115
1 యెహోవా, నీ అనుగ్రహాన్ని బట్టీ సత్యాన్ని బట్టీ
నీ పేరుకే ఘనత చేకూరాలి.
మాకు కాదు. మాకు కానేకాదు.
2  “ఏడీ, వాళ్ళ దేవుడు ఎక్కడున్నాడు?”
అంటూ ఇతర ప్రజలు
ఎందుకు చెప్పుకుంటున్నట్టు?
3 మన దేవుడు పరలోకంలో ఉన్నాడు.
తనకు ఏది ఇష్టమో అది చేసేవాడు.
4  వాళ్ళ దేవుళ్ళు వెండి బంగారు విగ్రహాలు,
మనుషులు చేతులతో చేసినవి.
5 వాటికి నోరుంది కాని, మాట్లాడలేవు.
కండ్లున్నాయి కాని, చూడలేవు.
6 చెవులున్నాయి కాని, వినలేవు.
ముక్కులున్నాయి కాని, వాసన చూడలేవు.
7 చేతులున్నాయి కాని, తాకి చూడలేవు.
పాదాలున్నాయి కాని, నడవలేవు.
గొంతు ఉన్నా, పలకలేవు.
8 విగ్రహాలు తయారు చేసే వాళ్ళు,
వాటిమీద నమ్మకం ఉంచేవాళ్ళంతా వాటిలాగే
అవుతారు.
9 ఇస్రాయేల్‌ప్రజలారా! యెహోవా మీద
నమ్మకం ఉంచండి.
ఆయనే అలాంటివారికి సహాయం, డాలులాంటివాడు.
10 అహరోను వంశమా!
యెహోవా మీద నమ్మకం ఉంచండి.
ఆయనే అలాంటి వారికి సహాయం, డాలులాంటివాడు.
11 యెహోవా అంటే భయభక్తులున్న వారలారా!
యెహోవా మీద నమ్మకం ఉంచండి.
ఆయనే అలాంటివారికి సహాయం, డాలులాంటివాడు.
12 యెహోవాకు మనం జ్ఞాపకమే.
ఆయన మనలను దీవిస్తాడు.
ఆయన ఇస్రాయేల్‌వంశాన్ని దీవిస్తాడు.
ఆయన అహరోను వంశాన్ని దీవిస్తాడు.
13 యెహోవా అంటే భయభక్తులున్న వారిని
చిన్నవారినీ పెద్దవారినీ ఆయన దీవిస్తాడు.
14 యెహోవా మీకూ, మీ పిల్లలకూ వృద్ధి
కలిగిస్తాడు గాక!
15  ఆకాశాన్నీ, భూమినీ సృజించిన యెహోవా
మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక!
16 ఆకాశాలన్నీ యెహోవాకు చెందినవి.
భూమిని ఆయన మనుషులకిచ్చాడు.
17 యెహోవాను స్తుతించవలసినది చనిపోయినవారు
కాదు,
మౌన లోకంలోకి దిగిపోయేవారిలో ఎవరో కాదు.
18 మనమే యెహోవా సంకీర్తనం చేయాలి.
ఇప్పటినుంచి ఎప్పటికీ మనం యెహోవా స్తుతి
చేస్తూ ఉంటాం.
యెహోవాను స్తుతించండి!