136
1 యెహోవా మంచివాడు.
ఆయనకు కృతజ్ఞతలు అర్పించండి.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
2  దేవాది దేవునికి కృతజ్ఞతలు అర్పించండి.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
3  ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతలు అర్పించండి.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
4  గొప్ప అద్భుతాలు చేయగలవాడు ఆయన ఒక్కడే.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
5 తన జ్ఞానాన్ని అనుసరించి ఆయన
ఆకాశాలను చేశాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
6 ఆయన భూమిని నీళ్ళమీద పరిచాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
7 ఆయన మహా జ్యోతులను నిర్మాణం చేశాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
8 పగటిని పరిపాలించడానికి ఆయన
సూర్య మండలాన్ని చేశాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
9 రాత్రిని పరిపాలించడానికి ఆయన చంద్రగోళాన్ని,
నక్షత్రాలను నిర్మించాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
10 ఈజిప్ట్‌వాళ్ళ తొలిచూలునంతా ఆయన
హతం చేశాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
11 వాళ్ళమధ్య నుంచి ఇస్రాయేల్‌ప్రజలను ఆయన
తీసుకువచ్చాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
12 చెయ్యి చాచి తన భుజ బలంతో వారిని
తీసుకువచ్చాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
13 ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చీల్చాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
14 ఆయన ఇస్రాయేల్‌ప్రజలను దానిమధ్యగుండా
దాటించాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
15 ఫరోను, అతడి సైన్యాన్ని ఎర్ర సముద్రంలో
ఆయన ముంచివేశాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
16 ఎడారిలో ఆయన తన ప్రజలను నడిపించాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
17 మహా రాజులను ఆయన కూలగొట్టాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
18 ప్రసిద్ధులైన రాజులను ఆయన సంహరించాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
19 అమోరీవాళ్ళ రాజు సీహోనును ఆయన
సంహరించాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
20 బాషాను రాజు ఓగును ఆయన సంహరించాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
21  ఆయన వాళ్ళ ప్రాంతాలను వారసత్వంగా
ఇచ్చాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
22 తన సేవకుడైన ఇస్రాయేల్‌వంశానికి దానిని
వారసత్వంగా ఇచ్చాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
23  మనం దీనదశలో ఉన్నప్పుడాయన మనల్ని
జ్ఞాపకం ఉంచుకొన్నాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
24 మన శత్రువుల బారినుంచి మనల్ని విడిపించాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
25 సమస్త ప్రాణికోటికీ ఆయన ఆహారం ఇస్తున్నాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
26 పరలోక దేవునికి కృతజ్ఞతలు అర్పించండి.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.