113
1 ✽యెహోవాను స్తుతించండి!యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి.
యెహోవా పేరును స్తుతించండి!
2 ✽ఇప్పటినుంచి ఎప్పటెప్పటికీ యెహోవా పేరును
కీర్తించడం జరుగుతుంది గాక!
3 ✽పొద్దు పొడిచినది మొదలుకొని క్రుంకే స్థలం వరకు
యెహోవా పేరును స్తుతించడం యోగ్యం.
4 ✽యెహోవా జనాలన్నిటికీ ఎంతో అతీతంగా ఉన్నాడు.
ఆయన మహత్వం ఆకాశాలకు పైగా ఉంది.
5 మన దేవుడైన యెహోవాకు ఎవరు సాటి?
ఆయన ఉన్నత స్థానంలో సింహాసనాసీనుడు.
6 ఆయన ఆకాశాలనూ భూమినీ వంగి చూస్తున్నాడు.
7 ✽నేలమట్టినుంచి బీదలను పైకెత్తుతాడాయన.
బూడిద కుప్పమీదనుంచి అక్కరగలవారిని
లేవనెత్తుతాడు.
8 వారిని అధిపతులలో తన ప్రజానాయకులలో
సమానంగా పైన కూర్చోబెడతాడు.
9 ✽ఇంట్లో ఉన్న గొడ్రాలికి సంతానం ప్రసాదించి,
ఆమెను ఆనందించే తల్లిగా చేస్తాడు.
యెహోవాను స్తుతించండి!