక్కేలా వాటిని తాకు.
6 మెరుపులు మెరిసేలా చేసి శత్రువులను
చెదరగొట్టు.
నీ బాణాలు వేసి వాళ్ళను ఓడించు.
7 నీ పైస్థలంనుంచి చెయ్యి చాపు. నన్ను విడిపించు.
విస్తార జలాలలోనుంచీ, పరాయివాళ్ళ
చేతులలోనుంచీ నన్ను తప్పించు.
8 వాళ్ళ నోరు వంచన మాటలు పలుకుతుంది.
వాళ్ళ కుడి చేతినిండా అబద్ధాలే.
9  దేవా, నీకు ఒక కొత్త పాట పాడుతాను.
పది తంతుల వాద్యంతో నిన్ను సంకీర్తనం చేస్తాను.
10 నీవే రాజులకు విజయం చేకూరుస్తావు.
దుర్మార్గుల ఖడ్గం బారినుంచి నీ సేవకుడైన
దావీదును కాపాడుతావు నీవు.
11 నాకు విడుదల అనుగ్రహించు.
పరాయివాళ్ళ బారినుంచి నన్ను తప్పించు.
వాళ్ళ నోరు వంచన మాటలు పలుకుతుంది.
వాళ్ళ కుడి చేతినిండా అబద్ధాలే.
12 తమ యువదశలో మా కొడుకులు పెరిగిన
మొక్కలలాగా ఉండేలా చెయ్యి.
మా కూతుళ్ళు రాచనగరు కోసం చెక్కిన
మూలస్తంభాలలాగా ఉండేలా చెయ్యి.
13 మా కొట్లనిండా రకరకాల ద్రవ్యనిధులు
ఉండేలా చెయ్యి.
మా పచ్చిక మైదానాలలో మా గొర్రెలు వేలు,
పదివేల పిల్లలు ఈనేలా చెయ్యి.
14 మా ఎద్దులు నష్టం, నాశనం కాకుండా
భారాలు మోసేలా చెయ్యి.
మా వీధుల్లో ఏడుపు వినబడకుండేలా చెయ్యి.
15  ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలు
ఎంత ధన్యులు!
యెహోవా ఏ ప్రజలకు దేవుడో వారు
ఎంత ధన్యులు!