దావీదు రాసిన యాత్రల కీర్తన
124
1 ✽✽ఇస్రాయేల్‌ప్రజ ఈ విధంగా చెప్పాలి:“మనుషులు మనమీదికి ఎగబడ్డప్పుడు
యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
2 వాళ్ళ కోపాగ్ని మనమీద రగిలినప్పుడు
యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
3 వాళ్ళు మనల్ని ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు,
4 నీళ్ళు మనల్ని ముంచివేసి ఉండేవి,
ప్రవాహం మన ప్రాణం మీదుగా పొర్లి
పారి ఉండేది,
5 ప్రవహిస్తూ ఘోషించే జలాలు మన
ప్రాణంమీదుగా పొర్లిపారి ఉండేవి.”
6 ✽వాళ్ళ పళ్ళకు మనల్ని వేటమాంసంగా
యెహోవా అప్పగించలేదు.
ఆయన స్తుతికి పాత్రుడు.
7 మన ప్రాణం పక్షిలాగా వేటకాండ్ల ఉరినుంచి
తప్పించుకొంది. ఉరి తెగిపోయింది.
మనం తప్పించుకొన్నాం.
8 ✽ ఆకాశాలనూ భూమినీ సృజించిన యెహోవా పేరు
మూలంగానే మనకు సహాయం లభిస్తూ ఉంది.