యాత్రల కీర్తన
128
1 యెహోవా అంటే భయభక్తులు కలిగి,
ఆయన విధానాలను అనుసరించి
నడిచేవారందరూ ధన్యజీవులు.
2  నీవు కష్టించి సంపాదించుకొన్న ఆహారాన్ని
తింటూ సంతోషిస్తావు.
నీవు క్షేమంగా ఉంటావు.
3 నీ ఇంట్లో నీ భార్య ఫలవంతమైన
ద్రాక్షచెట్టులాగా ఉంటుంది.
నీ భోజనం బల్ల చుట్టూరా నీ పిల్లలు
ఆలీవ్‌మొక్కల్లాగా ఉంటారు.
4 యెహోవా అంటే భయభక్తులున్న వాడికి
ఈ విధంగా ఆశీస్సులు కలుగుతాయి.
5 సీయోనులో నుంచి యెహోవా నిన్ను దీవిస్తాడు గాక!
నీవు బ్రతికినన్నాళ్ళూ జెరుసలం అభివృద్ధి
చూస్తూ ఉంటావు గాక!
6 నీ మనుమలను చూచేవరకు బ్రతుకుతావు గాక!
ఇస్రాయేల్‌ప్రజల మీద శాంతి!