అయిదో భాగం
(కీర్తనలు 107—150)
107
1 ✽యెహోవాకు కృతజ్ఞతలు✽ చెప్పుకోండి.ఆయన మంచివాడు.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
2 యెహోవా చేత విడుదల పొందినవారు✽
ఆ విధంగా చెప్పాలి✽.
ఆయన వారి విరోధుల చేతులలో నుంచి వారిని
విడిపించాడు.
3 ✽ఆయన వేరువేరు దేశాలనుంచి, తూర్పు,
పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి
వారిని విడిపించాడు.
4 ✽వారు ఎడారిలో, పాడు ప్రదేశంలో
తిరుగులాడారు.
తాము కాపురం చేయడానికి పట్టణం ఒక్కటీ
తమకు కనిపించలేదు.
5 ఆకలిదప్పుల చేత వారి ప్రాణం
కృశించిపోయింది.
6 ✽వారు కష్టదశలో యెహోవాకు మొర పెట్టారు.
వారి ఆపదల నుంచి ఆయన వారిని విడిపించాడు.
7 వారు నివసించగల పట్టణం చేరేందుకు చక్కని
దారిలో ఆయన వారిని నడిపించాడు.
8 ✽యెహోవా అనుగ్రహాన్ని బట్టీ,
ఆయన మనుషులకు చేసిన ఆశ్చర్యకరమైన
క్రియలనుబట్టీ వారు కృతజ్ఞతలు
అర్పిస్తారు గాక!
9 ✝ఆయన దప్పిగొన్న వారిని మంచి
పదార్థాలతో నింపాడు.
10 ✽✝దేవుని మాట వినక, ఎదురు తిరిగి,
సర్వాతీతుని సలహాలు కాలరాచినందుచేత
11 ✽ కొందరు చీకటిలో, చావు నీడలో జీవించారు,
దుర్దశలో ఇనుప సంకెళ్ళతో బంధించబడ్డారు.
12 అందుచేత ఆయన వారి హృదయాన్ని
ఆయాసం మూలంగా క్రుంగదీశాడు.
వారు కుప్పకూలారు.
సహాయం చేసేవాడెవడూ లేకపోయాడు.
13 వారు కష్ట దశలో యెహోవాకు మొరపెట్టారు.
వారి ఆపదల నుంచి ఆయన వారిని విడిపించాడు.
14 ✝చీకట్లోనుంచి, చావు నీడలో నుంచి ఆయన
వారిని వెలుపలికి తెచ్చాడు.
వారి బంధకాలు పటాపంచలు చేశాడు.
15 యెహోవా అనుగ్రహాన్ని బట్టీ,
ఆయన మనుషులకు చేసిన ఆశ్చర్యకరమైన
క్రియలను బట్టీ వారు కృతజ్ఞతలు
అర్పిస్తారు గాక!
16 ✽ ఆయన కంచు ద్వారాలను విరగ్గొట్టాడు.
ఇనుప గడియలను తుత్తునియలు చేశాడు.
17 ✽✝మూర్ఖులు తమ అక్రమ ప్రవర్తన కారణంగా,
తమ అపరాధాల కారణంగా బాధ
కొనితెచ్చుకొన్నారు.
18 భోజనం అంటే వారికి వెగటు అనిపించింది.
మరణ ద్వారానికి దగ్గరగా వచ్చారు.
19 ✝వారు కష్టదశలో యెహోవాకు మొరపెట్టారు.
వారి ఆపదలనుంచి ఆయన వారిని విడిపించాడు.
20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేశాడు.
వారు పడిన గుంటలో నుంచి వారిని విడిపించాడు.
21 యెహోవా అనుగ్రహాన్ని బట్టీ,
ఆయన మనుషులకు చేసిన ఆశ్చర్యకరమైన
క్రియలను బట్టీ వారు ఆయనకు
కృతజ్ఞతలు అర్పిస్తారు గాక!
22 ✝✽వారు కృతజ్ఞతతో నైవేద్యాలు అర్పిస్తారు గాక!
