దావీదు కీర్తన
138
1 నేను హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతలు
అర్పిస్తాను.
దేవుళ్ళు నాకు ఎదురుగా ఉన్నప్పుడు కూడా నేను
నిన్ను సంకీర్తనం చేసుకుంటాను.
2 నీ పవిత్రాలయం వైపు వంగి నిన్ను ఆరాధిస్తాను.
నీ పేరు ప్రతిష్ఠలన్నిటికంటే నీ వాక్కును
గొప్ప చేశావు.
నీ అనుగ్రహం, సత్యం కారణంగా నీ పేర
కృతజ్ఞతలు అర్పిస్తాను.
3 నేను నీకు ప్రార్థన చేసిన రోజున నీవు నాకు
జవాబిచ్చావు.
నాకు అంతరంగంలో బలం, ధైర్యం ప్రసాదించావు.
4  యెహోవా, భూరాజులంతా నీ నోటనుంచి వచ్చిన
వాక్కులు వినేటప్పుడు నీకు కృతజ్ఞతలు అర్పిస్తారు.
5 యెహోవా ఘనత గొప్పదని వాళ్ళు యెహోవా
విధానాలను గురించి పాటలు పాడుతారు.
6 యెహోవాది ఉన్నత స్థానం.
అయినా ఆయన అణగారిపోయినవారిని
కటాక్షిస్తాడు.
ఆయన దూరం నుంచే గర్విష్ఠులను పసికడతాడు.
7 నేను కష్టాలలో చిక్కుకొన్నప్పుడు నీవు నన్ను
బ్రతికిస్తావు.
నీ చెయ్యి చాపి, నా శత్రువుల కోపంనుంచి
నన్ను తప్పిస్తావు.
నీ కుడి చెయ్యివల్ల నన్ను రక్షిస్తావు.
8 యెహోవా నా పక్షంగా పని కొనసాగిస్తాడు.
యెహోవా, నీ అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
నీవు కుడి చేతితో స్వయంగా చేసినది
విడిచిపెట్టకు.