106
1 ✽✝యెహోవాను స్తుతించండి. ఆయన మంచివాడు.ఆయనకు కృతజ్ఞత చెప్పండి.
ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
2 ✝యెహోవా బల ప్రభావాలను వర్ణించడం
ఎవరి తరం?
ఆయన కీర్తినంతా ఎవరు వినిపించగలరు?
3 ✝ధర్మ సమ్మతంగా నడుచుకొనేవారు ధన్యులు.
ఎల్లవేళలా న్యాయంగా ప్రవర్తించేవారు ధన్యజీవులు.
4 ✝యెహోవా, నీ ప్రజలమీద నీకున్న దయప్రకారం
నన్ను తలచుకో.
నీ రక్షణతో నన్ను సందర్శించు.
5 ✝అలాగైతే నీవు ఎన్నుకొన్నవారి క్షేమం నన్ను
చూడనియ్యి.
నీ ప్రజల ఆనందంలో నన్ను పాల్గొననియ్యి.
నీ సొత్తుగా ఉన్న ప్రజతో పాటు నన్ను
సన్నుతి చేయనియ్యి.
6 ✽మా పూర్వీకులలాగే మేమూ తప్పిదాలు చేశాం.
అపరాధులమయ్యాం. దుర్మార్గాలు చేశాం.
7 మా పూర్వీకులకు ఈజిప్ట్‌లో నీ అద్భుతాలు
అర్థం కాలేదు.
నీ అనుగ్రహ సమృద్ధిని వాళ్ళు తలచుకోలేదు✽.
సముద్రం దగ్గర – ఆ ఎర్ర సముద్రం దగ్గర
తిరుగుబాటు✽ చేశారు.
8 అయినా తన బలప్రభావాలను ప్రదర్శించేందుకు
తన పేరుకోసం ఆయన వారిని రక్షించాడు.
9 ✽ ఆయన ఎర్ర సముద్రాన్ని మందలించాడు.
అది ఎండిపోయింది. ఎడారిలో నడిచినట్టు వారిని
ఆ జలాగాధం గుండా నడిచేలా చేశాడు.
10 పగ బూనినవాళ్ళ బారినుంచి వారిని తప్పించాడు.
శత్రువుల బారినుంచి వారికి విడుదల
ప్రసాదించాడు.
11 నీళ్ళు వారి విరోధులను ముంచివేశాయి.
వాళ్ళలో ఒక్కడూ మిగలలేదు.
12 అప్పుడు ఇస్రాయేల్‌వారు ఆయన చెప్పినది
నమ్మారు.
ఆయనను స్తుతిస్తూ పాటలు పాడారు.
13 ✽✝అయినా ఆయన చేసిన క్రియలు వారు
త్వరలో మరచిపోయారు.
ఆయన ఇచ్చే సలహా కోసం వారు చూడలేదు.
14 వారు ఎడారిలో పేరాశకు లోనయ్యారు.
ఆ పాడు ప్రదేశంలో దేవుణ్ణి పరీక్షించారు.
15 ✽ దేవుడు వారి కోరిక నెరవేర్చాడు.
అయినా, వారి ప్రాణాలు క్షీణించిపోయేలా
చేశాడాయన.
16 ✝వారి శిబిరంలో మోషేమీద అసూయపడ్డారు.
యెహోవా ప్రత్యేకించిన అహరోనుమీద కూడా
వారికి అసూయ కలిగింది.
17 అప్పుడు భూమి నోరు తెరచి, దాతానును
మింగివేసింది.
అబీరాం బృందంవాళ్ళను ఆవరించింది.
18 వాళ్ళ జట్టుకు నిప్పంటుకొంది.
ఆ దుర్మార్గులను కాల్చివేసింది ఆ మంట.
19 ✝హోరేబ్‌దగ్గర వాళ్ళు దూడ రూపాన్ని
చేయించుకొన్నారు.
పోతపోసిన ఆ విగ్రహాన్ని పూజించారు.
20 ✽ తమ ఘనతకు బదులు గడ్డి మేసే
ఎద్దు రూపాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.
21 ✝ఈజిప్ట్‌లో అద్భుతాలు చేసిన తమ
రక్షకుడైన దేవుణ్ణి మరచిపోయారు.
22 ✽ఆ హాము దేశంలో ఆశ్చర్యకరమైన క్రియలు
చేసిన తమ దేవుణ్ణి,
ఎర్ర సముద్రం దగ్గర భయభక్తులు
కలిగించే క్రియలు చేసిన తమ దేవుణ్ణి
మరచిపోయారు.
23 ✝కనుక ఆయన “వారిని నాశనం చేస్తాను అన్నాడు.
కానీ ఆయన ఎన్నుకొన్న మోషే ఆయన ఎదుట
బీటలో నిలిచి,
ఆయన కోపం వారిని ధ్వంసం చేయకుండా చేశాడు.
