దావీదు కీర్తన. ఒక పాట.
108
1 నా హృదయం నిశ్చలంగా ఉంది, దేవా!
నా ఆత్మపూర్వకంగా పాటలు పాడుతాను,
సంకీర్తనం చేస్తాను.
2 తంతివాద్యమా, మేలుకో! విపంచికా, మేలుకో!
నేను ప్రొద్దున్నే, పెందలకడనే మేలుకొంటాను.
3 జనాలమధ్య నిన్ను స్తుతిస్తాను, యెహోవా.
ఇతర ప్రజల మధ్య నిన్ను కీర్తిస్తాను.
4 నీ అనుగ్రహం గొప్పది.
ఆకాశంకంటే ఎత్తయినది.
నీ సత్యం మేఘాలను అంటుతుంది.
5 దేవా, ఆకాశాలకంటే ఉన్నత స్థితిలో ఉన్నావని
బయలుపరచు.
భూతలమంతటి మీద నీ మహత్యం కనబడనియ్యి.
6 నీ ప్రజలకు విడుదల కలిగేలా నీ కుడి చేతితో
మమ్మల్ని రక్షించు.
మేము అడిగిన దానికి జవాబివ్వు.
7 తన పవిత్ర స్థలం నుంచి దేవుడు మాట ఇచ్చాడు:
“నేను ఆనందిస్తాను, షెకెం కనుమను పంచియిస్తాను,
సుక్కోతు లోయ కొలిపించి ఇస్తాను.
8 గిలాదు నాదే. మనష్షే నాదే.
ఎఫ్రాయిం నా శిరస్త్రాణం.
యూదా నా రాజదండం.
9 మోయాబు కాళ్ళు కడుక్కొనే నా పాత్ర.
ఎదోం మీదికి నా పాదరక్ష విసిరివేస్తాను.
ఫిలిష్తీయ మీద విజయ ధ్వనులు చేస్తాను.”
10 గోడ, కోట ఉన్న పట్టణానికి నన్ను
తీసుకువెళ్ళేవాడెవడు?
ఎదోంకు నన్ను వెంటబెట్టుకు వెళ్ళేవాడెవడు?
11 దేవా! నీవు మమ్మల్ని విసర్జించావు గదూ.
దేవా! మా సేనలతో నీవు రావడం
మానివేశావు గదూ.
12 శత్రువులను ఓడించడానికి మాకు సహాయం చెయ్యి.
మనిషి చేయగల సహాయం వృథా!
13 దేవుని ద్వారానే మేము విజయం సాధిస్తాం.
మా శత్రువులను ఆయనే అణగదొక్కివేస్తాడు.