దావీదు కీర్తన
103
1 నా మనసా, యెహోవాను కీర్తించు.
నాలో ఉన్న సమస్తమా, ఆయన పవిత్రమైన
పేరును కీర్తించు.
2  నా మనసా, యెహోవాను కీర్తించు.
ఆయన చేసిన ఉపకారాలలో దేనినీ మరువకు.
3 ఆయన నీ అపరాధాలన్నీ క్షమిస్తున్నాడు.
నీ రోగాలన్నీ ఆయన పూర్తిగా నయం చేస్తున్నాడు.
4 నాశనకరమైన గోతిలో నుంచి నీ ప్రాణాన్ని
విడుదల చేశాడు.
అనుగ్రహమూ, వాత్సల్యమూ నీమీద కిరీటంగా
ఉంచాడు.
5 మంచివాటితో నీ ఆశలను తృప్తిపరుస్తాడు.
తద్వారా నీ యువత గరుడపక్షిలాగా కొత్తదనం
సంతరించుకొంటుంది.
6 యెహోవా యుక్తమైన క్రియలు జరిగిస్తాడు.
హింసకు గురి అయిన వారందరికీ ఆయన
న్యాయం చేకూరుస్తాడు.
7 ఆయన మోషేకు తన విధానాలు చూపాడు.
ఇస్రాయేల్‌ప్రజలకు తన చర్యలు చూపాడు.
8 యెహోవా దయగలవాడు,
మృదుల వాత్సల్యం చూపేవాడు,
త్వరగా కోపపడనివాడు, కరుణామయుడు.
9 ఆయన ఎల్లప్పుడూ మనతో వాదించేవాడు కాడు.
ఎల్లప్పుడూ కోపం పెట్టుకొనేవాడు కాడు.
10  ఆయన మన పాపాలను బట్టి మనలను అంతగా
దండించినవాడు కాడు.
మన అపరాధాలను బట్టి ప్రతీకారం చేసినవాడు కాడు.
11  భూమికి పైగా ఆకాశం ఎంత ఎత్తో తనంటే
భయభక్తులున్న వారిమీద ఆయన కరుణ
అంత ఎక్కువ.
12 పడమటికీ తూర్పుకూ మధ్య దూరమెంతో
మన అతిక్రమాలను కూడా మననుంచి
అంత దూరం చేశాడాయన.
13 తండ్రి తన పిల్లలను జాలితో చూచినట్టు
యెహోవా తనపట్ల భయభక్తులు గలవారిని
కూడా జాలితో చూచుకుంటాడు.
14 మన స్వభావం ఎలాంటిదో ఆయనకు తెలుసు.
మనం మట్టివాళ్ళమని ఆయనకు జ్ఞాపకం.
15 మనిషి రోజులు గడ్డిలాంటివి.
వికసించే అడవిపువ్వులాగా అతడు ఉన్నాడు.
16 దాని మీద గాలి వీచిందీ అంటే అది ఇంక ఉండదు.
అది ఉన్న చోటుకు అదేదో తెలియకుండా
అయిపోతుంది.
17 కానీ తన ఒడంబడిక పాటించి,
తన ఆదేశాల ప్రకారం ప్రవర్తించడానికి
వాటిని మనసులో ఉంచుకొన్నవారికి
తరతరాలుగా యెహోవా నీతిన్యాయాలు
ఉంటాయి.
18 తనంటే ఎవరికీ భయభక్తులున్నాయో వారిని
ఆయన శాశ్వతంగా అనుగ్రహంతో చూస్తాడు.
19 యెహోవా పరలోకంలో తన సింహాసనం
సుస్థిరంగా నెలకొల్పాడు.
ఆయన రాజ్యం విశ్వాన్ని పరిపాలిస్తూ ఉంది.
20 యెహోవా దూతలారా!
ఆయన ఆజ్ఞలను శిరసావహించి,
వాటి ప్రకారం పని చేసే బలాఢ్యులైన మీరంతా
యెహోవాను కీర్తించండి.
21 యెహోవా సైన్యాల్లారా!
ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా
యెహోవాను కీర్తించండి.
22 యెహోవా సర్వ పరిపాలన క్రింద ఉన్న
ఆయన సర్వ సృష్టమా!
యెహోవాను కీర్తించండి.
నా మనసా! యెహోవాను కీర్తించు!