యాత్రల కీర్తన
121
1 కొండల వైపు నా తలెత్తి చూస్తాను.
ఎక్కడ నుంచి నాకు సహాయం వస్తుంది?
2 ఆకాశాలనూ, భూమినీ సృజించిన యెహోవా నుంచే
నాకు సహాయం వస్తుంది.
3 ఆయన నిన్ను తప్పటడుగు వెయ్యనియ్యడు.
నిన్ను కాపాడేవాడు కునికేవాడు కాడు.
4 ఇస్రాయేల్‌ప్రజను కాపాడేవాడు
కునుకడు, నిద్రపోడు.
5 నిన్ను కాపాడేవాడు యెహోవాయే.
నీ కుడిప్రక్కన యెహోవా నీకు తోడునీడ.
6 పగలు ఎండవడ నీకు కొట్టదు.
రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు.
7  నీవు ఏ ప్రమాదంలోనూ చిక్కుకోకుండా
యెహోవా నిన్ను కాపాడుతాడు.
ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
8 ఇప్పటినుంచీ ఎప్పటికీ నీ రాకపోకల్లో
యెహోవా నిన్ను కాపాడుతాడు.