119
ఆలెఫ్1 ✽యెహోవా ఉపదేశం అనుసరించి నిర్దోషంగా
నడుచుకొనేవారు ధన్యజీవులు.
2 ✽ఆయన శాసనాల ప్రకారం ప్రవర్తిస్తూ,
హృదయ పూర్తిగా ఆయనను వెదికేవారు
ధన్యజీవులు.
3 ✽వారు ఆయన త్రోవలలో నడుచుకుంటారు,
ఏ విధమైన అక్రమమూ చెయ్యరు.
4 ✽నీ ఆదేశాలను తప్పకుండా పాటించాలని నీవు
వాటిని ఆజ్ఞాపించావు.
5 ✽అహో! నీవు నియమించిన చట్టాలను
అనుసరించడానికి నా ప్రవర్తన
సుస్థిరంగా ఉంటే ఎంత బావుండేది!
6 నీ ఆజ్ఞలన్నిటినీ నేను పట్టించుకొనేటప్పుడు
నాకు ఆశాభంగమేమీ✽ కలగదు.
7 ✽న్యాయాన్ని గురించిన నీ నిర్ణయాలను నేను
నేర్చుకొంటూ, యథార్థ హృదయంతో నీకు
కృతజ్ఞతలు చెప్పుకుంటాను.
8 ✽ నేను నీ చట్టాల ప్రకారం బ్రతుకుతాను.
నన్ను పూర్తిగా విడిచిపెట్టకు.
బేత్
9 ✽యువకులు తమ ప్రవర్తనను దేనిని బట్టి
శుద్ధి చేసుకోగలరు?
నీ వాక్కును ఆచరించడం ద్వారానే గదా!
10 ✽ హృదయపూర్తిగా నిన్ను వెదికాను.
నన్ను నీ ఆజ్ఞలు జవదాటనియ్యకు.
11 ✽ నీకు విరోధంగా తప్పిదమేమీ చేయకుండేలా
నీ వాక్కు నా హృదయంలో పదిలం
చేసుకొన్నాను.
12 ✽యెహోవా, నీవు స్తుతికి పాత్రుడవు.
నీ చట్టాలు నాకు ఉపదేశించు.
13 ✽నీ నోటినుంచి వెలువడ్డ న్యాయ నిర్ణయాలన్నీ
నా పెదవులతో వివరించి చెపుతాను.
14 ✽నీ శాసనాలను అనుసరించడం నాకు సంతోషం.
అది నాకు ఐశ్వర్యమంతా లభించినట్టే!
15 ✽నీ నియమాలను నేను తలపోసుకుంటాను.
నీ విధానాలను గౌరవంతో చూస్తాను.
16 ✝నీ చట్టాలను బట్టి నేను ఆనందిస్తాను.
నీ వాక్కు నేను మరచిపోను.
గీమెల్
17 ✽నీ సేవకుడైన నేను బ్రతికి ఉండేలా
దయ చూపు. నీ వాక్కుప్రకారం జీవిస్తాను.
18 ✽నేను ఆశ్చర్యం గొలిపే విశేషాలను నీ ఉపదేశంలో
చూచేలా నాకు కనువిప్పు కలిగించు.
19 ఇహలోకంలో నేను పరాయివాణ్ణి✽.
నా నుంచి నీ ఆజ్ఞలను దాచిపెట్టకు.
20 ✽ నీ న్యాయ నిర్ణయాలమీద నాకు ఎప్పుడూ ఉన్న
ఆశతో నా ప్రాణం తపించిపోతూ ఉంది.
21 ✝గర్విష్ఠులమీద కోపపడుతావు నీవు.
నీ ఆజ్ఞలు జవదాటేవారు శాపగ్రస్తులు.
22 ✝నీ శాసనాల మేరకు నేను బ్రతికాను.
నింద, తిరస్కారం నా మీదనుంచి తొలగించు.
23 ✽అధికారులు సమకూడి నాకు వ్యతిరేకంగా
మాట్లాడుతారు.
నీ సేవకుడైన నేను నీ చట్టాలను గురించే
తలపోస్తూ ఉంటాను.
24 ✽నీ శాసనాలు నాకు సంతోష కారణాలు.
అవి నాకు ఆలోచనకర్తలుగా ఉన్నాయి.
దాలెత్
25 ✽నా ప్రాణం మట్టికి అంటుకుపోయింది.
నీ వాక్కు ప్రకారం నన్ను బ్రతికించు.
26 ✽నా జీవిత విధానాలను గురించి నేను నీకు
వివరంగా చెప్పాను.
నీవు నాకు జవాబిచ్చావు.
నీ చట్టాలు నాకు నేర్పు✽.
27 ✝నీ నియమాల విధానం నేను గ్రహించేలా చెయ్యి.
నీ అద్భుతాలను నేను ధ్యానించుకొంటాను.
28 ✽ దుఃఖంవల్ల నా ప్రాణం కరిగి నీరైపోయింది.
నీ వాక్కు ప్రకారం నన్ను బలపరచు.
29 ✽ మోసకరమైన మార్గంలో నేను వెళ్ళకుండా చెయ్యి.
నీ ఉపదేశం నాకు ప్రసాదించు.
30 ✽ సత్య మార్గం నేను ఎన్నుకొన్నాను.
నీ న్యాయ నిర్ణయాలను నా ముందు ఉంచుకొన్నాను.
31 ✽యెహోవా, నేను నీ శాసనాలను
అంటిపెట్టుకొన్నాను.
నాకు ఆశాభంగమేమీ కలగనియ్యకు.
32 ✽నా అంతరంగాన్ని నీవు విశాలం చేసేటప్పుడు,
నీ ఆజ్ఞలు చూపెట్టే దారిన నేను పరుగెత్తుతాను. హే
33 ✽ యెహోవా, నీ చట్టాలను పాటించి నడవడానికి
నాకు నేర్పు.
అప్పుడు అంతంవరకు వాటిని నేను ఆచరిస్తాను.
34 నీ ఉపదేశం ప్రకారం ప్రవర్తించేందుకు
నాకు కావలసిన గ్రహింపు అనుగ్రహించు.
అప్పుడు హృదయపూర్వకంగా నేను దానిని
ఆచరిస్తాను.
35 ✽నీ ఆజ్ఞల మార్గంలో నేను నడిచేలా చెయ్యి.
అందులో నాకెంతో ఆనందం.
36 ✽పేరాశవైపు నా హృదయం తిరగకుండా చెయ్యి.
నీ శాసనాలవైపు నా హృదయాన్ని తిప్పు.
37 ✽వ్యర్థమైనవాటినుంచి నా చూపులు మరల్చు.
నీ మార్గంలో నన్ను బ్రతికించు.
38 ✽నీ వాక్కు నీపట్ల భయభక్తులు కలిగిస్తుంది.
నీ సేవకుడైన నాకు దానిని సుస్థిరం చెయ్యి.
39 ✽నీ న్యాయ నిర్ణయాలు శ్రేష్ఠమైనవి.
నాకు భయం కలిగించే నా అవమానాన్ని తొలగించు.
40 ✽నీ ఆదేశాల కోసం నేను తహతహలాడుతూ ఉన్నాను.
నీ న్యాయాన్ని బట్టి నన్ను బ్రతకనియ్యి.
వావ్
41 ✽ యెహోవా, నీ అనుగ్రహం నా మీదికి రానియ్యి.
నీ వాక్కు ప్రకారమే నాకు రక్షణ ప్రసాదించు.
42 ✝అప్పుడు నన్ను తూలనాడేవాళ్ళకు
నేను జవాబు చెప్పగలను.
ఎందుకంటే నీ మాటంటే నాకు నమ్మకం.
43 ✽నీ సత్య వాక్కును పూర్తిగా నా నోట్లో
లేకుండా చేయకు.
నీ న్యాయ నిర్ణయాల కోసం ఎదురు చూశాను.
44 ✽ఎల్లప్పుడు నీ ఉపదేశం ప్రకారం ప్రవర్తిస్తాను.
శాశ్వతంగా దాని ప్రకారమే నేను బ్రతుకుతాను.
45 ✝నీ నియమాలకోసం నేను వెదికేవాణ్ణి,
గనుక నా ప్రవర్తనలో ఎలాంటి ఇరుకూ ఉండదు.
