దావీదు దైవధ్యానం.
గుహలో ఉన్నప్పుడు అతడు చేసిన ప్రార్థన.
142
1 ✽✽నేను గొంతెత్తి యెహోవాకు మొరపెట్టుకుంటున్నాను.
కంఠమెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను.
2 ఆయన సన్నిధానంలో నేను నా ఆలోచనలు
వెల్లడి చేసుకుంటున్నాను.
నేను పడ్డ బాధ ఆయన సమక్షంలో వివరంగా
చెప్పుకుంటున్నాను.
3 ✽నా ప్రాణం నాలో ఎంతో కుంగిపోయినప్పుడు
నా నడత నీకు తెలుసు.
నన్ను చేజిక్కించుకోవడానికి నేను నడిచే త్రోవలో
వాళ్ళు రహస్యంగా వలలు పన్నారు.
4 నా కుడిప్రక్క✽ కళ్ళారా చూడు.
నా అనేవాడు ఒక్కడూ నాకు లేకపోయాడు✽.
ఆశ్రయ స్థానమంటూ నాకు లేకపోయింది.
నన్ను దయ చూచేవాడొక్కడూ లేడు.
5 ✽యెహోవా, నీకే నేను మొరపెట్టుకుంటున్నాను.
నేను అన్నాను గదా, నా ఆశ్రయం నీవే,
సజీవుల భూమి మీద నీవే
నాకు కలిగిన వాటా.
6 ✽ నేను చాలా అణగారిపోయి ఉన్నాను.
నా మొర చెవిని బెట్టు.
నన్ను తరిమేవాళ్ళు నాకంటే బలమైన వాళ్ళు.
వాళ్ళ బారినుంచి నన్ను తప్పించు.
7 ✽నీ పేరుకు నేను కృతజ్ఞతలు అర్పిస్తాను.
చెరలో నుంచి నా ప్రాణాన్ని విడిపించు.
నీవు నాకు గొప్ప ఉపకారం చేస్తావు.
న్యాయవంతులు అది చూచి నా చుట్టూరా
సమకూడుతారు.