దావీదు కీర్తన
143
1 యెహోవా, నా ప్రార్థన విను.
నా విన్నపాలు చెవినిబెట్టు.
నీ నమ్మకత్వాన్ని, న్యాయబుద్ధిని అనుసరించి
నాకు జవాబివ్వు.
2 నీ సేవకుడైన నన్ను విచారణలోకి రప్పించకు.
సజీవులలో ఒక్కడు కూడా నీ దృష్టిలో
నిర్దోషి కాడు.
3 శత్రువులు నా వెంటబడ్డారు. వాళ్ళు నా ప్రాణాన్ని
నేలకూల్చారు.
చాలా కాలం క్రిందట చచ్చినవాళ్ళలాగా నన్ను
కటిక చీకట్లో ఉండిపోయేలా చేశారు.
4 నా ఆత్మలో నేనెంతో కుంగిపోయాను.
నా హృదయం నాలో నిరాశ చెందింది.
5  వెనుకటి రోజులు జ్ఞప్తికి వస్తున్నాయి.
నీ కార్యకలాపాలన్నీ నేను ధ్యానిస్తున్నాను.
నీవు స్వయంగా చేతితో చేసినవి
తల పోసుకుంటున్నాను.
6 నీవైపు నా చేతులు చాపుతున్నాను.
ఎండిపోయిన నేలలాగా ఉండి నా ప్రాణం నీకోసం
తహతహలాడుతూ ఉంది. (సెలా)
7 యెహోవా, నా ఆత్మ నీరసించిపోతూ ఉంది.
త్వరలోనే నాకు జవాబివ్వు.
నీ ముఖం నాకు కనిపించకుండా చేయకు.
లేకపోతే, మృత్యు గర్భంలోకి దిగిపోయిన
వారిలాగా ఉంటాను.
8 నాకు నీమీద నమ్మకం ఉంది.
ప్రొద్దున్నే నీ అనుగ్రహాన్ని గురించి నాకు వినిపించు.
నా మనసును నీవైపుకే ఎత్తుతున్నాను.
నేను నడవవలసిన దారి నాకు నేర్పు.
9 యెహోవా, నేను నీ అండన చేరాను.
నా శత్రువుల బారినుంచి నన్ను విడిపించు.
10 నీవే నా దేవుడివి. నీ ఇష్టప్రకారం
ప్రవర్తించడానికి నాకు ఉపదేశించు.
నీ దయగల ఆత్మచేత సమతలం మీద నన్ను
నడిపించు.
11 యెహోవా, నీ పేరుప్రతిష్ఠల కారణంగా నన్ను
బ్రతికించు.
నీ న్యాయాన్ని అనుసరించి నా ప్రాణాన్ని
బాధలలోనుంచి తప్పించు.
12 నేను నీ సేవకుణ్ణి.
నాపై నీ అనుగ్రహంతో నా శత్రువులను
నిర్మూలిస్తావు.
నా ప్రాణాన్ని బాధించేవారిని నాశనం చేస్తావు.