46 ✝రాజుల సమక్షంలో అయినా సరే,
నీ శాసనాల విషయం చెపుతాను.
నేను సిగ్గుపడను.
47 ✽నీ ఆజ్ఞలను బట్టి నేను సంతోషిస్తాను.
అవి నాకెంతో ప్రీతి పాత్రమైనవి.
48 ✽ నాకు ప్రీతిపాత్రమైన నీ ఆజ్ఞలవైపు
నా చేతులు ఎత్తుతాను.
నీ చట్టాల విషయమే నేను తలపోసుకుంటూ
ఉంటాను.
జాయిన్
49 ✽నీ సేవకుడైన నాకు నీవిచ్చిన మాట తలచుకో.
దాని మూలంగా నాకు ఆశాభావం
కలిగేలా చేశావు.
50 ✽నా దీనావస్థలో నా ఆదరణ ఇదే:
నీ వాక్కు నన్ను బ్రతికించింది.
51 ✽ గర్విష్ఠులు నన్ను అత్యంతగా వేళాకోళం చేశారు.
అయినా సరే, నీ ఉపదేశంనుంచి నేను
వైదొలగకుండా ఉన్నాను.
52 ✽యెహోవా, పూర్వకాలం నుంచి ఉన్న నీ
న్యాయ నిర్ణయాలను జ్ఞాపకం చేసుకొని,
నన్ను నేను ఓదార్చుకొన్నాను.
53 ✽నీ ఉపదేశాన్ని విసర్జించే దుర్మార్గుల
కారణంగా నాకు ఎంతో ఆందోళన.
54 ✽నేను పరదేశిగా ఉన్న నా నివాసంలో
నీ చట్టాలు నాకు పాటలయ్యాయి.
55 ✽ యెహోవా, రాత్రిపూట నేను నీ
పేరును గురించి తలచుకుంటాను.
నీ ఉపదేశం ప్రకారం ప్రవర్తిస్తున్నాను.
56 ✽నీ ఆదేశాలను ఆచరిస్తున్నాను.
ఇదే నాకు లభించిన భాగ్యం.
హేత్
57 ✽యెహోవా, నీవే నా వాటా✽.
నీ వాక్కుకు అనుగుణంగా ప్రవర్తిస్తానని✽
నేను మాట ఇచ్చాను.
58 ✽నన్ను కటాక్షించమని హృదయపూర్వకంగా
నిన్ను బతిమాలుతున్నాను.
నీ వాక్కు మేరకు నన్ను దయ చూడు.
59 ✝నా విధానాలను నేను పరిశీలన చేసుకొన్నాను.
నీ శాసనాలవైపు నేను తిరిగాను.
60 ✽నీ ఆజ్ఞలను శిరసావహించడానికి ఆలస్యం
చేయకుండా త్వరగా సిద్ధమయ్యాను.
61 ✽ దుర్మార్గుల బంధకాలు నా చుట్టూ ఉన్నాయి.
అయినా, నీ ఉపదేశాన్ని నేను మరిచిపోయేవాణ్ణి
కాను.
62 ✽ మధ్యరాత్రిలో నిద్ర మేల్కొని,
న్యాయసమ్మతమైన నీ నిర్ణయాల కారణంగా
నీకు కృతజ్ఞతలు✽ అర్పిస్తాను.
63 ✽ నీవంటే భయభక్తులున్న వారందరికీ,
నీ ఆదేశాలను పాటించేవారందరికీ
నేను మిత్రుణ్ణి.
64 యెహోవా, ఈ లోకమంతా నీ అనుగ్రహంతో
నిండి ఉంది✽.
నీ చట్టాలు నాకు నేర్పు✽.
తేత్
65 యెహోవా, నీ సేవకుడైన నాకు మేలు చేశావు.
అది నీ మాట ప్రకారమే.
66 ✽నీ ఆజ్ఞలను నేను నమ్మాను.
నాకు శ్రేష్ఠమైన జ్ఞానం, వివేచనం నేర్పు.
67 ✽నాకు బాధ రాకముందు త్రోవ తప్పాను నేను.
ఇప్పుడు నీ వాక్కు ప్రకారం నడుచుకొంటున్నాను.
