గాయకుల నాయకుడికి. దావీదు కీర్తన.
139
1 యెహోవా, నీవు నన్ను బాగా పరిశోధించావు.
నా సంగతంతా నీకు తెలుసు.
2 నేను కూర్చోవడం, నిలవడం నీకు తెలుసు. నాలో తలంపు ఎలాంటిదో దూరంనుంచే గ్రహిస్తావు.
3 నేనెక్కడికి వెళ్ళేదీ, నేనెక్కడ విశ్రమించేదీ
నీవు పరిశీలనగా చూస్తావు.
నా ప్రవర్తన అంతా నీకు తెలుసు.
4  యెహోవా, నా నాలుకపైకి మాట రాకముందే
అదేమిటో నీకు క్షుణ్ణంగా తెలుసు.
5 వెనుకా, ముందూ నీవు నా చుట్టూరా ఉన్నావు.
నీ చెయ్యి నా మీద ఉంచావు.
6 ఇలాంటి తెలివి ఆశ్చర్యకరమే.
అది నా మనసుకు మించినదే.
అది నాకు పైగా ఉంది.
నేను దానిని అందుకోలేను.
7 నీ ఆత్మనుంచి నేనెక్కడికి వెళ్ళేది?
నీ సముఖం నుంచి ఎక్కడికి
పారిపొయ్యేది?
8 ఆకాశానికి ఎక్కిపోదామంటే,
నీవు అక్కడ ఉన్నావు.
మృత్యులోకంలో పడుకుందామంటే,
నీవు అక్కడ ఉన్నావు.
9  ఉదయకాలం రెక్కలతో ఎగిరివెళ్ళి
సముద్రం కొనలలో కాపురమేర్పరచుకొన్నా
10 అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది.
నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది.
11  “చీకటి నన్ను దాచివేస్తుంది,
నా చుట్టు వెలుగు రాత్రి అవుతుంది” అనుకొంటే,
12 చీకటి కూడా నీకు చీకటి కాదు.
రాత్రి నీకు పగటి వెలుగులాంటిది.
చీకటీ, వెలుగూ ఈ రెండూ నీకు ఒకటే!
13 నా అంతరంగాన్నీ సృజించినది నీవే.
మాతృగర్భంలో నన్ను రూపొందించినది నీవే.
14 నీవు నన్ను సృజించిన విధం చూస్తే భయం,
ఆశ్చర్యం కలిగేవి.
గనుక నేను నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను.
నీ క్రియలు అద్భుతమైనవి.
ఆ సంగతి నాకు బాగా తెలుసు.
15 నేను రహస్యంలో నిర్మాణమవుతూ ఉన్నప్పుడు,
నా రూపం భూమి అగాధ స్థలాల్లో ఏర్పడుతూ ఉంటే
అది నీకు కనబడని విషయం కాదు.
16 నేను పిండరూపంలో ఉన్నప్పుడు నీ కండ్లు
నన్ను చూశాయి.
నాకు నియమించబడిన రోజులలో ఒకటి కూడా
గతించక మునుపే నా రోజులన్నీ
నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.
17 దేవా, నీ ఆలోచనలు నాకెంతో విలువైనవి.
అవన్నీ వెరసి ఎంతో గొప్ప మొత్తమవుతుంది.
18 లెక్కపెట్టాలనుకొంటే అవి ఇసుక రేణువుల
కంటే ఎక్కువ.
నేను నిద్ర మేల్కొన్నప్పుడు నేనింకా నీ దగ్గరే
ఉన్నాను.
19 దేవా, దుర్మార్గులను నీవు తప్పనిసరిగా
హతమారుస్తావు.
హంతకులారా! నా దగ్గరనుంచి వెళ్ళిపోండి!
20 ఆ నీ శత్రువులు నీ విషయం చెడ్డగా
మాట్లాడుతారు.
మోసంగా నీ పేరు మీద ప్రమాణం చేస్తారు.
21 యెహోవా, నిన్ను ద్వేషించే వాళ్ళంటేనే నాకు
ద్వేషం గదా.
నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళంటే నాకు
అసహ్యం గదా.
22 వాళ్ళ మీద నాకు పూర్తిగా ద్వేషం ఉంది.
వాళ్ళను నా శత్రువుల క్రింద లెక్కించాను.
23 దేవా, నన్ను పరిశోధించు, నా హృదయంలో
ఏమున్నదో చూడు. నన్ను పరీక్ష చెయ్యి.
నా ఆలోచనలు ఎలాంటివో
24 నా బ్రతుకులో దుఃఖకరమైన విధానమేదైనా
ఉన్నదేమో చూడు.
నేను శాశ్వత మార్గంలో నడిచేలా చెయ్యి.