116
1 యెహోవా నా మొర, నా విన్నపం ఆలకించాడు.
అందుచేత నేనాయనను ప్రేమిస్తున్నాను.
2 ఆయన నా ఆక్రందన చెవిని పెట్టాడు.
కాబట్టి నేను బ్రతికినన్నాళ్ళు ఆయనకు
ప్రార్థన చేస్తాను.
3 మరణ బంధకాలు నన్ను చుట్టివేశాయి.
మృత్యులోక వేదనలు నన్ను పట్టుకొన్నాయి.
బాధ, శోకం నేను అనుభవించాను.
4 అప్పుడు యెహోవా పేర నేను ప్రాధేయపడ్డాను.
“ఓ యెహోవా! నన్ను రక్షించు” అన్నాను.
5 యెహోవా దయగలవాడు, న్యాయశీలి.
మన దేవుడు కరుణామయుడు.
6 యెహోవా అమాయకులను కాపాడుతాడు.
నేను దుర్దశకు దిగజారిపోయి ఉండగా ఆయన
నన్ను రక్షించాడు.
7 నా ప్రాణమా, యెహోవా నీకు మేలు చేశాడు
గనుక నీ విశ్రాంతిలో ప్రవేశించు.
8 దేవా, నీవు నా ప్రాణాన్ని మరణంనుంచి
తప్పించావు.
నా కండ్లను కన్నీటినుంచి విడిపించావు.
నా పాదాలను జారిపడకుండా కాపాడావు.
9 సజీవుల దేశంలో నేను యెహోవా ఎదుట
నడుస్తాను.
10  నేను నమ్ముకొన్నాను గనుక మాట్లాడుతాను.
నాకు ఎంతో బాధ కలిగింది.
11 కంగారుపడిపోయి నేను అనుకొన్నాను,
“మనుషులంతా అబద్ధికులు.”
12 యెహోవా నాకు చేకూర్చిన ప్రయోజనాలకు
నేను ఆయనకు ఏం ఇవ్వగలను?
13 రక్షణ పాత్ర చేతపట్టుకుంటాను,
యెహోవా పేర ప్రార్థన చేస్తాను.
14 యెహోవాకు నా మొక్కుబళ్ళను అర్పించుకొంటాను.
ఆయన ప్రజలందరి సమక్షంలో అర్పించుకొంటాను.
15 తన భక్తులు చనిపోయారంటే అది యెహోవా
దృష్టిలో విలువైన సంగతి.
16 ఓ యెహోవా! నేను నీ దాసుణ్ణి గదా.
నీ దాసుణ్ణి, నీ చరణదాసి కొడుకును.
నీవు నా బంధకాలు విప్పావు.
17 నేను కృతజ్ఞతార్పణ నీకు అర్పిస్తాను.
యెహోవా పేర ప్రార్థన చేస్తాను.
18 యెహోవాకు నా మొక్కుబళ్ళు అర్పించుకుంటాను.
ఆయన ప్రజలందరి సమక్షంలో అర్పించుకుంటాను.
19 జెరుసలెమా! నీ మధ్య,
యెహోవా ఆలయ ఆవరణంలో
వాటిని అర్పించుకుంటాను.
యెహోవాను స్తుతించండి!