68 ✝నీవు మంచివాడివి. మేలు చేస్తున్నావు.
నీ చట్టాలు నాకు నేర్పు.
69 ✽ గర్విష్ఠులు నా విషయం అబద్ధం కల్పించారు.
అయితే, హృదయపూర్వకంగా నేను నీ
ఆదేశాలను పాటిస్తాను.
70 ✽ వాళ్ళ గుండె కొవ్వెత్తి మందగించింది.
నేను నీ ఉపదేశాన్ని బట్టి ఆనందిస్తున్నాను.
71 ✽ బాధలు అనుభవించడం నాకు మేలైనది
దానివల్ల నేను నీ చట్టాలు నేర్చుకొన్నాను.
72 ✽ వేలకొలది వెండి నాణేలు, బంగారు నాణేలకంటే
నీ నోటి ఉపదేశం నాకు శ్రేష్ఠం.
యోద్
73 నీ చేతులతో నన్ను చేశావు, రూపొందించావు✽.
నీ ఆజ్ఞలను నేర్చుకొనేలా నాకు గ్రహింపు✽
ప్రసాదించు.
74 ✽ నీ వాక్కుకోసం ఆశతో ఎదురు చూశాను.
నీవంటే భయభక్తులు గలవారు నన్ను చూచి
సంతోషిస్తారు.
75 ✽యెహోవా, నీ నిర్ణయాలు న్యాయ సమ్మతమైనవని
నాకు తెలుసు.
నీ విశ్వసనీయతను అనుసరించి నన్ను
బాధపెట్టావని తెలుసు.
76 ✽నీ సేవకుడైన నాకు ఇచ్చిన మాటప్రకారం
నీ అనుగ్రహం నన్ను ఆదరిస్తుంది గాక!
77 ✽నీ ఉపదేశం నాకు ఆనందదాయకం.
నేను బ్రతికేలా నీ వాత్సల్యం నా మీదికి
వస్తుంది గాక!
78 ✽నేను నీ నియమాలను ధ్యానం చేసుకుంటాను.
గర్విష్ఠులు అబద్ధం కల్పించి నాకు కీడు చేశారు.
వాళ్ళకు సిగ్గు కలుగుతుంది గాక!
79 ✽నీవంటే భయభక్తులు గలవారు, నీ శాసనాలు
తెలిసినవారు నా వైపుకు వస్తారు గాక!
80 నేను సిగ్గు✽పడవలసిన అవసరం ఉండకుండేలా
నా హృదయం నీ ఆదేశాల విషయంలో
నిర్దోషంగా✽ ఉంటుంది గాక!
కఫ్
81 ✽నీవు చేసే విడుదలకోసం నా ప్రాణం
ఆశతో నీరసించిపోతూ ఉంది✽.
నీ వాక్కుమీదే ఆశ✽ పెట్టుకొన్నాను.
82 ✝నన్ను నీవెప్పుడు ఆదరిస్తావో అని
నీ వాగ్దానాలకోసం ఎదురు చూస్తూ
నా కండ్లు చీకి చివికిపొయ్యాయి.
83 ✽పొగలో వ్రేలాడుతున్న ద్రాక్షతిత్తిలాగా ఉన్నాను.
అయినా, నీ చట్టాలను నేను మరిచిపోవడం లేదు✽.
84 ✝నీ సేవకుడైన నేను ఎన్నాళ్లు బ్రతుకుతాను?
నన్ను హింసించేవాళ్ళకు ఎప్పుడు శిక్ష విధిస్తావు?
85 ✽ నీ ధర్మశాస్త్రానికి లోబడని గర్విష్ఠులు
నన్ను చేజిక్కించుకోవడానికి
గుంటలు తవ్వారు.
86 వారు నిష్కారణంగా నన్ను హింసిస్తారు.
నీ ఆజ్ఞలన్నీ నమ్మతగ్గవి✽. నాకు సహాయం చెయ్యి.
87 ✽ నన్ను భూమిమీద లేకుండా
చేయబూనుకొన్నారు వారు.
అపాయం కొంచెంలో తప్పిపోయింది.
అయినా నీ ఆదేశాలను నేను విసర్జించలేదు.
