దావీదు కీర్తన
141
1 యెహోవా, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.నా దగ్గరికి త్వరగా✽ రా!
నేను ప్రార్థించడంతోనే నావైపు వంగి చెవిని బెట్టుకో✽!
2 నా ప్రార్థన నీకు ధూపం✽లాగా అంగీకారంగా
ఉంటుంది గాక!
నేను చేతులెత్తడం సాయంకాల నైవేద్యం✽లాగా
అంగీకారమవుతుంది గాక!
3 ✽యెహోవా, నా నోటికి కావలి ఉంచు,
నా పెదవులు అనే ద్వారాన్ని కాపాడు.
4 ✽చెడుగు చేసేవాళ్ళతో కలవకుండా,
వాళ్ళ చెడ్డ క్రియాకలాపాలలో చేరకుండా
నా మనసు ఎలాంటి దుర్మార్గానికి
తిరగనియ్యకు.
వాళ్ళ రుచి గల పదార్థాలు నేను తినకుండా
ఉంటాను గాక!
5 ✽న్యాయవంతులు నన్ను కొడితే అది నాకు
దయ చూపినట్టే!
వారు నన్ను మందలిస్తే అది నా నెత్తిన
నూనె పోసినట్టే!
నా తల అలాంటి అభిషేకం నిరాకరించదు.
వారి విపత్తులు చూచి వారికోసం
ప్రార్థన చేస్తాను.
6 ✽దుర్మార్గుల న్యాయాధిపతులను రాళ్ళ మధ్యకు
పడద్రోయడం జరుగుతుంది.
అప్పుడు వాళ్ళు నా మాటలు వింటారు.
ఎందుకంటే అవి ఇంపైనవి.
7 ✽ఒక వ్యక్తి భూమిని దున్ని చీరినట్టు
మా ఎముకలు మృత్యులోక ద్వారంలో
చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
8 యెహోవా! నా ప్రభూ!
నా కండ్లు నీ వైపే చూస్తున్నాయి.
నిన్నే నమ్మి ఆశ్రయించాను✽. నా ప్రాణం తోడెయ్యకు.
9 ✝నా కోసం వాళ్ళు ఒడ్డిన వలనుంచి నన్ను
తప్పించు.
చెడుగు చేసే వాళ్ళ ఉచ్చులనుంచి నన్ను కాపాడు.
10 ✽నేను తప్పించుకుపోతూ ఉండగా దుర్మార్గులు
తమ వలల్లో తామే చిక్కుకొంటారు గాక!