యాత్రల కీర్తన
129
1 “నా యవ్వనకాలం నుంచి చాలా సార్లు నా పగవాళ్ళు
నన్ను బాధించారు” అని ఇస్రాయేల్‌
చెపుతూ ఉంది,
2 “నా యవ్వనకాలం నుంచి చాలా సార్లు వాళ్ళు నన్ను
బాధించారు.
అయినా నన్ను ఓడించలేకపొయ్యారు.
3 దున్నేవాళ్ళు నా వీపును దున్నారు.
పొడుగైన చాళ్ళలాంటి గాయాలు చేశారు.”
4 యెహోవా న్యాయవంతుడు.
దుర్మార్గులు కట్టిన తాళ్ళను తెంచివేశాడాయన.
5 సీయోను మీద పగపట్టిన వాళ్ళందరూ
ఆశాభంగం, సిగ్గు పాలై
వెనక్కు తిప్పబడుతారు గాక!
6 వాళ్ళు ఇంటి కప్పుమీద ఉన్న గడ్డిలాగా
ఉంటారు గాక!
పెరిగేముందే అది వాడిపోతుంది.
7 కోసేవాడి గుప్పిలి దానితో నిండదు.
కంకులు కోసేవాడి ఒడి నిండదు.
8  దారిన పొయ్యేవారు వాళ్ళను చూచి,
“యెహోవా ఆశీస్సులు మీ మీద ఉంటాయి గాక!
యెహోవా పేర మిమ్మల్ని దీవిస్తున్నాం” అని చెప్పరు.