88 ✽నీ నోటి పలుకులు నేను పాటించేలా
నీ అనుగ్రహంతో నన్ను బ్రతికించు.
లామెద్
89 ✽ యెహోవా, శాశ్వతంగా నీ వాక్కు పరలోకంలో
సుస్థిరంగా నిలిచి ఉంటుంది.
90 ✽ నీ విశ్వసనీయత తరతరాలకూ నిలిచి ఉంటుంది.
నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది.
91 సమస్తమూ✽ నీకు సేవ చేస్తూ ఉంది.
నీ నిర్ణయాల✽ ప్రకారమే అవి ఈ రోజువరకు
స్థిరంగా ఉండిపోయాయి.
92 ✽నీ ఉపదేశమే గనుక నాకు ఆనందదాయకం
కానిపక్షంలో నేను నా బాధల్లో
నాశనమైపోయి ఉండేవాణ్ణే.
93 ✽నీ ఆదేశాలవల్ల నీవు నన్ను బ్రతికించావు గనుక
వాటిని నేనెన్నటికీ మరవను.
94 ✽నీ ఆదేశాలను నేను వెదికాను.
నేను నీ వాణ్ణే. నన్ను రక్షించు.
95 ✽నన్ను రూపుమాపడానికి దుర్మార్గులు
నా కోసం కాచుకొని ఉన్నారు.
అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటాను.
96 ✽పూర్తి అయిన ప్రతిదానికీ పరిమితి ఉందని
నేను గ్రహించాను.
నీ ఉపదేశం అపారమైనది.
మేమ్
97 ✽నీ ఉపదేశం నాకెంతో ప్రియం.
రోజంతా నేను దానినే ధ్యానిస్తాను✽.
98 ✽ నీ ఆజ్ఞలు ఎల్లప్పుడూ నాకు తోడు.
అవి నాకు కలిగించే జ్ఞానం నా శత్రువులకు
మించినది.
99 నీ శాసనాలు నేను ధ్యానించుకొంటున్నాను.
కాబట్టి వివేకంలో నేను నా గురువులందరినీ
కూడా మించిపోయాను.
100 నీ ఆదేశాలను నేను ఆచరించాను.
అందుచేత నాకు లభించిన తెలివితేటలు
వృద్ధులకు మించినది.
101 ✽నేను నీ వాక్కు ప్రకారం నడుచుకుందామని
ప్రతి చెడ్డ మార్గంనుంచీ నేను వైదొలగాను.
102 ✽నీవు నాకు జ్ఞానోపదేశం చేశావు.
అందుచేత న్యాయ నిర్ణయాలనుంచి నేను
తొలగిపోలేదు.
103 ✝నీ వాక్కులు నా నోటికి ఎంతో మధురంగా
ఉన్నాయి.
అవి నాకు తేనెకంటే తీపి అనిపిస్తున్నాయి.
104 ✽ నీ ఆదేశాలవల్ల నాకు గ్రహింపు కలుగుతుంది.
కనుక అన్ని తప్పు మార్గాలంటే నాకు అసహ్యం.
నూన్
105 ✽నీ వాక్కు నా పాదాలకు దీపం✽,
నా త్రోవకు కాంతి✽.
106 ✝నీ న్యాయ నిర్ణయాల ప్రకారం బ్రతుకుతానని
నేను శపథం చేసుకొన్నాను.
నా మాట నిలబెట్టుకుంటాను.
107 ✽యెహోవా, నాది ఎంత బాధ!
నీ వాక్కు ప్రకారం నన్ను బ్రతికించు.
108 యెహోవా, నా నోటి మీదుగా మనసారా
నేను అర్పించేది✽ స్వీకరించు.
నీ న్యాయ నిర్ణయాలను నాకు నేర్పు✽.
109 ✝నా ప్రాణం ఎడతెరపి లేకుండా
అపాయంలో ఉంది.
అయినా, నీ ఉపదేశాన్ని నేను
మరిచిపోవడం లేదు.
110 ✽నన్ను చేజిక్కించుకోవాలని దుర్మార్గులు
ఉచ్చులు వేశారు.
అయినా, నీ ఆదేశాలనుంచి నేను వైదొలగలేదు.
111 ✽నీ శాసనాలు నా హృదయానికి ఆనందం
కలిగిస్తాయి.
