118
1 ✽యెహోవా మంచివాడు, ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.ఆయనకు కృతజ్ఞతలు✽ చెప్పుకోండి.
2 “ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది”
అంటూ ఇస్రాయేల్‌ప్రజ చెప్పుకోవాలి.
3 “ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది”
అంటూ అహరోను వంశీకులు చెప్పుకోవాలి.
4 “ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది”
అంటూ యెహోవాపట్ల భయభక్తులు గలవారంతా
చెప్పుకోవాలి.
5 ✽ ఇరుకులో ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను.
యెహోవా నాకు జవాబిచ్చి నన్ను విశాల
స్థలంలో ఉంచాడు.
6 ✽ యెహోవా నా పక్షాన ఉన్నాడు.
నాకు భయం ఉండదు.
మనుష్యమాత్రులు నాకేమి చేయగలరు?
7 యెహోవా నా పక్షాన ఉండి నాకు సహాయం
చేస్తున్నాడు.
అందుచేత నా పగవాళ్ళ విషయంలో
నేను కోరినదే జరగడం చూస్తాను.
8 ✽మనుషుల మీద నమ్మకం పెట్టడం కంటే
యెహోవాను నమ్మి ఆశ్రయించడం మంచిది.
9 రాజులమీద నమ్మకం పెట్టడంకంటే
యెహోవాను నమ్మి ఆశ్రయించడం మంచిది.
10 ✽ ఇతర జనాలన్నీ నన్ను చుట్టుముట్టినా,
యెహోవా పేర నేను వాళ్ళను నాశనం చేస్తాను.
11 నలువైపుల నుంచీ వాళ్ళు నన్ను చుట్టుముట్టినా సరే
యెహోవా పేర వాళ్ళను నాశనం చేస్తాను.
12 కందిరీగల్లాగా నా చుట్టూరా వాళ్ళు
ముసురుకొన్నా సరే ముండ్లకంప
మంటలాగా తృటిలో ఆరిపోతారు.
యెహోవా పేర నేను వాళ్ళను నాశనం చేస్తాను.
13 ✽నన్ను బలంగా గెంటివేయడం జరిగింది.
నేను పడిపోయి ఉండవలసిందే గానీ
యెహోవా నాకు సహాయం చేశాడు.
14 ✝యెహోవా నా బలం, నా గానం.
ఆయనే నాకు రక్షణ అయ్యాడు.
15 ✽న్యాయవంతుల నివాసాలలో ఆనందభరితమైన
విజయ ధ్వనులు వినబడుతాయి.
యెహోవా కుడిచేయి పరాక్రమ క్రియలు సాధిస్తుంది.
16 ✽యెహోవా కుడి చెయ్యి పైన ఉంటుంది.
యెహోవా కుడిచెయ్యి పరాక్రమ క్రియలు సాధిస్తుంది.
17 ✝నేను చావను. నేను బ్రతికి ఉంటాను,
యెహోవా క్రియలు ప్రకటిస్తాను.
18 ✽యెహోవా నన్ను ఎంతో కఠినమైన
క్రమశిక్షణకు గురి చేశాడు.
కానీ ఆయన నన్ను చావుకు అప్పగించలేదు.
19 ✽నీతిన్యాయాల ద్వారాలు✽ తెరవండి.
నేను వాటిగుండా లోపల ప్రవేశిస్తాను,
యెహోవాకు కృతజ్ఞతలు అర్పిస్తాను.
20 ఇది యెహోవా గుమ్మం.
న్యాయవంతులు దీనిద్వారా ప్రవేశిస్తారు.
21 ✽నీవు నాకు జవాబిచ్చావు,
నీవు నాకు రక్షణ అయ్యావు.
గనుక నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను.
22 ✽కట్టేవాళ్ళు తీసి పారవేసిన రాయే
ముఖ్యమైన మూలరాయి అయింది.
23 ఇది యెహోవా మూలంగా జరిగింది.
ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.
24 ✽ఇది యెహోవా నెలకొల్పిన రోజు.
ఈ రోజు మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం.
25 ✽యెహోవా! మమ్మల్ని రక్షించు.
ఇదే నా విన్నపం.
యెహోవా! మాకు వృద్ధి దయ చెయ్యి.
26 ✽ యెహోవా పేరట వచ్చేవాడు ధన్యజీవి.
యెహోవా ఆలయం నుంచి మిమ్మల్ని దీవిస్తాం.
27 ✽యెహోవాయే దేవుడు.
ఆయన మనకు వెలుగు ప్రసాదించాడు.
మహోత్సవ బలి పశువును తాళ్ళతో బలిపీఠం
కొమ్ములకు కట్టండి.
28 ✽ నీవే నా దేవుడివి.
నీకే కృతజ్ఞతలు అర్పిస్తాను.
నీవే నా దేవుడివి. నిన్నే ఘనపరుస్తాను.
29 ✽యెహోవా మంచివాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోండి.