105
1 యెహోవాకు కృతజ్ఞత అర్పించండి.
ఆయన పేర ప్రార్థన చేయండి.
ఆయన క్రియలను జనాలకు తెలపండి.
2 ఆయనను ఉద్దేశించి పాటలు పాడండి,
స్తుతి గీతాలు చేయండి.
ఆయన చేసే అద్భుతాలన్నిటిని గురించి
కబుర్లాడుకోండి.
3 ఆయన పవిత్రమైన పేర అతిశయించండి.
యెహోవాను వెదికేవారి హృదయం ఆనందిస్తుంది.
4 యెహోవాను, ఆయన బలాన్ని వెదకండి.
ఆయన ముఖ సందర్శనాన్ని ఎప్పటికీ వెదకండి.
5  ఆయన సేవకుడైన అబ్రాహాము వంశమా!
ఆయన ఎన్నుకొన్న యాకోబు సంతానమా!
6 ఆయన చేసిన అద్భుతాలను జ్ఞాపకం ఉంచుకోండి.
ఆయన చేసిన ఆశ్చర్యకరమైన క్రియలు,
ఆయన నోటినుంచి వెలువడే న్యాయ నిర్ణయాలు
జ్ఞాపకం చేసుకోండి.
7  ఆయన మన దేవుడైన యెహోవా.
ఆయన తీర్పులు లోకంలో
అంతటా జరుగుతున్నాయి.
8 తాను చెప్పిన మాట వెయ్యి తరాలు ఆయన
జ్ఞాపకం ఉంచుకుంటాడు.
9 ఇస్సాకుకు ఆయన చేసిన ప్రమాణం,
ఆయన ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాడు.
10 ఆయన దానిని యాకోబుకు చట్టంగా స్థిరపరచాడు.
ఇస్రాయేల్‌కు శాశ్వతమైన ఒప్పందంగా
సుస్థిరం చేశాడు.
11 ఆయన మాట ఇచ్చాడు –
“కనానుదేశం మీకు వారసత్వంగా ఇస్తాను.
అది మీ భాగం”.
12 అప్పుడు వారిని సులభంగా లెక్క పెట్టవచ్చు.
ఆ కొద్దిమంది ఆ దేశంలో పరాయివారుగా ఉన్నారు.
13 దేశంనుంచి దేశానికి తిరుగాడారు వారు.
ఒక రాజ్యంనుంచి ఇంకో రాజ్యానికి తిరిగారు.
14  యెహోవా “నేను అభిషేకించిన వారిని
మీరు ముట్టకూడదు.
నా ప్రవక్తలకు హాని చెయ్యకూడదు” అంటూ
15 ఎవరినీ వారికి హాని చెయ్యనియ్యలేదు.
వారి పక్షాన రాజులను ఆయన హెచ్చరించాడు.
16  కనాను దేశానికి కరవు వచ్చేలా చేశాడాయన.
జీవనాధారమైన ఆహారం దొరకకుండా చేశాడు.
17 వారికి ముందుగా ఆయన యోసేపును పంపాడు.
వారు అతణ్ణి బానిసగా అమ్మివేశారు.
18 అతని కాళ్లకు సంకెళ్ళు వేసి బాధించారు.
ఇనుప గొలుసులతో అతణ్ణి బాధించారు.
19 అతని మాట నెరవేరేవరకూ యెహోవా వాక్కు
అతణ్ణి పరీక్షించింది.
20 తరువాత రాజు కబురు పెట్టి,
అతణ్ణి చెరసాలలో నుంచి విడిపించాడు.
జనాల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు.
21 తన సామంతులను యోసేపు ఇష్టప్రకారం
కట్టుబాటులో ఉంచడానికీ,
తన పెద్దలకు జ్ఞానం కలిగించడానికీ
22 తన ఇంటి మీద అతణ్ణి అధిపతిగా నియమించాడు.
తన ఆస్తి అంతటిమీదా అతనికి యాజమాన్యం
అప్పగించాడు.
23 తరువాత ఇస్రాయేల్‌ఈజిప్ట్‌కు వచ్చాడు.
హాము దేశంలో యాకోబు ప్రవాసం చేశాడు.
24 యెహోవా తన ప్రజలకు అధిక సంతానాన్ని
కలిగించాడు.
శత్రువులకు మించిన బలం వారికి ఇచ్చాడు.