అవి నాకు శాశ్వత వారసత్వంగా లభించాయి.
112 ✽ అంతంవరకూ, ఎప్పటికీ నీ చట్టాల
ప్రకారం ప్రవర్తించడానికి నా హృదయాన్ని
నేను అదుపులో ఉంచుకొన్నాను.
సామెఖ్
113 ✽ చపలచిత్తులంటే నాకు అసహ్యం.
నీ ఉపదేశం అంటే నాకు ప్రీతి.
114 నేను దాగుకొనే చోటు నీవే.
నీవు నాకు డాలు✽లాంటివాడివి.
నాకు నీ వాక్కుమీద ఆశాభావం✽ ఉంది.
115 ✽ నేను నా దేవుని ఆజ్ఞలను శిరసావహిస్తాను.
చెడుగు చేసేవాళ్ళారా, నా దగ్గరనుంచి పోండి!
116 ✝నేను బ్రతికేలా నీ వాక్కు ప్రకారం నన్ను ఆదుకో.
నా ఆశాభావం విషయంలో నాకు సిగ్గు
కలగనియ్యకు.
117 నన్ను పైకెత్తు. అప్పుడు నేను సురక్షితంగా
ఉంటాను,
నీ చట్టాలను ఎల్లప్పుడూ పాటిస్తాను.
118 ✽నీ చట్టాల విషయంలో తప్పిపోయినవాళ్ళందరినీ
అల్పులుగా ఎంచుతావు.
వాళ్ళ కపటం పనికి రాదు.
119 ✽ దుర్మార్గులందరినీ భూమిమీద లేకుండా
మురికి చెత్తలా నాశనం చేసేవాడివి నీవు.
కనుక నీ శాసనాలంటే నాకు ప్రీతి.
120 ✽నీ భయంవల్ల నా శరీరం గజగజలాడుతూ వుంది.
నీ న్యాయ నిర్ణయాలంటే నాకు భయభక్తులే.
అయిన్
121 ✽ నీతిన్యాయాలను నేను అనుసరిస్తున్నాను.
నన్ను బాధించేవాళ్ళ చేతుల్లో నన్ను విడిచిపెట్టకు.
122 నీ సేవకుడైన నాకు మేలు చేస్తావని
నాకు హామీగా ఉండు.
గర్విష్ఠులను నాకు బాధ కలిగించనియ్యకు.
123 ✽నీ రక్షణ కోసం నీ న్యాయ వాక్కుకోసం
కనిపెట్టి, కనిపెట్టి,
నా కండ్లు చీకిపోయాయి.
124 నీ సేవకుడైన నా పట్ల అనుగ్రహంతో
వ్యవహరించు✽.
నీ చట్టాలను నాకు నేర్పు✽.
125 ✽నేను నీ సేవకుణ్ణి.
నీ శాసనాలను తెలుసుకొనేందుకు నాకు జ్ఞానం
ప్రసాదించు.
126 ✽ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారు.
యెహోవా న్యాయం జరిగించడానికి ఇదే అదను.
127 ✽బంగారం కంటే, మేలిమి బంగారం కంటే
నీ ఆజ్ఞలు నాకు ప్రియం.
128 నీ ఆదేశాలన్నీ కేవలం యథార్థమని✽
భావించుకుంటున్నాను.
తప్పు మార్గాలన్నీ✽ నాకు అసహ్యం.
పే
129 ✽ నీ శాసనాలు ఆశ్చర్యకరమైనవి.
అందుకే నేను మనసారా వాటిని ఆచరిస్తాను.
130 ✽నీ వాక్కులు ప్రవేశించడంతోనే వెలుగు వస్తుంది.
అవి తెలివితక్కువ వారికి తెలివితేటలు కలిగిస్తాయి.
131 ✽ నీ ఆజ్ఞలమీద నాకు ఎంతో ఆశ ఉంది.
ఆ ఆశచేత నేను నోరు తెరచి రొప్పుతూ ఉన్నాను.
132 ✽ నీ పేరంటే ఎవరికి ప్రేమో,
వారిని నీవు దయ చూచినట్టు,
నా వైపు తిరిగి, నన్ను దయ చూడు.
