135
1 యెహోవాను స్తుతించండి!
యెహోవా పేరును స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
2 యెహోవా ఆలయంలో,
మన దేవుని ఆలయ ఆవరణాలలో
నిలుచుండే మీరు యెహోవాను స్తుతించండి!
3 యెహోవా మంచివాడు.
యెహోవాను స్తుతించండి!
ఆయన పేరును గురించి స్తుతిగీతాలు చెయ్యండి!
అది మనోహరం.
4  యెహోవా తన కోసం యాకోబు వంశాన్ని
ఎన్నుకొన్నాడు.
తన సొత్తుగా ఇస్రాయేల్‌ప్రజను
కోరుకొన్నాడు.
5 యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
మన ప్రభువు దేవుళ్ళనబడ్డ వాళ్ళందరికంటే
మించినవాడు.
6  తనకు ఏది ఇష్టమో అదంతా జరిగిస్తాడాయన.
భూమిమీద, ఆకాశాలలో, సముద్రాల్లో,
అన్ని జలాగాధాలలో తన ఇష్టప్రకారం
జరిగిస్తాడు.
7 భూమి కొనలనుంచి ఆవిరి లేచేలా చేస్తాడు.
మెరుపులు పుట్టించి వాన కురిపిస్తాడు.
తన ఖజానాల నుంచి గాలులను పంపుతాడు.
8 ఈజిప్ట్‌వాళ్ళ పెద్ద కొడుకులనూ పశువుల
తొలుచూలులనూ ఆయన హతం చేశాడు.
9 ఈజిప్ట్‌దేశమా! నీ మధ్య, నీ చక్రవర్తి ఎదుట,
అతడి పరివారం ఎదుట, ఆయన సూచకమైన
క్రియలూ అద్భుతాలూ జరిగించాడు.
10 అనేక జనాలను హతం చేశాడు.
బలవంతులైన రాజులను కూల్చాడు.
11 అమోరీవాళ్ళ రాజు సీహోనును,
బాషాను రాజైన ఓగును ఆయన
హతమార్చాడు.
కనాను రాజ్యాలన్నిటినీ పాడు చేశాడు.
12 ఆయన వాళ్ళ ప్రాంతాలను వారసత్వంగా
తన ఇస్రాయేల్‌ప్రజకు వారసత్వంగా
ఇచ్చాడు.
13  యెహోవా, నీ పేరు శాశ్వతంగా నిలుస్తుంది.
యెహోవా, నిన్ను గురించిన జ్ఞాపకం
తరతరాలకూ ఉంటుంది.
14 యెహోవా తన ప్రజలకు న్యాయం చేకూరుస్తాడు.
తన సేవకుల విషయం పశ్చాత్తాపపడడు.
15 ఇతర ప్రజల దేవుళ్ళ విగ్రహాలు
వెండి బంగారాలవి.
అవి మనుషులు చేతులతో చేసినవి.
16 వాటికి నోరుంటుంది గాని మాట్లాడలేవు.
వాటికి కండ్లుంటాయి గాని చూడలేవు.
17 వాటికి చెవులుంటాయి గాని వినలేవు.
వాటికి నోట్లో ఊపిరి లేదు.
18 విగ్రహాలను తయారు చేసేవాళ్ళు,
వాటిమీద నమ్మకం పెట్టేవాళ్ళంతా
వాటిలాగే అవుతారు.
19 ఇస్రాయేల్‌వంశికులారా! యెహోవాను కీర్తించండి!
అహరోను వంశికులారా! యెహోవాను కీర్తించండి!
20 లేవీ వంశంవారలారా! యెహోవాను కీర్తించండి!
యెహోవా అంటే భయభక్తులున్న వారలారా!
యెహోవాను కీర్తించండి!
21 జెరుసలంలో నివసించే యెహోవా సీయోనులో
కీర్తి అందుకొంటాడు గాక!
యెహోవాను కీర్తించండి!