25  అక్కడివారు తన ప్రజలను ద్వేషించేలా,
తన సేవకుల పట్ల కపటంతో వ్యవహరించేలా
వారి హృదయాలలో పని చేశాడు.
26 ఆయన తన సేవకుడైన మోషేను పంపాడు.
తాను ఎన్నుకొన్న అహరోనును పంపాడు.
27 వారు వాళ్ళ మధ్య దేవుని ఆశ్చర్యకరమైన
క్రియలు జరిగించారు.
ఆ హాము దేశంలో అద్భుతాలు చేశారు.
28 యెహోవా చీకటిని పంపాడు. చీకటి అంతటా
ఆవరించేలా చేశాడు.
వాళ్ళు ఆయన మాటకు ఎదురాడలేదా?
29 వాళ్ళ నీళ్ళను నెత్తురుగా మార్చాడు.
వాళ్ళ చేపలను ఈ విధంగా చంపాడు.
30 వాళ్ళ దేశం కప్పలతో నిండిపోయింది.
పరిపాలకుల ఇండ్లలోని గదులు కూడా
వాటితో నిండిపోయాయి.
31 ఆయన ఆజ్ఞ మేరకు జోరీగలు వచ్చాయి.
వాళ్ళ దేశమంతటా దోమలు ముసురుకొన్నాయి.
32 వాళ్ళ మీదికి వడగండ్ల వాన పంపాడాయన.
వాళ్ళ దేశంలో మంటలు పుట్టించాడు.
33 వాళ్ళ ద్రాక్షచెట్లూ, అంజూరు వృక్షాలూ
పడగొట్టాడాయన.
వాళ్ళ సరిహద్దులలో ఉన్నచెట్లను విరగ్గొట్టాడు.
34 ఆయన ఆజ్ఞ ఇస్తే ఎగిరే మిడతలు వచ్చి పడ్డాయి.
లెక్కలేనంతగా గొల్లభామ పురుగులు వచ్చాయి.
35 వాళ్ళ దేశంలో పచ్చని మొక్కలన్నిటినీ
అవి తినివేశాయి.
వాళ్ళ పంట చేలను పొట్టన పెట్టుకొన్నాయి.
36 వాళ్ళ దేశంలో మొదట పుట్టిన
కొడుకులందరినీ ఆయన హతమార్చాడు.
వాళ్ళ బలంవల్ల కలిగిన ఆ తొలి సంతానాన్ని
ఆయన చంపాడు.
37 ఆయన ఇస్రాయేల్‌వారిని బయటికి రప్పించాడు.
వారు వెండి బంగారాలు తెచ్చారు.
ఆయన గోత్రాలలో తొట్రుపడేవారెవరూ లేరు.
38 వారంటే ఈజిప్ట్‌వాళ్ళకు భయం పట్టుకొంది.
వారు వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు సంతోష పడ్డారు.
39 వాళ్ళను కప్పడానికి తెరలాగా మేఘాన్ని
పరిచాడాయన.
రాత్రిలో వెలుగుకోసం మంటలను దయచేశాడు.
40 వారు కోరుకొన్నట్టే ఆయన పూరేడు
పిట్టలను రప్పించాడు.
ఆకాశం నుంచి వచ్చే ఆహారంతో వారిని
తృప్తి పరిచాడు.
41 ఆయన బండను చీల్చాడు.
అందులో నుంచి నీళ్ళు ఉబికి వచ్చాయి.
ఆ నీరు నదిలాగా ఎడారి స్థలాలలో పారింది.
42 ఆయన తన పవిత్ర వాక్కునూ,
తన సేవకుడైన అబ్రాహామునూ
జ్ఞాపకం ఉంచుకొన్నాడు.
43 ఆయన తన ప్రజలను సంతోషంతో
బయటికి తీసుకువచ్చాడు.
తాను ఎన్నుకొన్న ప్రజలను ఆనంద ధ్వనులతో
రప్పించాడు.
44 ఇతర ప్రజల భూములను ఆయన వీరికిచ్చాడు.
వాళ్ళ కష్టార్జితం వీరు స్వాధీనం చేసుకొన్నారు.
45 తద్వారా వారు తన చట్టాలను పాటించాలనీ,
తన ఉపదేశాలను ఆచరణలో పెట్టాలనీ
ఆయన ఇదంతా చేశాడు.
యెహోవాను స్తుతించండి!