133 ✽నీ వాక్కుకు అనుగుణంగా నా నడతను
స్థిరం చెయ్యి.
ఏ చెడుగూ నా మీద పెత్తనం చేయకుండా చూడు.
134 ✽ నీ ఆదేశాలను నేను ఆచరించేందుకు
మనుషుల దౌర్జన్యం నుంచి నన్ను తప్పించు.
135 నీ ముఖ కాంతి నీ సేవకుడైన నా మీద
ప్రకాశించేలా✽ చెయ్యి.
నీ చట్టాలను నాకు నేర్పు✽.
136 ✽ప్రజలు నీ ఉపదేశానికి లోబడడం లేదు.
అందుచేత నా కన్నీళ్ళు కాలువలై పారుతున్నాయి.
త్సాదె
137 ✽యెహోవా, నీవు న్యాయవంతుడివి.
నీ నిర్ణయాలు యథార్థం.
138 న్యాయాన్నీ, సమగ్ర విశ్వసనీయత✽నూ అనుసరించి
నీ శాసనాలు✽ ఆజ్ఞపూర్వకంగా ఇచ్చావు.
139 ✽ నా విరోధులు నీ వాక్కులు మరిచిపోయారు.
కాబట్టి ఆసక్తి నన్ను తినివేస్తూ ఉంది.
140 నీ వాక్కు మహా పవిత్రం✽.
అది నీ సేవకుడైన నాకు ప్రియం.
141 నేను అల్పుణ్ణి✽. తృణీకారానికి గురి అయినవాణ్ణి.
అయినా నీ ఆదేశాలను నేను
మరిచిపొయ్యే✽ వాణ్ణి కాను.
142 ✽నీ న్యాయం శాశ్వతమైనది.
నీ ఉపదేశం కేవలం సత్యం.
143 ✽బాధ, వేదన నాకు పట్టుకున్నాయి.
అయినా నీ ఆజ్ఞలు నాకు అనందదాయకమైనవి.
144 ✽ నీ శాసనాలలోని న్యాయం ఎప్పటికీ
నిలిచి ఉంటుంది.
నేను బ్రతికేలా నాకు తెలివితేటలు ప్రసాదించు.
ఖోఫ్
145 ✽యెహోవా! హృదయపూర్వకంగా నేను
ప్రార్థన చేస్తున్నాను.
నాకు జవాబివ్వు. నీ చట్టాలను నేను పాటిస్తాను.
146 ✽నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.
నన్ను కాపాడు. నీ శాసనాలు నేను పాటిస్తాను.
147 ✽ పొద్దు పొడిచేముందే సహాయం కోసం
మొరపెట్టేవాణ్ణి.
నీ వాక్కంటే నాకు ఆశాభావం.
148 ✽ నీవిచ్చిన వాక్కును ధ్యానించుకోవడానికి
రాత్రి జాములు కాకముందే నా కండ్లు
తెరచి పెట్టుకొని ఉంటాను.
149 ✽నీ అనుగ్రహం ప్రకారం నా మొర ఆలకించు.
యెహోవా! నీ న్యాయ నిర్ణయాల ప్రకారం
నన్ను బ్రతికించు.
150 ✽ఆతురంగా చెడుగు చేసేవాళ్ళు నాకు
దగ్గరగా ఉన్నారు.
వాళ్ళు నీ ఉపదేశానికి దూరంగా ఉన్నారు.
151 ✽యెహోవా! నీవు నా దగ్గర ఉన్నావు.
నీ ఆజ్ఞలన్నీ సత్యం.
152 ✽నీ శాసనాలు ఎల్లకాలం నిలిచి ఉండేలా
వాటిని సుస్థిరం చేశావు.
చాలాకాలం నుంచి వాటివల్లే ఇది తెలుసుకొన్నాను.
రేష్
153 ✽నేను నీ ఉపదేశాన్ని మరచే మనిషిని కాను.
నా బాధను విచారించి నన్ను విడిపించు.
154 ✝నా పక్షాన వాదించి నాకు విడుదల కలిగించు.
నీ వాక్కు ప్రకారం నన్ను బ్రతికించు.
155 ✽దుర్మార్గులు నీ చట్టాలు తెలుసుకోవడానికి
ప్రయత్నించరు.
