111
1 యెహోవాను స్తుతించండి!
నిజాయితీపరుల సభలో, సమాజంలో నేను
హృదయపూర్వకంగా యెహోవాకు కృతజ్ఞతలు చెప్పుకొంటాను.
2  యెహోవా చేసే పనులు గొప్పవి.
అవంటే ఇష్టమున్నవారంతా వాటిని
గ్రహించడానికి ప్రయత్నిస్తారు.
3 ఆయన క్రియ ఘనమైనది, దివ్యమైనది.
ఆయన న్యాయం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
4 తాను చేసిన అద్భుతాలు మనుషుల జ్ఞాపకంలో
ఉండేలా చేశాడాయన.
ఆయన దయామయుడు, వాత్సల్యమూర్తి.
5 తనమీద భయభక్తులు గలవారికి ఆహారం
పెడతాడు.
ఎల్లప్పుడూ తన ఒడంబడికను జ్ఞాపకం
ఉంచుకొంటాడు.
6 తన ప్రజలకు ఇతర జనాల వారసత్వాన్ని
అనుగ్రహించాడు.
తద్వారా తన క్రియలలోని బలప్రభావాలను
వారికి వెల్లడి చేశాడు.
7 ఆయన స్వయంగా చేసిన పనులన్నీ
సత్యం, సవ్యం.
ఆయన నియమాలన్నీ నమ్మకమైనవి.
8 అవి నిరంతరమూ సుస్థిరంగా ఉంటాయి.
సత్యంతో, నిజాయితీతో నియమించబడినవి అవి.
9 తన ప్రజలకు విడుదల ప్రసాదించాడాయన.
తన ఒడంబడికను శాశ్వతంగా నిలిచి ఉండాలని
నిర్ణయించాడు.
ఆయన పేరు పవిత్రం, భయభక్తులు గొలిపేది.
10  యెహోవా మీది భయభక్తులు జ్ఞానానికి ఆరంభం.
ఆయన నియమాల ప్రకారం ప్రవర్తించేవారందరూ
మంచి తెలివితేటలు గలవారు.
ఆయన గురించిన సంస్తుతి ఎప్పటికీ ఉంటుంది.