దావీదు కీర్తన
110
1 యెహోవా నా ప్రభువుతో పలికిన వాక్కు:
“నీ శత్రువులను నీ పాదాల క్రింద పీటగా నేను
చేసేవరకూ నా కుడి ప్రక్కన కూర్చుని ఉండు.”
2 యెహోవా సీయోను నుంచి నీ రాజదండాన్ని
పొడిగిస్తాడు.
“నీ శత్రువుల మధ్య ప్రభుత్వం చెయ్యి”
అంటాడు.
3 నీవు నీ బలపరాక్రమాలను కనుపరచే రోజుల్లో
నీ ప్రజలు మనసారా ముందుకు వస్తారు.
నీ యువకులు పవిత్ర వస్త్రాలు ధరించి,
నీకు ఉదయ గర్భంలో నుంచి కలిగే
మంచు బిందువుల్లాగా ఉంటారు.
4 యెహోవా ప్రమాణం చేశాడు.
దీని గురించి ఆయనేమీ పశ్చాత్తాపపడడు.
“నీవు మెల్కీసెదెకు వరుస ప్రకారం సదాకాలం
యాజివి” అన్నాడు.
5 ప్రభువు నీ కుడి ప్రక్కన ఉన్నాడు.
తన ఆగ్రహ దినంలో ఆయన రాజులను
చితగ్గొట్టివేస్తాడు.
6 లోక ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు.
శవాలు అంతటా ఉండేలా చేస్తాడు.
విశాల లోకం అధిపతిని చితగ్గొట్టివేస్తాడు.
7 దారిలో వాగు నీళ్ళు తాగుతాడాయన.
అందుచేత ఆయన తల పైకెత్తుకొంటాడు.