యాత్రల కీర్తన
132
1 యెహోవా, దావీదునూ అతడి కడగండ్లన్నీ
జ్ఞాపకముంచుకో.
2  అతడు యెహోవాకు ప్రమాణం చేశాడు,
యాకోబు యొక్క పరాక్రమశాలి అయిన దేవునికి
మొక్కుబడి చేశాడు:
3 “యెహోవాకు నేను స్థలం చూచేవరకూ
యాకోబు యొక్క పరాక్రమశాలి అయిన
దేవునికి నివాసం చూచేవరకూ
4 నేను కాపురమున్న డేరాలో ప్రవేశించను,
నా మంచంమీద పడుకోను,
5 నా కండ్లకు నిద్ర రానియ్యను,
నా కను రెప్పలకు కునికిపాట్లు రానియ్యను.”
6 ఎఫ్రాతాలో విన్నాం.
అడవి మైదానంలో అది మనకు దొరికింది.
7 యెహోవా నివసించే చోటికి వెళ్దాం రండి.
ఆయన పాదపీఠం ముందు సాష్టాంగపడుదాం రండి.
8  యెహోవా, లే!
నీ బలానికి సూచకమైన పెట్టెతో
నీ విశ్రాంతి స్థానంలో ప్రవేశించు.
9  నీ యాజులు న్యాయాన్ని వస్త్రంలాగా
ధరించుకొంటారు గాక!
నీ భక్తులు ఆనంద ధ్వనులు చేస్తారు గాక!
10  నీ సేవకుడైన దావీదు కోసం నీ అభిషిక్తుణ్ణి
నిరాకరించకు.
11 యెహోవా దావీదుకు నమ్మకమైన ప్రమాణం చేశాడు.
ఆయన ఆ మాట తప్పడు. ఏమిటంటే,
“నీ సంతానాన్ని నీ సింహాసనం ఎక్కిస్తాను.
12 నీ కొడుకులు నా ఒడంబడిక పాటిస్తే,
నేను వారికి నేర్పే శాసనాలు ఆచరిస్తే,
వారి కొడుకులు కూడా ఎప్పటికీ
నీ సింహాసనమెక్కుతారు.”
13 ఎందుకంటే, యెహోవా సీయోనును ఎన్నుకొన్నాడు,
దానిని తన నివాసంగా కోరుకొన్నాడు.
14 “ఇది నేను కోరుకొన్న స్థలం.
కనుక ఇది ఎప్పటికీ నా విశ్రాంతి స్థానంగా
ఉంటుంది. నేనిక్కడ ఉంటాను.
15 దానికి ఆశీస్సులు ప్రసాదిస్తూ సమృద్ధిగా ఆహారం
లభించేలా చూస్తాను.
అందులోని పేదసాదలు తృప్తిగా తినేలా చేస్తాను.
16  దాని యాజులు విముక్తిని వస్త్రంగా
ధరించేలా చేస్తాను.
దాని భక్తులు బిగ్గరగా ఆనందధ్వనులు చేస్తారు.
17 అక్కడే దావీదు వంశానికి శృంగం
పైకి వచ్చేలా చేస్తాను.
అక్కడే నా అభిషిక్తుని కోసం నేను
ఒక దీపం సిద్ధం చేసి ఉంచాను.
18 ఆయన శత్రువులకు అవమానమే వస్త్రంగా
ధరింపజేస్తాను.
ఆయన కిరీటం ఆయన మీదే ఉండి
ప్రకాశిస్తుంది” అన్నాడు.