ఆయన క్రియలను ఆనంద ధ్వనులతో
ప్రకటిస్తారు గాక!
23 ✽కొందరు ఓడలలో సముద్ర ప్రయాణం చేస్తూ,
మహా జలాల మీద వెళ్తూ వ్యాపారం చేసేవారు.
24 యెహోవా చేసిన క్రియలను చూశారు వారు.
సముద్రంలో ఆయన చేసిన అద్భుతాలు చూశారు.
25 ✽ఆయన ఆజ్ఞ జారీ చేయగానే తుఫాను లేచింది.
దాని వల్ల అలలు పైకి లేచాయి.
26 వారు ఆకాశానికి పైకి ఎక్కారు,
జలాగాధంలోకి దిగివెళ్ళారు.
వారి జీవం దురవస్థ కారణంగా కరిగిపోయింది.
27 ✽త్రాగి కైపెక్కినవాడిలాగా వారు తూలుతూ,
అటు ఇటు ఊగుతూ ఉన్నారు.
వారి తెలివి కాస్తా శూన్యమైపోయింది.
28 వారు కష్టదశలో యెహోవాకు మొరపెట్టారు.
వారి ఆపదలనుంచి ఆయన వారిని విడిపించాడు.
29 ✝ఆయన తుఫానును నిమ్మళింపజేశాడు.
సముద్రం అలలు సద్దుమణిగాయి.
30 అవి అణిగాయని వారు సంతోషించారు.
వారు కోరిన రేవుకు ఆయన వారిని చేర్చాడు.
31 యెహోవా అనుగ్రహాన్ని బట్టీ,
ఆయన మనుషులకు చేసిన ఆశ్చర్యకరమైన
క్రియలను బట్టీ వారు ఆయనకు
కృతజ్ఞతలు అర్పిస్తారు గాక!
32 ✝ప్రజా సమాజాలలో వారు ఆయనకు ఘనత
కలిగిస్తారు గాక!
పెద్దల సభలలో ఆయనను కీర్తిస్తారు గాక!
33 ✽✝అక్కడ కాపురమున్న మనుషుల చెడుగును బట్టి
ఆయన నదులను ఎడారిగా మార్చాడు.
34 నీటి ఊటలను ఎండిన నేలగా మార్చాడు.
సారవంతమైన భూమిని చవిటి నేలగా మార్చాడు.
35 ✝ఆయన ఎడారిని నీటి మడుగులుగా మార్చాడు.
ఎండిన భూమిని నీటి ఊటల స్థలంగా మార్చాడు.
36 ఆకలిగొన్న వారిని అక్కడ కాపురముంచాడు.
వారు నివాసయోగ్యమైన పట్టణం కట్టారు.
37 వారు పొలాలు సేద్యం చేసుకొన్నారు.
ద్రాక్ష తోటలు నాటారు.
మంచి ఫలసాయం సంపాదించుకొన్నారు.
38 ఆయన వారిని ఆశీర్వదించాడు.
వారి సంఖ్య అధికంగా పెరిగింది.
వారి పశుసంపద ఏమీ తగ్గకుండా చేశాడు.
39 అప్పుడు వారు విపత్తు ఒత్తిడికి, బాధకు,
శోకానికి గురి అయి కృశించిపోయారు.
వారి సంఖ్య కూడా తగ్గిపోయింది.
40 ✽ యెహోవా రాజులను లెక్క చెయ్యలేదు.
దారీ తెన్నూ లేని పాడు ప్రదేశంలో వారు
తిరిగేలా చేశాడు.
41 ✝అక్కరలో ఉన్నవారిని బాధనుంచి
క్షేమ స్థితికి లేవనెత్తాడు.
వారి కుటుంబాలను మందలాగా వృద్ధి చేశాడు.
42 ✽నిజాయితీపరులు ఇది చూచి సంతోషిస్తారు.
దుర్మార్గులంతా నోళ్ళు మూసుకొంటారు.
43 ✽జ్ఞానులు ఈ విషయాలు పాటిస్తారు,
యెహోవా చూపే మహా అనుగ్రహాన్ని గుర్తిస్తారు.