కనుక వాళ్ళకు రక్షణ ఎంతో దూరం.
156 యెహోవా! నీ వాత్సల్యత✽ అపారం.
నీ న్యాయ నిర్ణయాల ప్రకారం నన్ను బ్రతికించు✽.
157 ✽నన్ను హింసించేవాళ్ళు,
నా మీద పగపట్టినవాళ్ళు చాలామంది.
అయినా నీ శాసనాల నుంచి నేను
వైదొలగడం లేదు.
158 ✝ద్రోహం తలపెట్టేవాళ్ళు నాకు కనిపిస్తున్నారు.
వాళ్ళు నీ వాక్కు పాటించరు గనుక వాళ్ళంటే
నాకు అసహ్యం.
159 ✽యెహోవా! నీ ఆదేశాలు నాకెంత
అప్యాయమో చూడు.
నీ అనుగ్రహం ప్రకారం నన్ను బ్రతికించు.
160 ✽నీ వాక్కుల మొత్తం సత్యమే.
నీ న్యాయ నిర్ణయాలన్నీ ఎల్లకాలం నిలుస్తాయి.
షీన్
161 అధికారులు నిష్కారణంగా నన్ను హింసించారు✽.
అయినా నా హృదయంలో నీ వాక్కులంటే
భయభక్తులు✽ ఉన్నాయి.
162 ✽ఎంతో సొమ్ము కొల్లగొట్టుకు వచ్చిన వాడిలాగా
నీ వాక్కును బట్టి నేను సంతోషిస్తున్నాను.
163 ✽ అబద్ధం అంటే నాకు అసహ్యం.
అదంటే నాకు రోత.
నీ ఉపదేశం నాకెంతో ప్రీతి.
164 ✽నీ న్యాయ నిర్ణయాలను బట్టి రోజుకు
ఏడు సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను.
165 ✽ నీ ఉపదేశాన్ని ప్రేమించేవారికి ఎంతో శాంతి.
వారు తడబడేలా చేసేదేమీ ఉండదు.
166 ✽ యెహోవా! నీ రక్షణ కోసం నేను ఆశతో
ఎదురు చూస్తున్నాను.
నీ ఆజ్ఞలను శిరసావహిస్తున్నాను.
167 నీ శాసనాల ప్రకారమే నేను ప్రవర్తిస్తున్నాను.
అవి నాకెంతో ప్రీతి.
168 నా విధానాలన్నీ నీ ఎదుటే ఉన్నాయి.
కనుక నీ ఆదేశాలను,
నీ శాసనాలను అనుసరిస్తున్నాను.
తావ్
169 ✽యెహోవా! నా స్వరం నీ సన్నిధానంలో
వినబడుతుంది గాక!
నీ వాక్కు మేరకు నాకు జ్ఞానం ప్రసాదించు.
170 ✝నా విన్నపం నీ సన్నిధానంలోకి చేరేలా చెయ్యి.
నీ వాగ్దానం ప్రకారం నాకు విడుదల ప్రసాదించు.
171 ✽నీవు నీ చట్టాలను నాకు నేర్పుతున్నావు.
నా పెదవులు నీ కీర్తిని పలుకుతాయి.
172 ✽నీ ఆజ్ఞలు న్యాయసమ్మతమైనవి.
నీ వాక్కు విషయం నా నాలుక గానం చేస్తుంది.
173 నేను నీ ఆదేశాలు కావాలని కోరాను✽.
నీ చెయ్యి నాకు సహాయం✽ చేస్తుంది గాక!
174 ✽యెహోవా! నీ రక్షణ కోసం
తహతహలాడుతున్నాను.
నీ ఉపదేశం నాకెంతో ఆనందదాయకం.
175 ✽నేను నిన్ను స్తుతించేలా నన్ను బ్రతికించు.
నీ న్యాయ నిర్ణయాలు నాకు సహాయం
చేస్తాయి గాక!
176 ✽తప్పిపోయిన గొర్రెలాగా నేను దారి తొలగాను.
నీ సేవకుడైన నన్ను వెదుకు!
నేను నీ ఆజ్ఞలను మరచేవాణ్ణి కాను.