కాబట్టి సరిపోయింది.
24 ✽ తరువాత వారు మనోహరమైన దేశాన్ని
తిరస్కరించారు.
వారు ఆయన మాట నమ్మారు కారు.
25 ✝యెహోవా మాట వినక, తమ డేరాలలో
సణుగుకొన్నారు.
26 ✽ అప్పుడాయన వారిని ఎడారిలో కూల్చివేస్తానని
వారికి శపథం చేశాడు.
27 ✝ఇతర జనాలమధ్య వారి సంతానాన్ని
కూలగొట్టివేస్తాననీ వేరు వేరు దేశాలలో
వారిని చెదరగొట్టివేస్తాననీ
ఒట్టు వేసుకొన్నాడు.
28 ✽ తరువాత వారు పెయోర్‌లోని బయల్‌దేవుడితో
చేరారు.
చచ్చినవాళ్ళకు అర్పించిన బలులు తిన్నారు.
29 తమ చర్యలచేత ఆయనకు కోపం రేపారు.
అందుచేత వారిమధ్య విపత్తు
ఆరంభమైంది.
30 ఫీనెహాస్‌నిలబడి న్యాయ శిక్ష జరిగించాడు.
కనుక ఆ విపత్తు ఆగిపోయింది.
31 అన్ని తరాలకూ శాశ్వతంగా అది అతనికి
నిర్దోషత్వంగా పరిగణించబడింది.
32 ✝మెరీబా నీళ్ళదగ్గర వారు దేవుని కోపం రేపారు.
అందుచేత వారి మూలంగా మోషే
బాధకు గురి అయ్యాడు.
33 వారు దేవుని ఆత్మను ఎదిరించారు.
కనుక అతని పెదవుల వెంట పొరపాటు మాట
వచ్చింది.
34 ✽✝తరువాత యెహోవా నాశనం చెయ్యాలని చెప్పిన
జనాలను వారు నాశనం చేయలేదు.
35 ఇతర జనాలతో కలిసిపోయి వారి పనులు
నేర్చుకొన్నారు.
36 ఆ జనాల విగ్రహాలకు పూజ చేశారు.
అవి వారికి ఉరిగా ఉన్నాయి.
37 ✝వారు తమ కొడుకులను,
కూతుళ్ళను దయ్యాలకు బలి ఇచ్చారు.
38 ✝అమాయకుల రక్తం, తమ కొడుకుల,
కూతుళ్ళ రక్తం ఒలికించారు.
కనాను దేశస్థుల విగ్రహాలకు వారిని రక్త
బలులుగా అర్పించారు.
ఈ రక్తపాతం చేత దేశం అపవిత్రమయింది.
39 వారు తమ క్రియలద్వారా అపవిత్రులయ్యారు.
తమ చర్యలలో వేశ్యలాగా✽ ప్రవర్తించారు.
40 కనుక యెహోవా కోపం✽ ఆయన ప్రజల మీద
రగులుకుంది.
తన సొత్తుగా ఉన్న జనంమీద ఆయనకే
అసహ్యం వేసింది.
41 ✝ఇతర జనాల చేతికి వారిని అప్పగించాడు.
వారి పగవాళ్ళు వారి మీద ప్రభుత్వం చేశారు.
42 ✝వారి శత్రువులు వారిని అణగద్రొక్కారు.
ఆ శత్రువుల చేతిక్రింది వారు
తలవొగ్గక తప్పలేదు.
43 ✝చాలాసార్లు ఆయన వారిని విడిపించాడు.
అయినా వారు తమ ఆలోచనలనే అనుసరించి
తిరగబడ్డారు.
తమ అపరాధం చేత దురవస్థ చెందారు.
44 ✽అయినా వారి మొర ఆయన విన్నప్పుడు
వారి కష్టదశ ఆయన చూశాడు.
45 వారి నిమిత్తం ఆయన తన ఒడంబడికను
తలచుకొన్నాడు.
తన గొప్ప కృపను బట్టి వారిని కనికరించాడు.
46 వారిని చెరపట్టిన వాళ్ళందరికీ వారి మీద జాలి
పుట్టేలా చేశాడాయన.
47 ✝మా దేవా, యెహోవా, మమ్ముల్ని రక్షించు!
మేము నీ పవిత్రమైన పేరుకు కృతజ్ఞత
అర్పించేలా,
నిన్ను స్తుతించడంలో మాకు అతిశయం కలిగేలా
ఇతర జనాల మధ్య నుంచి మమ్ముల్ని సమకూర్చు.
48 ✽ ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవాకు
శాశ్వతంగా స్తుతి కలుగుతుంది గాక!
ప్రజలంతా తథాస్తు అంటారు గాక!
యెహోవాను స్తుతించండి!