గాయకుల నాయకుడికి. దావీదు కీర్తన.
109
1 ✽నా స్తుతికి పాత్రుడవైన దేవా!మౌనం వహించకు.
2 ✽నాకు వ్యతిరేకంగా దుర్మార్గులూ,
వంచకులూ నోరు తెరిచారు.
నా గురించి అబద్ధాలు చెప్పుకొంటున్నారు.
3 నన్ను చుట్టుముట్టి, మాటల్లో నా మీద
విద్వేషం వెళ్ళబోసుకుంటున్నారు.
నిష్కారణంగా నాతో పోరాడుతున్నారు.
4 నేను చూపిన స్నేహానికి ప్రతిఫలంగా
నా మీద పగపట్టారు✽.
నేనేమో ప్రార్థన✽ చేస్తూనే ఉన్నాను.
5 ✝నేను చేసిన మేలుకు వాళ్ళు కీడే చేస్తున్నారు.
నేను చూపిన స్నేహానికి వాళ్ళు చూపేది
విద్వేషమే.
6 ✽అతడిమీద దుర్మార్గుణ్ణి అధికారిగా
నియమించు!
నేరం మోపే శత్రువు అతడి కుడి
ప్రక్కనే నిలుస్తాడు గాక!
7 అతడికి తీర్పు జరిగినప్పుడు అతడు దోషి✽
అని రుజువవుతుంది గాక!
అతడి ప్రార్థన✽ పాపం అవుతుంది గాక!
8 అతడు బ్రతికే రోజులు కొద్దివే✽ అవుతాయి గాక!
అతడు ఉద్యోగం✽ మరొకరి పాలవుతుంది గాక!
9 ✽ అతడి పిల్లలు తండ్రి లేని వాళ్ళవుతారు గాక!
అతడి భార్య విధవరాలవుతుంది గాక!
10 ✝అతడి పిల్లలు బిచ్చగాండ్లయి
తిరుగులాడుతారు గాక!
పాడైపోయిన తమ ఇండ్లకు దూరమై
బ్రతుకుదెరువు కోసం వెదకుతారు గాక!
11 ✽అప్పులవాళ్ళు అతడికి ఉన్నదంతా
ఆక్రమించుకుంటారు గాక!
ఇతరుల చేతిలో అతడి కష్టార్జితం దోపిడీ
అవుతుంది గాక!
12 ✽అతడిమీద దయ చూపేవారెవ్వరూ
లేకపోతారు గాక!
తండ్రి లేని అతడి పిల్లలను జాలి
చూపేవారెవ్వరూ లేకపోతారు గాక!
13 ✝అతడి వంశం అంతరిస్తుంది గాక!
రాబోయే తరంలోనే వాళ్ళ నామరూపాలు
తుడిచి పెట్టుకుపోతాయి గాక!
14 ✝అతడి పూర్వీకుల అపరాధాలు యెహోవా
జ్ఞాపకం ఉంచుకుంటాడు గాక!
అతడి తల్లి చేసిన తప్పిదాలను
తుడిచివేయడం జరగదు గాక!
15 ✝భూమిమీద వాళ్ళ విషయం జ్ఞాపకమంటూ
మిగలకుండా యెహోవా నిర్మూలం
చేస్తాడు గాక!
వాళ్ళ పాపాలన్నీ ఆయన ఎదుట ఎప్పటికీ
కనిపిస్తాయి గాక!
16 ✽ఎందుకంటే, అతడు గుండె బ్రద్దలైనవాణ్ణి,
దీనదశలో, అక్కరలో ఉన్నవాణ్ణి హింసించాడు.
అతణ్ణి చంపాలని చూశాడు. అలాంటివారి మీద
దయ చూపాలనే తలంపే అతడికి రాలేదు.
17 ✽శాపం చెప్పడం అతడికి చాలా ఇష్టం.
అందుకని ఆ శాపమే అతడిమీదికి వచ్చింది.
ఆశీర్వచనం చెప్పడం అతడికి బొత్తిగా
ఇష్టం లేదు.
అందుచేత అది అతడికి దూరంగానే
ఉండిపోయింది.
18 శాపాన్ని వస్త్రంలాగా చుట్టుకొన్నాడు.
అది నీళ్ళలాగా అతడి కడుపులోకి చొరవ
చేసుకుపోయింది.
నూనెలాగా అతడి ఎముకల్లోకి దూరింది.
19 తాను కప్పుకొనే దుస్తులలాగా,
ఎప్పుడూ కట్టుకొనే నడికట్టులాగా అతణ్ణి
శాపం అంటిపెట్టుకొని ఉంటుంది గాక!
20 ✽ నా శత్రువులకు, నాకు విరోధంగా మాట్లాడే
వాళ్ళకు యెహోవావల్ల ప్రతీకారమే
కలుగుతుంది గాక!
21 ✽యెహోవా ప్రభూ, నీ పేరుకోసం
నాకు సహాయం చెయ్యి.
నీ అనుగ్రహం శ్రేష్ఠమైనది గనుక నన్ను
విడిపించు.
22 నేను దీనావస్థలో, అక్కర✽లో ఉన్నాను.
నా హృదయంలో పొడుచుకున్నట్టుంది✽.
23 సాయంత్రం నీడ✽లాగా నేను గతించిపోతూ ఉన్నాను.
మిడతలాగా నేను దులిపివేయబడ్డాను.
24 ✝ఉపవాసం ఉండడంచేత నా మోకాళ్ళకు బలం
లేకుండా పోయింది.
నా శరీరం లావు తగ్గింది, చిక్కిపోయింది.
25 ✝వాళ్ళ నిందలకు గురి అయ్యాను నేను.
నన్ను చూచి తల పంకిస్తారు.
26 ✽యెహోవా! నా దేవా! నాకు సహాయం చెయ్యి.
నీ అనుగ్రహాన్ని బట్టి నన్ను కాపాడు.
27 ఇందులో వాళ్ళు నీ చెయ్యి గుర్తుపట్టేలా చెయ్యి.
యెహోవావైన నీవే అలా చేశావని
తెలుసుకొనేలా చెయ్యి.
28 ✽వాళ్ళు నన్ను శపిస్తారు గాని నీవు నన్ను దీవిస్తావు.
వాళ్ళు విజృంభించినప్పుడు అవమానం
పాలౌతారు.
కానీ నీ సేవకుడు సంతోషిస్తాడు.
29 ✝నా విరోధులను అవమానం ఆవరిస్తుంది.
సిగ్గు వాళ్ళకు వస్త్రమై వాళ్ళను కప్పుతుంది.
30 ✝నా నోరారా యెహోవాకు అధికంగా కృతజ్ఞత
అర్పిస్తాను.
అనేకుల మధ్య ఆయనను స్తుతిస్తాను.
31 ✽దీనావస్థలో ఉన్నవాడి పక్షాన ఆయన
కుడివైపున నిలబడతాడు.
అతణ్ణి తీర్పుకు గురి చేసేవాళ్ళ బారినుంచి అతడి
ప్రాణాన్ని కాపాడుతాడు.