104
1 నా మనసా, యెహోవాను కీర్తించు.
యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడివి!
వైభవం, తేజస్సు ధరించుకొన్న వాడివి!
2  వెలుగును వస్త్రంలాగా కప్పుకొని ఉన్నావు నీవు.
తెరలాగా ఆకాశాలను పరచి ఉన్నావు.
3 వాటి జలాలలో తన మేడగదుల దూలాలు
వేసి ఉంచాడాయన.
ఆయన మేఘాలను రథంగా చేసుకొంటాడు.
గాలి రెక్కలమీద ప్రయాణం చేస్తాడు.
4 తన దూతలను గాలివంటివారుగా,
తన సేవకులను మంటలవంటివారుగా చేసుకొనేవాడు.
5  ఆయన భూమిని దాని పునాదులమీద సుస్థిరం చేశాడు.
అది ఎన్నడూ దాని స్థానంనుంచి తప్పిపోకుండా
చేశాడు.
6 దేవా, నీవు భూమిమీద జలాగాధాన్ని దుస్తులలాగా
కప్పావు.
కొండల మీద నీళ్ళు నిలిచాయి.
7 నీ మందలింపుకు నీళ్ళు పారిపొయ్యాయి.
నీ ఉరుముల స్వరం విని అవి త్వరత్వరగా
పలాయనం అయ్యాయి.
8 పర్వతాలు ఎక్కుతూ, పల్లాలకూ దిగుతూ,
వాటికి నీవు నిర్ణయించిన చోట్లకు అవి వెళ్ళాయి.
9 వాటికి నీవు సరిహద్దులను నియమించావు.
అవి సరిహద్దులను దాటవు.
అవి మళ్ళీ వచ్చి భూమిని కప్పివేయవు.
10  యెహోవా లోయలలో ఊటలను పుట్టిస్తున్నాడు.
కొండలమధ్య అవి ప్రవహిస్తాయి.
11 అవి అడవి మృగాలన్నిటికీ దప్పి తీరుస్తున్నాయి.
వాటివల్ల అడవిగాడిదెలు దాహం తీర్చుకుంటాయి.
12 గాలిలో ఎగిరే పక్షులకు ఆ వాగులకు పైగా
ఉనికిపట్టు ఉంటుంది.
కొమ్మలమధ్య అవి గొంతెత్తి పాడుతున్నాయి.
13 తన మేడ గదులలో నుంచి ఆయన కొండలను
తడుపుతాడు.
దేవా, నీ క్రియకు ఫలితంగా భూమికి తృప్తి
కలుగుతుంది.
14 పశువులకు గడ్డి, మనుషుల ఉపయోగానికి
కూరమొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు.
తద్వారా భూసారంలో నుంచి మనిషికి ఆహారం
కలుగజేస్తున్నాడు.
15 మనిషికి హృదయానందం కలిగించే ద్రాక్షరసం,
వాళ్ళ ముఖాలకు ప్రకాశం కలిగించే నూనె,
గుండె బలం చేకూర్చే ఆహారం ఆయన ఇస్తున్నాడు.
16 యెహోవా చేసిన వృక్షాలు సంతృప్తిగా ఉన్నాయి.
ఆయన నాటిన లెబానోన్‌దేవదారు చెట్లు
సంతుష్టిగా ఉన్నాయి.
17 పక్షులు అక్కడ గూళ్ళు కట్టుకుంటాయి.
సరళ వృక్షాల మీద కొంగలు నివాసం
ఏర్పరచుకొంటాయి.
18 ఎత్తైన కొండలలో అడవి మేకపోతులు
ఉంటాయి.
కుందేళ్ళు బండ సందుల్లో దాగుకొంటాయి.
19  ఋతువులను చంద్రగోళం సూచిస్తుంది.
ప్రొద్దు క్రుంకవలసిన సమయమేదో తనకు తెలుసు.
20 నీవు చీకటి చేయబట్టే రాత్రి కలుగుతుంది.
రాత్రిపూట అడవి మృగాలు తిరుగాడుతాయి.
21 సింహం పిల్లలు వేట మాంసం కోసం గర్జిస్తాయి.
తమ ఆహారం దేవుని దగ్గరనుంచి వెదకుతాయి.
22 ప్రొద్దు పొడవడంతోనే అవి తమ గుహలకు
తిరిగి వెళ్ళి పడుకుంటాయి.
23 అప్పుడు మనుషులు సాయంకాలం వరకు
శ్రమించి పని చేసేందుకు బయలుదేరుతారు.
24  యెహోవా, నీ కార్యకలాపాలు ఎన్నో ఉన్నాయి!
జ్ఞానంతో నీవు వాటన్నిటినీ చేశావు.
నీవు నిర్మించిన వాటితో భూమి నిండిపోయింది.
25 అదుగో మహా సముద్రం. అదెంతో విశాలం!
అందులో పెద్దవీ చిన్నవీ లెక్క పెట్టలేనన్ని
జీవరాసులు ఉన్నాయి.
26 అందులో ఓడలు కదిలిపోతున్నాయి.
అందులో క్రీడించేందుకు నీవు నిర్మించిన
బ్రహ్మాండమైన ప్రాణులు ఉన్నాయి.
27 సరైన వేళకు నీవు వాటికి తిండి పెట్టాలని
అవన్నీ నీ వైపు ఆశతో చూస్తాయి.
28 నీవు వాటికి ఆహారం ఇస్తే,
అవి సమకూర్చుకొంటాయి.
నీవు గుప్పిలి విప్పితే, అవి మంచి
పదార్థాలతో తృప్తి చెందుతాయి.
29 నీ ముఖం కనబడకుండా నీవు చేస్తే,
అవి భయంతో వణుకుతాయి.
వాటి ప్రాణం తీసుకొన్నప్పుడు అవి అంతరించి
పోతాయి. మట్టి పాలవుతాయి.
30 నీ ఆత్మను పంపినప్పుడు అవి ఉనికిలోకి వస్తాయి.
నీవు భూతలాన్ని నవనూతనం చేస్తావు.
31 యెహోవా ఘనత శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా తన క్రియాకలాపాలలో
ఆనందిస్తాడు.
32 ఆయన భూమివైపు చూస్తే చాలు,
అది కంపించిపోతుంది.
ఆయన కొండలను తాకితే చాలు,
అవి పొగలు వెళ్లగ్రక్కుతాయి.
33  నేను బ్రతికి ఉన్నంతకాలం యెహోవాకు
పాటలు పాడుతాను.
నాకు ఉనికి ఉన్నంతవరకూ నా దేవునికి
స్తుతిగానం చేస్తాను.
34 ఆయనను గురించిన నా ధ్యానం ఆయనకు
సంతోషకరంగా ఉంటుంది.
నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను.
35 పాపాత్ములు భూమిమీద లేకుండా
పోతారు గాక!
దుర్మార్గులు నాశనమైపోతారు గాక!
యెహోవాను కీర్తించు, నా మనసా!
యెహోవాను కీర్తించు!