112
1 యెహోవాను స్తుతించండి!
యెహోవా అంటే భయభక్తులు గలవారు
ధన్యజీవులు.
ఆయన ఆజ్ఞలంటే చాలా ఇష్టం ఉన్నవారు
ధన్యజీవులు.
2 అలాంటివారి సంతానం భూమిమీద
బలాఢ్యులవుతారు.
నిజాయితీ గల తరానికి దీవెనలు కలుగుతాయి.
3 ధనం, ఐశ్వర్యం వారి ఇంట్లో ఉంటాయి.
వారి నిర్దోషత్వం శాశ్వతంగా నిలుస్తుంది.
4 నిజాయితీపరులకు చీకట్లో వెలుగు
ఉదయిస్తుంది.
వారు దయ, కనికరం గలవారు, న్యాయంగా
ప్రవర్తిస్తారు.
5  దయ కలిగి అప్పిచ్చేవారు ధన్యజీవులు.
తీర్పులో వారి వాదమే నెగ్గుతుంది.
6 అలాంటివారిని ఏదీ ఎన్నడూ కదల్చదు.
న్యాయవంతులు శాశ్వతంగా జ్ఞాపకంలో
ఉంటారు.
7  దుర్వార్తలకు వారేమి భయపడరు.
వారి హృదయం యెహోవామీద నమ్మకం ఉంచి
సుస్థిరమై ఉంటుంది.
8 వారి హృదయం యెహోవామీద
ఆధారపడుతుంది.
తమ శత్రువులపట్ల వారి కోరిక నెరవేరేవరకు
వారు నిర్భయంగా ఉంటారు.
9 అక్కరలో ఉన్నవారికి ధారాళంగా ఇస్తారు.
వారి నిర్దోషత్వం శాశ్వతంగా నిలుస్తుంది.
వారి కొమ్ము గౌరవప్రదంగా పైకి వస్తుంది.
10 దుర్మార్గులు అది చూచి విసుక్కొంటారు.
పండ్లు కొరుక్కొంటారు.
వాళ్ళు హరించుకుపోతారు.
దుర్మార్గుల కోరిక అంతరించిపోతుంది.