దావీదు వ్రాసిన యాత్రల కీర్తన
122
1 “యెహోవా ఆలయానికి వెళ్దాం రండి” అని
ప్రజలు నాతో చెప్పినప్పుడు
నేను సంతోషించాను.
2 జెరుసలం! నీ ద్వారాల లోపల మా పాదాలు
మోపి నిలిచి ఉన్నాం.
3 జెరుసలం ఒక భాగంతో ఒకటి చక్కగా
కుదిరిన నిర్మాణమైన నగరం.
4 యెహోవా పేరుకు కృతజ్ఞత అర్పించడానికి
యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కిపోతాయి.
ఇది ఇస్రాయేల్‌ప్రజలకు ఇచ్చిన శాసనం.
5 న్యాయం తీర్చడానికి సింహాసనాలను స్థాపించడం
అక్కడే జరిగింది.
అవి దావీదు రాజవంశం సింహాసనాలు.
6 జెరుసలం శాంతికోసం ప్రార్థన చేయండి.
జెరుసలం! నిన్ను ప్రేమించేవారికి వృద్ధి!
7 నీ ప్రాకారాలలో శాంతి ఉంటుంది గాక!
నీ నగరులలో అభివృద్ధి ఉంటుంది గాక!
8 నా సోదరుల కోసం, నా మిత్రుల కోసం
“నీలో శాంతి ఉంటుంది గాక”!
అంటున్నాను.
9 మన దేవుడైన యెహోవా ఆలయంకోసం నీకు
మేలు చేయడానికి విశ్వప్రయత్నం చేస్తాను.